జోనల్‌పై నేడు ఢిల్లీకి కెసిఆర్

cm

వీలైతే ప్రధానితో భేటీ
2,3 రోజలపాటు అక్కడే

జోనల్ వ్యవస్థకు ఆమోదం సాధించే ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించనున్న ముఖ్యమంత్రి

మన తెలంగాణ/హైదరాబాద్ : సిఎం కెసిఆర్ శుక్రవారం ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తున్నా రు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన జోనల్ వ్యవస్థ కు కేంద్ర ప్రభుత్వం నుంచి సత్వరం ఆమోదం సాధించేందుకు స్వయంగా ఢిల్లీ వెళ్లాలని తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ పర్యటన ఖరారైంది. కొత్త రాష్ట్రంలో కొత్త జోనల్ వ్యవస్థ ఆవశ్యకత, దీని ద్వారా రాష్ట్ర యువతకు లభించనున్న ఉద్యోగ అవకాశాలు, సత్వరం దీన్ని కేంద్రం ఆమోదించాల్సిన అనివార్యత తదితరాలపై సిఎం తన ఢిల్లీ పర్యటనలో కేంద్ర ప్రభు త్వ పెద్దలకు వివరించనున్నారు. జోనల్ వ్యవస్థకు కేం ద్రం నుంచి ఆమోదం సాధించే ప్రక్రియను స్వయంగా పర్యవేక్షిస్తారని ప్రభుత్వం గురువారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొనింది. రెండు మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి, అవసరమైతే ప్రధాన మంత్రి నరేంద్రమోడీని కలిసి కొత్త జోనల్ వ్యవస్థ అవసరాన్ని విడమరిచి చెప్పాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నట్లు ఆ ప్రకటన పేర్కొనింది. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న సంపూర్ణ ఫలితం స్థానికులకే దక్కాలంటే రాష్ట్రంలో కొత్త జోనల్ వ్యవస్థ వుండి తీరాలని సిఎం భావిస్తున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం నుండి సత్వర ఆమోదం సాధించి, కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం కొత్త నియామకాలు చేయాలని ముఖ్యమంత్రి గట్టి నిర్ణయంతో ఉన్నారని తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో 31 జిల్లాలు ఏర్పాటు చేసుకోవడం, స్థానికులకే 95 శాతం రిజర్వేషన్ అమలు చేయడం వల్ల ఎక్కడికక్కడ స్థానికంగా ఉండే తెలంగాణ యువకులు ఎక్కువ అవకాశాలు పొందుతారన్నది ముఖ్యమంత్రి అభిప్రాయం.ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వ పెద్దలకు విడమర్చి చెప్పాలని ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్తున్నారు.
ఉద్యోగ అవకాశాల్లో స్థానికులకే ఎక్కువ ప్రయోజనం కలిగించడం కోసం 95 శాతం స్థానిక రిజర్వేషన్లతో తెలంగాణ ప్రభుత్వం కొత్త జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. మంత్రివర్గ ఉపసంఘంతో పాటు జోనల్ వ్యవస్థ ఏ విధంగా ఉంటే తెలంగాణ యువతకు ప్రయోజనం ఉంటుందో సుదీర్ఘంగా కసరత్తు చేసి ఏడు జోన్లను, రెండు మల్టీ జోన్లను ఏర్పాటుచేస్తూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఉద్యోగ అవకాశాల్లో స్థానికులకే ప్రాధాన్యం కల్పించడానికి ప్రస్తుతం ఉన్న జోనల్ వ్యవస్థ అవరోధంగా ఉందని ముఖ్యమంత్రి మొదటినుంచీ భావిస్తున్నారు. జోనల్ వ్యవస్థలో మార్పుచేర్పులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. స్థానికులకే ఎక్కువ అవకాశాలు వచ్చేలా కోత్త జోనల్ వ్యవస్థకు రూపకల్పన చేశారు. 1975 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణ చేసే నిమిత్తం దీన్ని రెండు నెలల క్రితమే కేంద్ర హోంశాఖకు చేరవేసింది. ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా ఢిల్లీకి వెళ్ళి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాధ్‌సింగ్‌ను కలిసి జోనల్ వ్యవస్థ అవసరాన్ని వివరించి కొత్త విధానానికి ఆమోదం తెలిపేలా కేంద్ర మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుని రాష్ట్రపతి ఆమోదం లభించేలో చొరవ తీసుకోవాలని కోరారు. అయినా ఇప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. ఈ నేపథ్యంలో కెసిఆర్ ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. నూతన జోనల్ విధానానికి సంబంధించిన ఫైళ్ళను కేంద్రానికి పంపిన తర్వాత కేంద్ర న్యాయ శాఖ, హోం శాఖలు సానుకూలంగానే స్పందించాయి. ఈ ఫైల్‌ను ప్రధాన మంత్రి కార్యాలయానికి కూడా పంపాయి. జోనల్ వ్యవస్థ ఆమోదం అంశం కీలక దశలో ఉన్నందున తానే స్వయంగా ఢిల్లీకి వెళ్లి పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇప్పుడు ప్రధాని నిర్ణయం కోసం సమయం పడుతున్నందున సిఎం ఢిల్లీకి వెళ్తుండడం గమనార్హం. ప్రస్తుతం పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో వివిధ శాఖల మంత్రులతో కూడా కెసిఆర్ భేటీ అయ్యే అవకాశం ఉంది. టిఆర్‌ఎస్ ఎంపిలంతా అక్కడే ఉన్నందున పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని వివిధ అంశాలకు సంబంధించి ఆయా శాఖల మంత్రులను కలిసి చర్చించే అవకాశం ఉంది. ఈ నెల 10వ తేదీన కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అధ్యక్షతన జరగనున్న పార్లమెంటరీ స్థాయీ సంఘం (హోం వ్యవహారాల) సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలపై కూడా ఈ పర్యటనలో భాగంగా మంత్రులతో చర్చించే అవకాశం ఉంది.