జోరు మీదున్న ‘కారు’

TRS try to win in gadwal assembly elections 2019
గద్వాల : ముఖ్యమంత్రి పర్యటన అనంతరం టిఆర్‌ఎస్ పార్టీ జోరుమీదుంది. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పార్టీ నాయకులు ముందుకు సాగుతున్నారు. రోజు ఏదో ఒక గ్రామంలో పర్యటిస్తూ ప్రతిపక్ష పార్టీల నాయకులను, కార్యకర్తలను పార్టీలో చేర్చుకుంటూ టిఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మరింత దూకుడును పెంచుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల కోటపై టిఆర్‌ఎస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గానికి ముఖ్యమంత్రి ఇచ్చిన వరాలను గ్రామస్థాయి వరకు తీసుకెళ్లి ప్రజలకు వివరించే ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గంలోని సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి వాటికి నిధులు మంజూరు చేయించడంలో విజయవంతమయ్యారు. ఇప్పటికే అన్ని గ్రామాల్లో ఉపాధిహామీ కింద పెద్ద ఎత్తున సిసి రోడ్ల నిర్మాణాలను చేపట్టారు. ఇక మిగతా సమస్యలపై దృష్టిపెట్టి ముందుకు సాగుతున్నారు. మండలాల్లో షాదీఖానాలు, కళ్యాణ మండపాల కోసం ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తామని హామీలు ఇస్తున్నారు.

చేరికలతో కొత్త ఉత్సాహం…
పార్టీలో చేరికలతో కొత్త ఉత్సాహం నెలకొన్నది. ప్రతి గ్రామంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలు చాలామంది టిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆదివారం గద్వాల మండలం సంగాలలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారికి నియోజకవర్గ ఇన్‌చార్జి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ఎంపిపి సుభాన్‌లు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. టిఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమని, అందువల్లే ప్రజలు, ఇతర పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరుతున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కెసిఆర్‌తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమన్నారు. ఇన్నేళ్లు పాలించిన పాలకులు గద్వాల అభివృద్ధిని మరిచారన్నారు. ఎన్నికలలో గెలవకపోయినా టిఆర్‌ఎస్ ప్రభుత్వ సహాయంతో నియోజకవర్గానికి నిధులు మంజూరు చేయించామన్నారు. గొర్రెలు, చేపల పంపిణీ, పెట్టుబడి సాయం, రైతన్నలకు భీమా, కెసిఆర్ కిట్, 102, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ఇలా ప్రతి పథకం పేద ప్రజల సంక్షేమం కోసం టిఆర్‌ఎస్ ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గల్లంతవుతుందని ఆయన జోస్యం చెప్పారు.

Comments

comments