టైటిల్ వేటకు జకోవిచ్,డెల్‌పొట్రో…

గాయంతో నాదల్ ఔట్, నిషికోరి ఓటమి న్యూయార్క్: సెర్బియా యోధుడు నొవాక్ జకోవిచ్, అర్జెంటీనా స్టార్ మార్టిన్ డెల్‌పొట్రో యుఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఫైనల్‌కు చేరుకున్నారు. టాప్ సీడ్, డిఫెండింగ్ చాంపియన్ రఫెల్ నాదల్ (స్పెయిన్) గాయం వల్ల పోటీ నుంచి మధ్యలోనే నిష్క్రమించాడు. దీంతో డెల్‌పొట్రో ఫైనల్‌కు దూసుకెళ్లాడు. అప్పటికే స్పెయిన్ బుల్ నాదల్ రెండు సెట్లు కోల్పోయాడు. డెల్‌పొట్రో అప్పటికే 76, 62తో ఆధిక్యంలో ఉన్నాడు. మరో సెమీస్‌లో మాజీ చాంపియన్, […]

గాయంతో నాదల్ ఔట్, నిషికోరి ఓటమి

న్యూయార్క్: సెర్బియా యోధుడు నొవాక్ జకోవిచ్, అర్జెంటీనా స్టార్ మార్టిన్ డెల్‌పొట్రో యుఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఫైనల్‌కు చేరుకున్నారు. టాప్ సీడ్, డిఫెండింగ్ చాంపియన్ రఫెల్ నాదల్ (స్పెయిన్) గాయం వల్ల పోటీ నుంచి మధ్యలోనే నిష్క్రమించాడు. దీంతో డెల్‌పొట్రో ఫైనల్‌కు దూసుకెళ్లాడు. అప్పటికే స్పెయిన్ బుల్ నాదల్ రెండు సెట్లు కోల్పోయాడు. డెల్‌పొట్రో అప్పటికే 76, 62తో ఆధిక్యంలో ఉన్నాడు. మరో సెమీస్‌లో మాజీ చాంపియన్, ఆరో సీడ్ జకోవిచ్ 63, 64, 62 తేడాతో జపాన్ ఆశాకిరణం నిషికోరిను చిత్తు చేసి టైటిల్ వేటకు చేరుకున్నాడు. ఇప్పటికే వింబుల్డన్ ఓపెన్ టైటిల్ గెలిచి జోరుమీదున్న జకోవిచ్ తాజాగా యుఎస్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరి పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తున్నాడు. ఫైనల్లో జకోవిచ్ అర్జెంటీనా వీరుడు డెల్‌పొట్రోతో తలపడుతాడు.
ప్రారంభం నుంచే…
నిషికోరితో జరిగిన పోరులో జకోవిచ్ ప్రారంభం నుంచే చెలరేగి ఆడాడు. చూడచక్కని షాట్లతో లక్షం దిశగా అడుగులు వేశాడు. అద్భుత ఫాంలో ఉన్న జకోవిచ్ ధాటికి జపాన్ స్టార్ ఎదురు నిలువలేక పోయాడు. ప్రత్యర్థిని కోర్టు నలుమూలలా పరిగెత్తించిన జకోవిచ్ అలవోకగా తొలి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. సెమీస్‌కు చేరుకునే క్రమంలో అద్భుత పోరాట పటిమను కనబరిచిన నిషికోరి ఈసారి ఏమాత్రం ప్రతిఘటన ఇవ్వలేక పోయాడు. జకోవిచ్ తనకు మాత్రమే సాధ్యమయ్యే కళ్లు చెదిరే షాట్లతో నిషికోరిని ఉక్కిరిబిక్కిరి చేశాడు. అతని ధాటికి నిషికోరి తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. ఇదే క్రమంలో వరుస తప్పిదాలకు పాల్పడ్డాడు. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న జకోవిచ్ రెండో సెట్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. ఇక, మూడో సెట్‌లో సెర్బియా స్టార్ మరింత చెలరేగి పోయాడు. దూకుడును పెంచిన జకోవిచ్ ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు. చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకుంటూ అలవోకగా సెట్‌ను గెలిచి టైటిల్ పోరుకు చేరుకున్నాడు.
డెల్‌పొట్రో జోరు…
మరోవైపు డిఫెండింగ్ చాంపియన్, స్పెయిన్ బుల్‌తో జరిగిన మరో సెమీస్‌లో మూడో సీడ్, అర్జెంటీనా స్టార్ డెల్‌పొట్రో ఆధిపత్యం చెలాయించాడు. గాయం వల్ల సామర్థం మేరకు ఆడని నాదల్ వరుసగా రెండు సెట్లు కోల్పోయాడు. ఇక, గాయం మరింత తిరగబడడంతో అతను అర్ధాంతరంగా మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. ఈ మ్యాచ్‌లో డెల్‌పొట్రో ప్రారంభం నుంచే దూకుడును ప్రదర్శించాడు. చక్కని షాట్లతో నాదల్‌ను హడలెత్తించాడు. మరోవైపు గాయం వెంటాడుతున్నా నాదల్ కూడా పట్టు వీడకుండా పోరాడాడు. తొలి సెట్‌లో డెల్‌పొట్రోకు గట్టి పోటీనే ఇచ్చాడు. ఇద్దరు నువ్వానేనా అన్నట్టు పోరాడడంతో పోరు టైబ్రేకర్ వరకు వెళ్లింది. దీనిలో చివరి వరకు ఆధిక్యాన్ని నిలబెట్టుకోవడంలో సఫలమైన డెల్‌పొట్రో సెట్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే రెండో సెట్‌లో నాదల్ గాయం మరింత పెరిగి పోయింది. దీని ప్రభావం అతని ఆటపై స్పష్టంగా కనిపించింది. ఈ సెట్‌లో నాదల్ ప్రత్యర్థికి కనీస పోటీ ఇవ్వలేక పోయాడు. దూకుడుగా ఆడిన డెల్‌పొట్రో అలవోకగా సెట్‌ను గెలుచుకున్నాడు. దీంతో అతని ఆధిక్యం 20కు పెరిగింది. కానీ గాయం మరింత వేధించడంతో నాదల్ పోటీ నుంచి వైదొలగక తప్పలేదు. ఈ పరిస్థితుల్లో డెల్‌పొట్రోకు ఫైనల్ బెర్త్ ఖాయమైంది.
ఎవరు గెలిచినా రికార్డే…
మరోవైపు మహిళల సింగిల్స్‌లో అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్ చారిత్రక విజయానికి చేరువైంది. ఫైనల్లో జపాన్ ఆశాకిరణం నవొమి ఒసాకాతో సెరెనా తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే సెరెనా అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంటుంది. ఇప్పటికే 23 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ గెలిచిన సెరెనా ఒకటి సాధిస్తే చరిత్ర సృష్టించింది. ఇదే క్రమంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన ఆస్ట్రేలియా దిగ్గజం మార్గరెట్ కోర్ట్ పేరిట ఉన్న రికార్డును సమం చేస్తోంది. అంతేగాక అత్యధికంగా ఏడుసార్లు యుఎస్ ఓపెన్ టైటిల్స్ సాధించిన తొలి క్రీడాకారిణిగా చరిత్ర సృష్టిస్తోంది. ఇప్పటివరకు అమెరికా స్టార్ క్రిస్ ఎవర్ట్‌తో సమంగా సెరెనా ఆరు యుఎస్ ఓపెన్ టైటిల్స్ సాధించింది. ఇక, జపాన్ స్టార్ ఒసాకా గెలిస్తే కూడా కొత్త రికార్డు నమోదవుతోంది. గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన తొలి జపాన్ క్రీడాకారిణిగా ఒసాకా చరిత్ర సృష్టిస్తోంది.

Comments

comments

Related Stories: