జోన్లకు ప్రధాని క్లియరెన్స్

Telangana zonal system gets Centre's nod

కొత్త జోన్ల వ్యవస్థను ఆమోదించాలని రాష్ట్రపతికి సిఫారసు చేస్తూ ఫైలుపై మోడీ సంతకం : ఎంపి వినోద్ కుమార్ వెల్లడి

మన తెలంగాణ / న్యూఢిల్లీ : తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన కొత్త జోనల్ వ్యవస్థ ఫైల్‌పై ప్రధాని నరేంద్రమోడీ సంతకం చేశారు. సోమవారం ఉద యం హోంమంత్రిత్వశాఖ నుంచి రాష్ట్రపతి ఆమోదం కోసం రాష్ట్రపతి భవన్‌కు వెళ్తుంది. దాదాపు రెండున్నర నెలలుగా కేంద్రం దగ్గర పెండింగ్‌లో ఉన్న ఈ ఫైల్‌కు తాజాగా కెసిఆర్ పర్యటనతో కదలిక వచ్చిం ది. వీలైతే సోమవారానికి లేదంటే మంగళవారం రాష్ట్రపతి ఆమోదం అనంతరం గెజిట్ విడులయ్యే అవకా శం ఉంది. జోనల్ ఫైల్‌పై ప్రధాని సంతకం గురించి ఎంపి వినోద్ ‘మన తెలంగాణ’తో మాట్లాడుతూ స్థానికులకే 95% ఉద్యోగావకాశాలు కల్పించే ఉద్దేశంతో నూతన జోనల్ వ్యవస్థకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, సమైక్య రాష్ట్రంలో నియామకాల విషయంలో జరిగిన అన్యాయాన్ని చక్కదిద్దేందుకే ఈ మార్పు తీసుకున్నట్లు ప్రధానికి ముఖ్యమంత్రి కెసిఆర్ వివరించారని, ఆ వెంటనే ప్రధాని సంతకం చేశారని స్పష్టం చేశారు. ప్రధాని నివాసం నుంచి ఆ ఫైల్ హోం మంత్రిత్వశాఖకు చేరిందని, సోమవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌కు వెళ్తుందని వివరించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సోమవారమే సంతకం చేసే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే సోమవారం సాయంత్రం లేదా మంగళవారం ఉదయం గెజిట్ నోటిఫికేషన్ విడుదల య్యే అవకాశముంది. కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీలో జోనల్ విషయమూ ప్రస్తావనకు వచ్చింది.

‘ప్రజాకర్షక కాదు..‘ప్రజావసర’ పథకాలు: వినోద్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రజాకర్షకమైనవి మాత్రమేగాక, అవి ప్రజల అవసరాల నుంచి ఉద్భవించినవని ఎంపి వినోద్ వ్యాఖ్యానించారు. ప్రజల అవసరాల కోసం చేపట్టిన ఈ పథకాలే తప్పనిసరిగా గెలిపిస్తాయనే విశ్వాసం తమకుందని, ప్రజలపట్ల ఆ విశ్వాసం తమ పార్టీకీ ఉందని పేర్కొన్నారు. వినోద్ కుమార్, మరో ఎంపి బూర నర్సయ్యగౌడ్‌తో పాటు ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, టిఆర్‌ఎస్ ప్రభుత్వం పలు ప్రజాకర్షక పధకాలను ప్రవేశ పెట్టిందని,100కు పైగా సీట్లు వస్తాయని చెబుతున్న నేపథ్యంలో ముందస్తుగా ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఏముందన్న ప్రశ్నకు జవాబిస్తూ టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజల అవసరాల కోసం పని చేస్తున్న ప్రభుత్వమని, ప్రజా అవసరాల కోసం పధకాలను చేపట్టిందని జవాబిచ్చారు. ‘ప్రజాకర్షక పథకాలు కాదు, ప్రజా అవసరాల పధకాలు. ఈ రెండిటి మధ్య చాలా తేడా ఉంద’ని అని వివరణ ఇచ్చారు.

‘ముందస్తు’పై నిర్ణయం ఎక్కడైంది?
ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందన్న ప్రశ్నకు ఎంపి వినోద్‌కుమార్ జవాబిస్తూ “ముందస్తు ఎన్నికలకు పోయిన తర్వాత ఆ ప్రశ్న అడగాలి. రాష్ట్ర కాబినెట్ నిర్ణయమూ జరగలేదు. అసెంబ్లీని రద్దూ చేయలేదు. ముందస్తుపై ప్రకటనా చేయలేదు. రాష్ట్ర క్యాబినెట్ స్పష్టమైన నిర్ణయం తీసుకుని అసెంబ్లీని రద్దు చేసిన తర్వాత ‘ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లారు’ అని అడగాలి. కానీ ఇవేవీ జరగకుండానే ముందస్తు అని మాట్లాడుతున్నారు. నేనుగానీ, బూర నరసయ్య గౌడ్‌గానీ కేబినెట్ సభ్యులం కాదు” అని వినోద్ కుమార్ స్పష్టం చేశారు. ‘మబ్బులొచ్చినప్పుడల్లా వర్షం రాద”ని బూర నర్సయ్య గౌడ్ వ్యాఖ్యానించారు. శాసనసభను రద్దు చేసినప్పటికీ ఎన్నికలు నిర్వహించాలన్న నిబంధన ఏమి లేదన్న మరో ప్రశ్నకు జవాబిస్తూ శాసనసభ రద్దయిన ఆరు నెలలలో ఎన్నికలు జరపాలని గుజరాత్ విషయంలో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ప్రస్తావించిన ఆరు నెలల ఉత్తర్వులపై ఎన్నికల సంఘం తప్పించుకోలేదని అన్నారు. సాధారణ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి పొడిగిస్తామని చెప్పడానికి వీలులేదన్నారు.

“శాసనసభ రద్దయిన 6 నెలల లోపు ఎన్నికలు జరగాలని రాజ్యాంగంలో కానీ, ప్రజా ప్రాతినిధ్య చట్టంలోగానీ ఈ విషయం లేదు. అయితే గుజరాత్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు చెప్పింది దాదాపు చట్టమే. సుప్రీంకోర్ట్ తీర్పును మనకిష్టం వచ్చినట్లు వక్రీకరించకూడదు. నేను ఆ సుప్రీంకోర్టు తీర్పును చదివాను. శాసనసభ రద్దయిన 6 నెలల్లో ఎన్నికలు జరగాలి. అంతేకాకుండా శాసనసభ రద్దయిన తర్వాత ఆపద్ధర్మ ప్రభుత్వంగా మెజారిటీ వున్న పార్టీనే కొనసాగించాలని కరుణానిధి కేసులో తీర్పు వుంది. ఈ విషయంలో మాకు స్పష్టత వుంది” అని వినోద్ కుమార్ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. సాధారణ ఎన్నికలతో పాటుగా ఎన్నికలకు వెళితే మోడీ వ్యతిరేక ప్రభావం మీపై (టిఆర్‌ఎస్‌ను ఉద్దేశించి) పడుతుందని భావిస్తున్నారా అని పాత్రికేయులు ప్రశ్నించగా, “మాకు మోడీతో ముడేయకండ”ని బదులిచ్చారు.

“సెప్టెంబర్ 26 లేదా 28 నాటికీ శాసనసభ సమావేశమై 6 నెలలు అవుతుంది. అంతకుముందుగా తప్పనిసరి శాసనసభ సమావేశం జరగాలి. అంతకు ముందుగానే శాసనసభ రద్దు చేయాలని కాబినెట్ నిర్ణయిస్తే శాసనసభ రద్దవుతుంది. లేకపోతే శాసనసభ సమావేశాలు నిర్వహించక తప్పద’ని వినోద్‌కుమార్ చెప్పారు. శాసన రద్దుచేసే ముందు సమావేశం ఏర్పాటు చేస్తారా అన్న ప్రశ్నకు అది కాబినెట్ నిర్ణయించాల్సిన విషయమని వినోద్ కుమార్ చెప్పారు.

తెలంగాణ మండలాలను ఏపీలో కలపడం అప్రజాస్వామికం:
“దురదృష్టవశాత్తూ రాష్ట్ర విభజన జరిగి ఎన్నికలైన తర్వాత ఏర్పాటైన మోడీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా ఒక ఆర్డినెన్సు ద్వారా తెలంగాణా రాష్ట్రంలో వున్న గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడం జరిగింది. ఇటీవల లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో నేను ఈ విషయాన్ని ప్రస్తావించాను. అత్యంత దురదృష్టంగా, అప్రజాస్వామికంగా గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపారని చెప్పాను. ఇప్పుడు కూడా మా అభిప్రాయం అదే. 2015 మార్చ్ నెలలో ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ 108 ప్రకారం ఏవైనా తప్పులుంటే సరిచేసుకునే అవకాశం రాష్ట్రపతికి వుంది. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ లో కలిపిన మండలాలు రంపచోడవరం, పోలవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో గ్రామాలను కలిపేశారు. నోటిఫికేషన్ కూడా వచ్చింది. అక్కడ వున్న ఓటర్లకు చట్టప్రకారం నాకు తెలిసినంత వరకు ఎలాంటి ఇబ్బందీ లేదు. అయితే అక్కడ వున్న గ్రామస్తులు దాన్ని సవాలు చేశారని వింటున్నా‘నని వినోద్ కుమార్ చెప్పారు. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయాలా అన్న ప్రశ్నకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు.

అఖిలపక్ష సమావేశానికి నేనే వెళుతున్నా..
“రాష్ట్ర శాసన సభ, పార్లమెంట్‌లో మహిళలకు రిజర్వేషన్‌లు కావాలంటే పార్లమెంట్‌లో చట్టం చేయాల్సి వుంది. సోమవారం కేంద్ర ఎన్నికల సంఘమే నిర్వహిస్తున్న అఖిల పక్ష సమావేశంలో అంశాలను ప్రస్తావిస్తూ చట్ట సభలలో రిజర్వేషన్ పరిమితం కాకుండా ఎన్నికల సంఘం ఏమి చెబుతోందంటే రాజకీయ పార్టీల కమిటీలలో కూడా రిజర్వేషన్‌లు పెడతారా అని ప్రశ్నించింద”ని వినోద్‌కుమార్ తెలిపారు. ‘ఉదాహరణకి జిల్లా కమిటీలో కొంత శాతం, రాష్ట్ర కమిటీ లో కొంత శాతం మహిళలకు రిజర్వేషన్‌లు ఉండాలి. రాజకీయ పార్టీలలో మహిళలు ఎక్కువ శాతం లేరనే అభిప్రాయానికి ఎన్నికల సంఘం వచ్చింది. మేము మా సమ్మతిని తెలియజేసాం.

రెండవ అంశం ఏమిటంటే ఎమ్మెల్యే ,ఎంపీ ఎన్నికలప్పుడు వారికీ ఇంతకంటే ఎన్నికల వ్యయం దాటరాదని నియమావళి ఉంది అయితే ఎమ్మెల్సీలకు ఆ విధమైన ఎన్నికల వ్యయ పరిమితి ఇప్పటివరకు లేదు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కానీ, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి కానీ ఎన్నికల వ్యయ పరిమితి పెడదామా అని ఎన్నికల సంఘం ప్రశ్నించింది. ఇక మూడవ అంశం చాల ముఖ్యమైంది. అభ్యర్థులకు మాత్రమే ఎన్నికల వ్యయ పరిమితి నియమావళి ఉంది. రాజకీయ పార్టీలకు లేదు. జాతీయ పార్టీలు కానీ ప్రాంతీయ పార్టీలకు కానీ ఎన్నికల వ్యయ పరిమితి విధించే అంశంపై ఎన్నికల సంఘం అభిప్రాయాన్ని కోరింది. తర్వాత ఎలెక్టోరల్ రోల్స్ గతం లో సంవత్సరానికి ఒకసారి చేసేది. తర్వాత మూడు నెలలకొకసారి చేస్తున్నారు. ఎవరికైతే 18 సంవత్సరాల వయసు దాటుతుందో వారు ఆటోమేటిక్ గా ఓటర్ కావడానికి దేశ వ్యాప్తంగా ఒక యంత్రాంగం ఉంటే బాగుంటుందా అని అభిప్రాయం అడిగింది.

Comments

comments