జక్కన్న మూవీలో పోలీస్ ఆఫీసర్ గా చరణ్?

Ramcharan will Play Police Officer Role in Rajamouli's Multi Starrer

హైదరాబాద్: ‘బాహుబలి’ మూవీతో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి తన తదుపరి చిత్రంపై దృష్టిసారించారు. తన తరువాతి మూవీని మల్టీస్టారర్‌గా తెరకెక్కించాలని జక్కన్న యోచిస్తున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అంతేగాక ఈ చిత్రంలో రామ్‌చరణ్, ఎన్‌టిఆర్ హీరోలుగా నటించనున్నారని తెలుస్తోంది. దీనికి బలం చేకూరుస్తే ఇటీవల రాజమౌళి తన ట్విట్టర్ ఖాతాలో చెర్రీ, తారక్‌లతో కలిసి దిగిన ఓ ఫోటోను పోస్టు చేసిన సంగతి తెలిసిందే.

NTR,-Charan-and-Rajamouli

ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో కొనసాగనుందనే పుకార్లు కొన్ని రోజులక్రితం వరకూ షికార్లు చేశాయి. అయితే ఆ వార్తలో ఎంతమాత్రం నిజం లేదని చెర్రీ స్పష్టం చేశాడు. ఈ మూవీలో చరణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారనేది తాజా సమాచారం. ఇంతకుముందు ఆయన పోలీస్ గా కనిపించిన ‘ధృవ’ మూవీ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తారక్ పాత్ర ఏమై ఉంటుందనేది అందరీలో ఆసక్తికరంగా మారింది. అంతేగాక ఈ చిత్రంలో తారక్, చెర్రీలకు జోడీలుగా ఎవరు కనిపించనున్నారనేది కూడా అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఇక ఇంతకుముందు జక్కన్న దర్శకత్వంలో చరణ్… మగధీర వంటి బ్లాక్ బస్టర్ మూవీలో నటించాడు. అలాగే తారక్… స్టూడెంట్ నెం.1, సింహాద్రి, యమదొంగ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన విషయం విదితమే. దీంతో ఈ మల్టీస్టారర్‌ కాంబినేషన్ కుదిరితే మాత్రం ఇండస్ట్రీలో మరో మైలురాయి మూవీ రావడం ఖాయమని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలాఉండగా ప్రస్తుతం చరణ్… బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్న మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. అలాగే ఎన్‌టిఆర్, త్రివిక్రమ్ కాంబోలో ‘అరవింద సమేత వీర రాఘవ’ మూవీతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

Comments

comments