జోరు వానలో…వరద నీటిలో…

The tribal woman who gave birth there
నార్నూర్: గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఆదివారం గాదిగూడ మండలంలోని వాగు ఉదృతంగా ప్రవహించడంతో ఓ గర్భిణీని వాగు దాటించలేక బందువులు అష్టకష్టాలు పడ్డారు. గాదిగూడ మండలంలో రుస్సాపూర్ గ్రామానికి చెందిన సోయం రవితకు భారీ వర్షం కురుస్తుండగా పురిటి నొప్పులు రావడంతో గాదిగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఆటోలో గర్భిణీతో బయలుదేరారు. గాదిగూడ సమీపంలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి వద్ద వర్షానికి వాగు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో కొంతసేపు వాగు అవతలి ఒడ్డుపై నిరీక్షించారు. అయినా వాగు ఉదృతి తగ్గక పోవడంతో అంతలోపు గర్భిణీకి పురిటినొప్పులు ఎక్కువయ్యాయి. చేసేది లేక బందువులు వాగు పక్కనే మహిళకు పురుడు పోశారు. జోరుగా కురుస్తున్న వర్షం తల్లి బిడ్డలకు ప్రాణ సంకటంగా మారడంతో బందువులు అతికష్టం మీద బాలింతను వాగు దాటించి అంబులెన్సులో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని డాక్టర్లు తెలిపారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా గత కొన్నేళ్లుగా బ్రిడ్జి అసంపూర్తిగానే ఉంది. వర్షాలు కురుస్తే గాదిగూడ వాగు అవతలి గ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. గత రెండేళ్ల క్రితం మేడిగూడ గ్రామంలో ఒకే ఇంట్లో అతిసార వ్యాధిసోకి అత్యవసర సమయంలో వాగు దాటలేక వైద్యం అందక పోవడంతో ముగ్గురు మరణించారు. వారిని పరామర్శించడానికి వచ్చిన మంత్రి జోగురామన్న బ్రిడ్జి నిర్మాణాన్ని త్వరిత గతిన పూర్తి చెయ్యాలని ఆదేశించిన ఇప్పటి వరకు అసంపూర్తిగానే ఉంది. ఆసుపత్రికి వెళ్లలేక వర్షాకాలంలో అడవి బిడ్డలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.