జాదవ్ కేసులో భారత వినతికి ఐసిజె తిరస్కృతి

  • పాక్ అటార్నీ జనరల్ అస్తార్ అసఫ్ అలీ

Kulbhushan-Yadav

ఇస్లామాబాద్ : మాజీ నావికాదళాధికారి కులభూషణ్ జాదవ్ కేసు విచారణ ప్రక్రియను డిసెంబరు వరకు ఆపాలంటూ భారత్ చేసిన వినతి నిది హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం (ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్-ఐసిజె) తిరస్కరించిందని పాకిస్తాన్ అటార్నీ జనరల్ అస్తార్ అసఫ్ అలీ వెల్లడించినట్లు ది డాన్ వార్తా పత్రిక ఉటంకించింది. గూఢాచార ఆరోపణల కింద భారత మాజీ నావికాదళాధికారి కులభూషణ్ జాదవ్(45)కి పాకిస్తాన్ సైనిక కోర్టు మరణశిక్షను విధించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సెప్టెంబరు 13 కల్లా తన స్పందనను తెలపాలంటూ భారత్‌ని ఐసిజె ఆదేశించిందన్న విషయాన్ని నెదర్లాండ్స్‌లోని తన కాన్సులేట్ ద్వారా పాకిస్తాన్ తెలుసుకుందని డాన్ తెలిపింది. ఐసిజె తన నిర్ణయాన్ని తెలుపుతూ పాకిస్తాన్‌కి లేఖ రాసిందని అలీ చెప్పారు. ‘జాదవ్ కేసులో అప్పీళ్ల దాఖలుకు తనకు డిసెంబరు వరకు సమయమివ్వాలంటూ ఐసిజెని భారత్ కోరింది. కానీ, ఆ దేశ వినతిని కోర్టు తిరస్కరించింది’ అని ఆయన అన్నారు. కాగా, మే 18న కేసు విచారణ సందర్భంగా ఐసిజెలోని పది మంది సభ్యుల ధర్మాసనం జాదవ్ ఉరిపై తాత్కాలిక స్టేని విధిస్తూ తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.

Comments

comments