చెట్టూచేమా గుట్టలు పిట్టలు ఉంటేనే ఊరు

ఊరంటే సకల జీవరాశులు కలెగల్సిన నేల. ఊరంటే చెట్టూ చేమా అడవి అరణ్యం గుట్టలు బోర్లు కంచెలు చెరువులు పొలాలు పిల్లబాటలు అన్ని కలిస్తేనే అసలైన పల్లె. పల్లె అనంగనే గుట్ట కొండ దానిమీదో గుడి యాదికస్తది. బాట పొంట పోతాంటే సుట్టు పచ్చని చెట్లు. చెట్ల మీద పిట్టలు కాకులు గొర్రెంకలు. పొలాలల్ల తిరిగే కొంగలు. ఊర్లల్ల వాడలల్ల తిరిగే మొరిగే కుక్కలు. కుక్కల కూనలు, ఇండ్లల్ల కాళ్ళల్ల తిరిగే పిల్లులు. పిల్లి కూనలు. ఇదంతా […]

ఊరంటే సకల జీవరాశులు కలెగల్సిన నేల. ఊరంటే చెట్టూ చేమా అడవి అరణ్యం గుట్టలు బోర్లు కంచెలు చెరువులు పొలాలు పిల్లబాటలు అన్ని కలిస్తేనే అసలైన పల్లె. పల్లె అనంగనే గుట్ట కొండ దానిమీదో గుడి యాదికస్తది. బాట పొంట పోతాంటే సుట్టు పచ్చని చెట్లు. చెట్ల మీద పిట్టలు కాకులు గొర్రెంకలు. పొలాలల్ల తిరిగే కొంగలు. ఊర్లల్ల వాడలల్ల తిరిగే మొరిగే కుక్కలు. కుక్కల కూనలు, ఇండ్లల్ల కాళ్ళల్ల తిరిగే పిల్లులు. పిల్లి కూనలు. ఇదంతా ఊరి వాతావరణం. ఊర్లల్ల ఒగలకొకలు అంతా మంచేనా బిడ్డ అని మందలిచ్చుకుంటరు. అయితే ఊర్లకు చెరువులు వాగులు. వాగుల ఉసికె గుట్టలు బండలు సహజ సంపదలు ప్రకృతిపరంగా ఉన్నవి. చెట్లు కూడా అంటే ఒక రాలె చెట్టు. ఒక చింత చెట్టు పెద్దగా పెరుగాన్నంటే ముప్పయి, నలభై ఏండ్లు పడతది. ఇటువంటి చెట్లను ఎవ్వలు కొట్టకపోయేది. పెద్దపెద్ద చెట్లకింద గొడ్ల మంద, బర్ల మంద పెట్టుకునేది. చెల్కల చెట్లకిందనే గొర్లు విశ్రాంతి తీసుకునేది. ఏదైనా కట్టి ఇంటికి అవసరం ఉంటే తప్ప చెట్టును కొట్టరు. ఎందుకంటే చెట్టు పట్ల అంత ప్రేమతోని ఉండేవాల్లు. ఈ మధ్యన చెట్లను కొట్టి పైసలకు అమ్ముకుంటుండ్రు. అట్లనే ఇండ్లడ్ల చెట్టు పెట్టినోల్లు కూడా ఏరు గోడ పంగకొట్టుతన్నయి అని కొట్టేస్తున్నారు. వాస్తుకు ఈ చెట్టు ఇక్కడ ఉండకూడదు అని కొట్టేసేవాల్లు కూడా ఊర్లల్ల ఈ మధ్యన ఎక్కువ అయ్యిండ్రు.

చెట్ల సంగతే గిట్లుంటే గట్టల గురించి చెప్పరాదు. గుట్టలను సూస్తే ఊరు అందం పెరుగుతది. అటువంటిది గుట్టలల్ల గ్రైనేట్ రాయి ఉండటం వల్ల ఆ గుట్టలను కొన్ని ఊర్లల్ల విదేశాలకు అమ్ముతున్నరు. సహజ వనరులు అమ్ముతే తాత్కాలికంగా పైసలు కావచ్చుగాని మల్లీ పుట్టయి. గుట్ట మొత్తం గ్రెనేడ్ వ్యాపారులకు లీజుకు ఇస్తే ఓ పదేండ్లల్ల దాన్ని పగలగొట్టి అమ్మి ఆ ఊరు పక్కన గుట్ట ఉండేది. ఇప్పుడు గుట్ట లేదు. గుట్టలేని ఊరును సూడబుద్దికాదు గాని గుట్ట పచ్చ కోట్లకు బలైపోయిన సంగతి ఎవలు గమనిస్తలేరు. చెట్టు పోతే మల్లి పెట్టుకోవచ్చు. ఓ ఇరవై ఏండ్ల తర్వాత మల్ల పెరుగతది గాని గుట్టను పోగొట్టుకుంటే మల్ల పుట్టది గాక పుట్టది.

గుట్ట ఉంటే గుట్టల శిల్పక్కచెట్లుంటయి రేగి చెట్లుంటయి అరొక్క పండ్ల చెట్లుంటయి. గుట్టల కోతులు, కొండెంగలు గుడ్డేలుగులు, నెమల్లు ఇంకా మస్తు జీవరాశులు తిరుగతయి. గుట్టలల్ల సకల ఔషధ మొక్కలు ఉంటయి పెద్దపెద్ద చింత చెట్లు ఉంటయి. గుట్టమీదనే మొగలుంటది. మొగులు గుట్టను తాకి వానలు పడుతయి. గుట్టమీద పడ్డ వాన కాలువ కాలువలుగా పారి కింద ఊర్లర్ల చెరువులు నింపుతయి. గుట్ట అంటేనే సకల జీవావరణ వేదిక. అసోంట గుట్టలు మాయంఅవుడు ఊరు కళతప్పిన కాలం దాపురిస్తది.

ఊరుకు మౌళికంగా ఉండేవి చెరువు, వాగులు, గుట్టలు, చెట్లు. అయితే చెట్లు, గుట్టలు పోయినంక ఇంక ఊర్లె ఏవుంటయి. ఊరికె పోనీకి ఎవలకి పోబుద్ది కాదు. గుట్టలమీదనే చిన్నచిన్న గుల్లు ఉంటయి. అవి ఉండంగ కూడా గుట్టను కైమ కొట్టి అమ్ము కుంటుండ్రు. రానురాను అన్ని అమ్ముకునేట్టు ఉన్నది. ఎన్కట గిట్ల కాకుంటుండే. ఊరును కాపాడాలె, వాగును కాపాడాలె, చెట్టును కాపాడా లెననే భక్తిభావం ఉంటుండే. గుట్టకు అవసరమైన బండ ఇండ్లకు అవసరమైనది తెచ్చుకుంటె పెద్ద ఖర్చు అయ్యేది ఏం లేదు. అట్లనే వాగుల ఉసికె సుత ఇండ్ల కట్టుకుంటే పెద్ద ఒడిసి పోయేది ఏం లేదు కాని మొత్తం ఉసికెను పురాగ లేకుంట చేసి మాయం చేస్తే నీళ్ళ ఊట ఎక్కడ ఉంటది.

ఊరి సుట్టు సక్కటి నున్నటి డాంబర్ రోడ్‌లు వచ్చినయి రయ్ మని లారీలు నడుస్తున్నయి. ఊరిల ఉన్న వనరులన్ని పోతున్నయి. మల్ల ఇవి ఎక్కడి పోతున్నయి అంటే వేరే దేశాలకు పోవుడు. అక్కడ వాళ్ల గుట్టలను కాపాడకుంట మన గుట్టలకు ఎసరు పెట్టిండ్రు.పూర్వకాలంల ఉన్న ఊరును, చెట్లను, గుట్టలను, వాగులను, వంకలను పిట్టలను, గుట్టలను కాపాడుకోవాలె. గింత లోతు తవ్వంగనే శాద బాయిలల్ల నీళ్లు వచ్చేది. భూగర్భంల నీళ్లు జాడ కూడా లేకుండా పోయింది. నీళ్ళను వాడకం ఎక్కువ అయింది. చెట్లు తక్కువ అవడం వల్ల వానలు పడుతలేవు. వానలు లేక నీళ్ళు లేవు. పంటలు తక్కువ, పని తక్కువ. వలసలు పోవుడు ఊరంతా రోడ్‌గా తయారుకాకుంటా ఊరును కాపాడు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

అన్నవరం దేవేందర్ 94407 63479

Comments

comments