జగన్ పాత్రలో కార్త్తి

Karthi

వైఎస్ రాజశేఖరరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ‘యాత్ర’ బయోపిక్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వైఎస్‌ఆర్ పాత్రలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ చిత్రంలో కీలకమైన వైఎస్ జగన్ పాత్రలో ఎవరు నటించబోతున్నారన్న విషయంపై ఓ క్లారిటీ వచ్చినట్లు తెలిసింది. ముందుగా జగన్ పాత్రకు తమిళ్ స్టార్ హీరో సూర్యను తీసుకోవాలనుకున్నారు. అయితే సూర్య ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. దీంతో ఆయన తమ్ముడు కార్తీని జగన్ పాత్రకు తీసుకుంటున్నట్లు తెలిసింది. ఇటీవల ‘చినబాబు’ సక్సెస్ మీట్ కోసం హైదరాబాద్‌కు వచ్చిన కార్తీని దర్శకుడు మహి కలిసి జగన్ పాత్ర గురించి వివరించాడట. ఈ సినిమాలో జగన్ పాత్ర నిడివి తక్కువే అయినా పవర్‌ఫుల్ రోల్ కాబట్టి కార్తీ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. త్వరలో అతను సినిమా షూటింగ్‌లో చేరతాడని తెలిసింది.