జక్కన్న డైరెక్షన్‌లో బాక్సర్లుగా చెర్రీ, తారక్…?

Rajamouli-with-Charan-and-N

హైదరాబాద్: ‘బాహుబలి’ మూవీతో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి తన తదుపరి చిత్రంపై దృష్టిసారించారు. తన తరువాతి మూవీని మల్టీస్టారర్‌గా తెరకెక్కించాలని జక్కన్న యోచిస్తున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అంతేగాక ఈ చిత్రంలో రామ్‌చరణ్, ఎన్‌టిఆర్ హీరోలుగా నటించనున్నారని తెలుస్తోంది. దీనికి బలం చేకూరుస్తే ఇటీవల రాజమౌళి తన ట్విట్టర్ ఖాతాలో చెర్రీ, తారక్‌లతో కలిసి దిగిన ఓ ఫోటోను పోస్టు చేసిన సంగతి తెలిసిందే.

NTR,-Charan-and-Rajamouli

అయితే తాజాగా ఈ మూవీలో చెర్రీ, తారక్ బాక్సర్లుగా కనిపించనున్నరానే ఊహాగానాలు వస్తున్నాయి. దీనికోసం చరణ్, ఎన్‌టిఆర్ బాడీబిల్డింగ్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ చిత్రానికి ‘యమధీర’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారట. అన్నీ కుదిరితే 2018 ఫిబ్రవరిలో సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉందని సమాచారం. ఈ భారీ మల్టీస్టారర్‌ను డివివి దానయ్య నిర్మించనున్నారట. తెలుగు, తమిళం, హిందీ మూడు భాషల్లో ఒకేసారి ఈ మూవీని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.

ఇక ఇంతకుముందు జక్కన్న దర్శకత్వంలో చరణ్… మగధీర వంటి బ్లాక్ బస్టర్ మూవీలో నటించాడు. అలాగే తారక్… స్టూడెంట్ నెం.1, సింహాద్రి, యమదొంగ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన విషయం విదితమే. దీంతో ఈ మల్టీస్టారర్‌ కాంబినేషన్ కుదిరితే మాత్రం ఇండస్ట్రీలో మరో మైలురాయి మూవీ రావడం ఖాయమని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలాఉండగా ప్రస్తుతం చరణ్… సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం 1985’ మూవీతో బిజీగా ఉండగా, తారక్… త్రివిక్రమ్ చిత్రంలో నటించేందుకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే.

The post జక్కన్న డైరెక్షన్‌లో బాక్సర్లుగా చెర్రీ, తారక్…? appeared first on .