జగిత్యాల కాంగ్రెస్‌లో నైరాశ్యం

Dissatisfaction with the leaders

కాంగ్రెస్‌కు హ్యాండిచ్చి కారెక్కుతున్న నేతలు
గులాబీ ఆకర్షణతో గ్రామాల్లో చేజారిపోతున్న ప్రజాప్రతినిధులు
జీవన్ ప్రధాన అనుచరులు కూడా పార్టీ మారేందుకు సన్నద్ధం…?
ఉన్న నేతల్లోనూ రగులుతున్న అసంతృప్తి
ఇలాగైతే రానున్న ఎన్నికల్లో జీవన్‌రెడ్డి గట్టెక్కేనా…?

మనతెలంగాణ/జగిత్యాల: జగిత్యాల కాంగ్రెస్‌లో నైరాశ్యం నెలకొంది. నేతలు, ప్రజాప్రతినిధులు స్థానిక కాంగ్రెస్‌కు హ్యాండిచ్చి కారెక్కుతున్నారు. నిజామాబాద్ ఎంపి, ముఖ్యమంత్రి కెసిఆర్ తనయ కల్వకుంట్ల కవిత నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించి కాంగ్రెస్ నేతలు, ప్రజాప్రతినిధులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు, సిఎల్‌పి ఉపనేత జీవన్‌రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉండే సీనియర్ నేతలను కూడా తమ వైపు తిప్పుకోవడంలో టిఆర్‌ఎస్ సఫలీకృతమవుతోంది. గులాబీ ఆకర్షణతో కాంగ్రెస్‌కు పదుల సంఖ్యలో ఉన్న ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరుగా చేజారి పోతున్నారు. జీవన్‌రెడ్డిని మానసికంగా దెబ్బతీసేందుకు టిఆర్‌ఎస్ పన్నుతున్న వ్యూహాలతో కాంగ్రెస్‌కు చెందిన పలువురు సీనియర్ నేతలు కాంగ్రెస్‌ను వీడి టిఆర్‌ఎస్‌లో చేరేందుకు సన్నద్ధమయ్యారు. కాగా చివరి నిమిషంలో వివిధ కారణాలతో కొందరు వెనక్కి తగ్గగా జీవన్‌రెడ్డి ప్రధాన అనుచరుడు, సీనియర్ నాయకుడైన కొలుగూరి దామోదర్‌రావు ధరూర్ సర్పంచ్ జలజ, ఎంపిటిసి సురేందర్‌తో పాటు గ్రామస్థులతో కలిసి టిఆర్‌ఎస్‌లో చేరారు. ఆయన బాటలోనే మరికొంత మంది నేతలు నడిచేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. కొంత మంది నేతలు, ప్రజాప్రతినిధులు అటు టిఆర్‌ఎస్‌లోకి వెళ్లలేక… ఇటు కాంగ్రెస్‌లో ఉండలేక అసంతృపితో రగిలిపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో జగిత్యాల కోటలో టిఆర్‌ఎస్ పాగా వేసేందుకు ఎంపి కవిత అన్ని కోణాల్లో పావులు కదుపుతున్న నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో జగిత్యాలలో జీవన్‌రెడ్డి గెలుపు సాధ్యమవుతుందా అనే ప్రశ్నలు ఉత్ఫన్నమవుతున్నాయి. 2014 సాధారణ ఎన్నికలకు ముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలోని జగిత్యాల, రాయికల్, సారంగాపూర్ జెడ్పీటీసీలు, ఎంపిటిసిలు, ఎంపిపి పదవులను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అలాగే మెజార్టీ గ్రామాల్లో సర్పంచ్‌లు కూడా కాంగ్రెస్‌కు చెందిన వారే గెలుపొందారు. సింగిల్ విండో ఎన్నికల్లో సైతం మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. వీటితో పాటు జగిత్యాల మున్సిపాలిటీలో మెజార్టీ వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొంది చైర్మన్ పీఠాన్ని సైతం కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుని నియోజకవర్గంలో జీవన్‌రెడ్డి తన సత్తా చాటుకున్నారు. అలాగే 2014 సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో టిఆర్‌ఎస్ గాలి వీచినా జీవన్‌రెడ్డి తన అధిపత్యాన్ని కొనసాగిస్తూ టిఆర్‌ఎస్ అభ్యర్థిని ఓడించి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఏకైక కాంగ్రెస్ ఎంఎల్‌ఏగా నిలిచారు. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలిగా గెలిచిన ముఖ్యమంత్రి కూతురు కల్వకుంట్ల కవిత తన నియోజకవర్గ పరిధిలో అంతా టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏలు ఉండగా జగిత్యాలలో మాత్రం కాంగ్రెస్ ఎంఎల్‌ఏ ఉండటం మింగుడుపడలేదు. ముందునుంచి తమ పార్టీ కార్యకర్తల్లో హుషారును రెకెత్తించేందుకు జగిత్యాల నియోజకవర్గానికి ఎంఎల్‌ఏ ఎవరైనా తమకు మాత్రం నియోజకవర్గ ఇంచార్జిగా ఉన్న సంజయ్‌కుమారే తమ ఎంఎల్‌ఎ అంటూ పలు సందర్బాల్లో ప్రకటించారు. కాగా ప్రభుత్వ పనితీరు, పథకాల అమలుపై ఎప్పటికప్పుడు అటు అసెంబ్లీలో, ఇటు ప్రజా క్షేత్రంలో విమర్శనాస్త్రాలు సంధిస్తూ కొరకరాని కొయ్యగా మారిన సీనియర్ నేత జీవన్‌రెడ్డిని బలహీన పరిచేందుకు కవిత పలు వ్యూహాలు పన్నారు. కాంగ్రెస్‌ను వీడి తమ వెంట నడిస్తే మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాలను అభివృద్ది చేస్తామని, పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుందని పేర్కొంటూ కాంగ్రెస్‌లో ఉన్న నేతలు, ప్రజాప్రతినిధులకు వేసిన గాలానికి వెంటనే పలువురు చిక్కారు.

కాంగ్రెస్ ప్రజాప్రతినిధులంతా టిఆర్‌ఎస్‌లోకి…
మొదటగా జగిత్యాల జెడ్పీటీసీ సభ్యురాలు పెండెం నాగలక్ష్మి కాంగ్రెస్‌ను వీడి మండల అభివృద్ది కోసం టిఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకలటించి గులాబి గూటికి చేరుకున్నారు. ఆ తర్వాత రాయికల్ ఎంపిపి పడాల పూర్ణిమతిరుపతిరెడ్డి, పలువురు ఎంపిటిసిలు, సర్పంచ్‌లు సైతం కాంగ్రెస్‌ను వీడి టిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. జగిత్యాల జెడ్పీటీసీ, రాయికల్ ఎంపిపిలను పార్టీలో చేర్చుకున్న ఎంపి కవిత సారంగాపూర్ మండలంపై దృష్టి సారించి అక్కడి కాంగ్రెస్ ఎంపిపి కొల్ముల శారదతో పాటు పలువురు ప్రజాప్రతినిధులను, మాజీ ప్రజాప్రతినిధులను, నేతలను పార్టీలో చేర్చుకోవడంలో సఫలీకృతులయ్యారు. అయితే తమ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు చేజారిపోతున్న క్రమంలో నియోజకవర్గంలో తన పట్టును నిలుపుకునేందుకు జీవన్‌రెడ్డి గ్రామాల్లో పర్యటిస్తూ ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్నారు. ఈ నేపథ్యంలో జీవన్‌రెడ్డి వెంబడి ఉన్న ప్రధాన అనుచరులు, సన్నిహితులను పార్టీలో చేర్చుకుని జీవన్‌రెడ్డిని మానసికంగా దెబ్బతీసేందుకు ఎంపి కవిత గట్టి వ్యూహన్నే రచించారు. జీవన్‌రెడ్డి ప్రధాన అనుచరులుగా పిలవబడే దామోదర్‌రావు, ముస్కు ఎల్లారెడ్డి, నారాయణరెడ్డితో పాటు పలువురు కౌన్సిలర్లు, నేతలతో మంతనాలు జరిపి పార్టీలోకి తీసుకునేందుకు సిద్దమయ్యారు. అయితే ఈ విషయాన్ని పసిగట్టిన జీవన్‌రెడ్డి పార్టీ మారేందుకు సిద్దపడ్డ నేతలు, ప్రజాప్రతినిధులను పిలిపించుకుని మాట్లాడటంతో దామోదర్‌రావు తప్పా ఇతర నేతలంతా చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు. కాగా జీవన్‌రెడ్డి వెంట ఉన్న పార్టీ నాయకుల్లో కొంత మంది అసంతృప్తితో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. ఇన్నేళ్లుగా పార్టీ కోసం పని చేసినా తమకు పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఎలాంటి పదవులు దక్కలేదని, రాబోయే రోజుల్లో పార్టీ అధికారంలోకి రాకుంటే తమ భవిష్యత్తు ఏమిటంటూ పక్క చూపులు చూస్తున్నట్లు సమాచారం. 2014 ఎన్నికల సందర్భంగా నియోజకవర్గంలో ప్రజాప్రతినిధుల బలం లేని టిఆర్‌ఎస్‌కు గ్రామ గ్రామాన ప్రజాప్రతినిధులు తమ పార్టీలోకి రావడం, క్యాడర్ పెరిగిన నేపథ్యంలో 2019 ఎన్నికల్లో జగిత్యాల కోటపై గులాబీ జెండా ఎగురవేస్తామని టిఆర్‌ఎస్ ధీమా వ్యక్తం చేస్తుండగా, రోజుకొకరు పార్టీని వీడిపోతుండటంతో జీవన్‌రెడ్డి అన్నీ తానై నియోజకవర్గంలో మరోసారి తన సత్తా చాటేందుకు ప్రజలతో మమేకం అవుతూ ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో జీవన్‌రెడ్డి ప్రయత్నాలు ఎంత మేర సఫలీకృతమవుతాయో ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే మరి…

Comments

comments