ట్రైబల్ కార్పొరేషన్ రుణాలపై కలెక్టర్ సమీక్షా సమావేశం

asifa

మన తెలంగాణ/ఆసిఫాబాద్ : సమగ్ర గిరిజన భూ అభివృద్ధి పథకం కింద ఎస్‌టి లబ్ధిదారులకు ట్రైబల్ కార్పొరేషన్ రుణాలపై శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా, మండల స్థాయి అభివృద్ధి అధికారులతో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత నెలలో జరిగిన సమావేశం నుండి ఇప్పటి వరకు పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. 5 ఎకరాల సొంత భూమి ఉన్న ఎస్‌టి లబ్ధిదారులకు బోర్లు లేనిచోట బోర్లు వేయడం, విద్యుత్ లేని చోట విద్యుత్, పంప్‌సెట్లు వేయడం జరుగుతుందన్నారు. ఇందులో మూడు కేటగిరిల వారీగా ఎంపిక చేయాలన్నారు. ఒకటవ కేటగిరిలో భూమి, బోరు ఉండి విద్యుత్ సరఫరాల లేనివారిని గుర్తించాలని, రెండవ కేటగిరిలో బోరు ఉండి విద్యుత్ కనెక్షన్ లేనివి సర్వే చేసి వాటిని గుర్తించాలన్నారు. మూడవ కేటగిరిలో నివేదికలు పంపించాలన్నారు. 851 బ్లాకులలో ఎస్‌టి లబ్ధిదారులు 5794 ఏరియా వైజ్‌గా 22509.46గా ఉన్నట్లు ఆయన తెలిపారు. స్థానిక ఎంపిడిఒలు, ఎపిఎంలు, సంబంధిత అధికారులు సకాలంలో పనులను పూర్తిచేసి వచ్చే నెల 4వ తేదీలోగా నివేదికలు పంపించాలన్నారు. ఈ సమావేశంలో డిఆర్‌డిఒ పిడి వెంకట్, జిల్లా అధికారులు, ఎంపిడిఒలు, ఎపిఎంలు, తదితరులు పాల్గొన్నారు.