జనాశీర్వాదం కోరుకున్న కెసిఆర్

KCR who wanted people's blessing

మతతత్వ, కుల తత్వ దాడుల పట్ల మహిళల్లో ఆక్రోశం ఆవేదన పెల్లుబుకుతున్నాయి. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన మోడీ కనీసం రెండు లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని నిలదీస్తున్నారు. పైగా నోట్ల రద్దు వల్ల 90 లక్షల ఉద్యోగాలు పోయాయని గుర్తు చేస్తున్నారు. బేటీ బచావో బేటీ పఢావో నినాదాలిచ్చే ప్రభుత్వం ఈ బేటీల గురించి ఆలోచిస్తుందా? వారి మాట వింటుందా? వారి డిమాండ్లకు ప్రతిస్పందిస్తుందా?

సస్పెన్స్ వీడింది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం శాసన సభను రద్దు చేశారు. మళ్లీ తనను ఆశీర్వదించమంటూ ప్రజల వద్దకు వెళుతున్నారు. 119లో 105 నియోజకవర్గాలకు అభ్యర్థులను వెంటనే ప్రకటించారంటే తాజా ఎన్నికలకు ఆయన ఎంత సర్వసన్నద్ధంగా ఉన్నారో విదితమవుతున్నది. ముఖ్యమంత్రి శాసన సభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లవచ్చునని పక్షం రోజులుగా ఊహాగానాలు జరుగుతున్నాయి. ఆయన గత నెలలోనే ఈ విషయాన్ని మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లటమా, లేదా అనే విషయమై నిర్ణయం తీసుకునే అధికారాన్ని సహచరుల నుంచి పొందారు. అసెంబ్లీని రద్దు చేస్తే డిసెంబర్‌లో ఎన్నికలు జరిగే నాలుగు రాష్ట్రాలతోపాటు (మిజోరం, చత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్) తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై అన్ని వాకబులు చేశారు. తాను స్వయంగా ఢిల్లీ వెళ్లి ప్రధాన మంత్రితో చర్చించి ఉద్యోగాల భర్తీకి స్థానికతపై కొత్త జోనల్ వ్యవస్థకు శీఘ్రంగా ఆమోదం సంపాదించారు.

ఈ నేపథ్యంలో గత ఆదివారం నగర శివారు కొంగర కలాన్‌లో ‘ప్రగతి నివేదన’ పేరుతో అపూర్వమైన బహిరంగ సభ జరిపి, నవ తెలంగాణ రాష్ట్రంలో అన్ని విభాగాల ప్రజలకు తమ ప్రభుత్వం నాలుగేళ్లలో వనగూర్చిన సంక్షేమాన్ని, చేబట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించటంతోపాటు త్వరలో అసెంబ్లీని రద్దు చేసి, ప్రజల ఆశీర్వాదం కొరకు రానున్నట్లు పరోక్షంగా ముందస్తు ఎన్నికల సంకేతమిచ్చారు. ఈ పూర్వరంగంలో గురువారం మధ్యాహ్నం మంత్రివర్గ సమావేశంలో ‘శాసన సభ రద్దు’ తీర్మానం ఆమోదించటం, దాన్ని ముఖ్యమంత్రి స్వయంగా గవర్నర్ నరసింహన్‌కు అందజేయటం, ఆయన దాన్ని ఆమోదించి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరటం రాజ్యాంగ సంబంధమైన లాంఛనాలు పరిపూర్తి చేయటమే. అసెంబ్లీ రద్దుపై గెజిట్ ప్రచురించటం, దాని ప్రతులను ఎన్నికల కమిషన్‌కు పంపటం చకచకా జరిగిపోయాయి. నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సన్నద్ధతపై చర్చించేందుకు శుక్రవారం సమావేశమవుతున్న ఎన్నికల కమిషన్ తెలంగాణ శాసన సభకు ఎన్నికల నిర్వహణను కూడా చర్చించే అవకాశముంది.

సుదీర్ఘకాల ప్రజా పోరాటం తదుపరి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ను అధికారంలోకి తెచ్చి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించిన కెసిఆర్ ఇంకా ఎనిమిది మాసాలకుపైగా పదవీకాలం ఉన్నప్పటికీ దాన్ని త్యజించి ముందుగా ఎందుకు ఎన్నికలకు వెళుతున్నారనే సందేహం ఎవరికైనా కలగటం సహజం. 2014లో లోక్‌సభతోపాటే ఇక్కడ ఎన్నికలు జరిగాయి. 2019 ఏప్రిల్‌లో ఎలాగూ సార్వత్రిక ఎన్నికలున్నాయి. 90 మంది శాసనసభ్యుల బలంతో ప్రభుత్వం పనిచేసేందుకు ఎటువంటి ఇబ్బంది లేనప్పుడు ఈ రాజకీయ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు?

అనూహ్యమైనవి జరగటమే రాజకీయం. కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ సంక్షేమ కార్యక్రమాల్లో దేశంలో కెల్లా ప్రథమ స్థానంలో ఉంది. అభివృద్ధి సూచికల్లో అగ్రగామిగా ఉంది. పారిశ్రామికాభివృద్ధిలో శీఘ్రతర పురోగమనంలో ఉంది. రాష్ట్రంలోని 20 వేల పైచిలుకు గ్రామాలకు ఇంటింటికీ రక్షిత మంచినీరు సరఫరా చేసే అపూర్వమైన ‘మిషన్ భగీరథ’ దాదాపు పూర్తికావచ్చింది. ధ్వంసమైన చెరువుల పునరుద్ధరణకై చేబట్టిన మరో బృహత్ పథకం ‘మిషన్ కాకతీయ’తో చెరువులు జలకళ సంతరించుకున్నాయి. భూగర్భ నీటి మట్టం పెరిగింది. 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరాతో వ్యవసాయం కళకళలాడుతోంది.

సాహసోపేతంగా 17 వేల కోట్ల రూపాయల రైతు రుణాల రద్దు తదుపరి, వ్యవసాయంలోని సాధకబాధకాలు తెలిసిన వ్యక్తిగా కెసిఆర్ ఒక్కో పంటకు ఎకరాకు రూ. 4 వేల చొప్పున పెట్టుబడి సమకూర్చే రైతుబంధు పథకాన్ని దేశంలోనే తొలిసారి విజయవంతంగా అమలు చేస్తున్నారు. అంతేగాక అకాల మరణం పొందిన రైతు కుటుంబాన్ని ఆదుకునే పెద్దన్నగా రూ. 5 లక్షల చెల్లింపుతో రైతు బీమా పథకం ఎల్‌ఐసి ద్వారా అమలులోకి తెచ్చారు. మరోవైపున కోటి ఎకరాలకు సాగునీరు లక్షంగా ఇరిగేషన్ ప్రాజెక్టులను అన్ని అడ్డంకులను అధిగమించి శరవేగంగా నిర్మిస్తున్నారు. చేనేత సహా కుల వృత్తులన్నిటికీ ప్రోత్సాహం అందిస్తున్నారు. ప్రజలు సంతృప్తితో ఉన్నందున బంగారు తెలంగాణ దిశగా వడివడిగా అడుగులు వేసే నిమిత్తం మరో ఐదేళ్ల పదవీకాలం కొరకు ప్రజల ఆశీర్వాదం పొందటానికి ఇదే సరైన సమయంగా కెసిఆర్ ఎంచుకున్నారని భావించవచ్చు.