జాకీల సాయంతో ఇంటినే లేపేశారు

ఎత్తుపెంచడానికి జాకీల సాయంతో ఇంటిని లేపారు

ఖమ్మం జిల్లాలో చోద్యం చూసిన గ్రామస్థులు

House_manatelangana copyమన తెలంగాణ/చంద్రుగొండ: మండల పరిధిలోని అన్నపురెడ్డి గ్రామంలో జాకీల సహాయంతో పక్కా భవనాన్ని పునాదులతో సహా  పైకి ఎత్తుతున్న సంఘటన చూపరులను ఆశ్చర్యానికి గురిచేసింది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన వేముల నగేష్ ఇల్లు రోడ్డు కంటే ఎత్తు తక్కువలోఉంది. వాస్తు నిపుణులు  ఆ విధంగా ఉండటం అరిస్టమని తెలపడంతో ఆ ఇల్లును పునర్‌నిర్మించదలిచారు.  అందుకు రూ.10లక్షలు వ్యయమవుతుందని తెలుసుకొని పునర్నిర్మాణాన్ని విరమించుకున్నారు.  ఇంటి పునాదుల ఎత్తు ఏవిధంగా పెంచాలనే విషయంపై ఇంటర్‌నెట్‌లో శోధించారు. హర్యానా రాష్ట్రానికి చెందిన హౌస్‌షిఫ్టింగ్ చేసేవారి సమాచారం దొరికింది. వారిని సంప్రదించగా ఆ బృందం అన్నపురెడ్డి గ్రామంలో భవనాన్ని పరిశీలించి పునాదులతో సహా మీటరు ఎత్తు పెంచేందుకు ఒప్పందం చేసుకుంది. బిల్డింగ్ ఎత్తు పెంచేందుకు రూ.3లక్షల వ్యయం కానున్నదని యజమాని నగేష్‌కు తెలిపారు. దీంతో ఆయన అంగీకరించారు. 11 మంది సిబ్బంది 30 రోజులలోగా 200 జాకీల సహాయంతో పునాదులతో సహా ఇల్లు పైకి లేపడం జరుగుతుందని బృందం నాయకుడు మాన్‌చంద్ తెలిపారు.   11 రోజులుగా చేసిన ప్రయత్నంతో భవనం ఒక్క అడుగు పైకి లేచింది.  మిగతా పనిని 15 రోజుల్లో పూర్తిచేస్తామని వారు తెలిపారు.  ఈ వింతను చూసేందుకు చుట్టపక్కల గ్రామాల వారు తరలివస్తున్నారు.

Comments

comments