చితాభస్మ రాజకీయాలు

కచ్చితంగా వాజపేయి ఈ నివాళికి అర్హులే. ప్రధానమంత్రి మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ఈ కలశాలను వివిధ రాష్ట్రాల బిజెపి అధ్యక్షులకు అందజేశారు. వారు తమ తమ రాష్ట్రాలలో నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించారు. ఇది అభ్యంతరకరం కానక్కర్లేదు. కానీ వాజపేయి చితా భస్మ నిమజ్జనాన్ని బిజెపి వ్యవహారంగా మార్చడంవల్ల బిజెపి నాయకుల్లోకెల్లా ఉదారవాది అయిన వాజపేయిని మన్నిస్తున్నట్టా, ఈ అవకాశాన్ని రాజకీయ ప్రయోజనాలకు వినియోగిస్తున్నట్టా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆప్తుల చితాభస్మాన్ని నదుల్లో కలపడంవల్ల వారి […]

కచ్చితంగా వాజపేయి ఈ నివాళికి అర్హులే. ప్రధానమంత్రి మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ఈ కలశాలను వివిధ రాష్ట్రాల బిజెపి అధ్యక్షులకు అందజేశారు. వారు తమ తమ రాష్ట్రాలలో నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించారు. ఇది అభ్యంతరకరం కానక్కర్లేదు. కానీ వాజపేయి చితా భస్మ నిమజ్జనాన్ని బిజెపి వ్యవహారంగా మార్చడంవల్ల బిజెపి నాయకుల్లోకెల్లా ఉదారవాది అయిన వాజపేయిని మన్నిస్తున్నట్టా, ఈ అవకాశాన్ని రాజకీయ ప్రయోజనాలకు వినియోగిస్తున్నట్టా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

ఆప్తుల చితాభస్మాన్ని నదుల్లో కలపడంవల్ల వారి ఆత్మ భవబంధాల నుంచి విముక్తం అవుతుందన్నది హిందూ మతానుయాయుల నమ్మకం. దీనివల్ల మరణించిన వారికి వుముక్తి, మోక్షం దక్కుతాయని అనుకుంటారు. అందుకే స్థాయీ భేదాలతో నిమిత్తం లేకుండా హిందువులు అస్థి నిమజ్జనానికి ప్రాధాన్యత ఇస్తారు. అందరూ గంగానదిలో చితాభస్మాన్ని నిమజ్జనం చేయలేకపోవచ్చు కనక దగ్గరలో ఉన్న నదుల్లో నిమజ్జనం చేస్తూ ఉంటారు. విదేశాలలో ఉంటున్నవారు కూడా హరిద్వార్, హృషీకేష్, వారాణసివంటి చోట్లకు వచ్చి గంగా నదిలో అస్థి నిమజ్జనం చేసే వారున్నారు. ఇలాంటి వారికి తోడ్పడడానికి ఆ సందర్భంగా ఉచిత పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేసే వ్యవస్థలు కూడా ఉన్నాయి.

ఇలాంటి సంప్రదాయం ఉన్న చోట మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి అస్థి నిమజ్జనాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించడంలో అభ్యంతరకరమైంది, ఆశ్చర్యపదవలసింది ఏమీ లేదు. పైగా ఆయన హిందూ మత విశ్వాసాలు దండిగా ఉన్న వారే. నిరీశ్వరవాది అయినా, ఎన్నడూ హిందూ మత విధులను పాటించని పండిత్ నెహ్రూ సైతం తన చితాభస్మాన్ని దేశమంతటా పవిత్ర నదుల్లో నిమజ్జనం చేయాలని వీలునామాయే రాసి పోయారు. ప్రత్యేక రైళ్లల్లో, భారత వైమానిక దళ విమానాల్లో నెహ్రూ చితాభస్మాన్ని దేశంలోని మూల మూలలకు చేర్చి నిమజ్జనం చేశారు. ఆయన చితాభస్మాన్ని హైదరాబాద్ కు తీసుకొచ్చి మూసీ-ఈసా నదుల సంగమ స్థానంలో కలిపారు. అప్పుడు కాసు బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రి. ఆ చితాభస్మాన్ని తరలించే దృశ్యాన్ని మార్గ మధ్యంలో చూడడానికి నేనూ వెళ్లాను. అప్పుడు నాకు పదకొండేళ్లు. దివంగత నాయకుల మీద భక్తి ప్రపత్తులు వెల్లడించడానికి అదో సందర్భం.

సాధారణంగా ఎవరైనా మరణించిన ఏడు రోజుల్లోగా చితా భస్మాన్ని నిమజ్జనం చేయడం రివాజు. గాంధీ చితాభస్మాన్ని ఆయన మరణించిన తరాత 62 ఏళ్లకు కూడా నిమజ్జనం చేశారు. మహాత్మా గాంధీ పరమత సహనం ఎంత విశిష్టమైంది అయినా ఆయన నిఖార్సయిన హిందూ మతానుయాయి. హిందూ మత విధుల ప్రకారమే తన అంతిమ సంస్కారం జరగాలని కోరుకున్నారు. సాధారణంగా పెద్ద కొడుకు తల్లిదండ్రుల అంతిమ సంస్కారం నిర్వహిస్తాడు. కానీ గాంధీ చితికి ఆయన పెద్ద కొడుకు హరిలాల్ నిప్పంటించలేదు. ఆయన అందుబాటులో లేక కాదు. అంతిమ సంస్కారం నిర్వహించడానికి హరిలాల్ అంగీకరించనందువల్ల ఆయన తమ్ముళ్లిద్దరూ ఆ బాధ్యత నిర్వర్తించారు. హరీలాల్ గాంధీకి తండ్రి మీద కోపం. తాను ఇంగ్లాండ్ వెళ్లి తండ్రి లాగే బారిష్టర్ కావాలన్న కోర్కెను మహాత్మా గాంధీ తీర్చనందుకు ఆయన ఆగ్రహించారు. హీరాలాల్ తాగుబోతుగా మారారు. గాంధీ అంత్యక్రియలకు హాజరైతే ఆయనను గుర్తు పట్టడమే కష్టమయ్యేంతగా మారి పోయారు. బికారిగా మారారు హరీలాల్ 1936లో ఇస్లాం మతం స్వీకరించి అబ్దుల్లా గాంధీ అని పేరు కూడా మార్చుకున్నారు. అయితే తల్లి కస్తూర్బా గాంధీ కోరిక మేరకు ఆర్యసమాజం ద్వారా మళ్లీ హిందూ మతం స్వీకరించారు. హీరా లాల్ అని కొత్త పేరు పెట్టుకున్నారు. గాంధీ మరణించిన ఆరు నెలలకే మృతి చెందారు.

1948 జనవరి 30న నాథూ రాం గాడ్సే గాంధీని హత మార్చారు. గాంధీ చితా భస్మాన్ని డజన్ల కొద్దీ కలశాల్లో నింపి ఆయన కుటుంబ సభ్యులకు, బంధు మిత్రులకు అందజేశారు. దేశంలోని అనేక నదుల్లో నిమజ్జనం చేశారు. కాని అలాంటి ఒక కలశాన్ని గాంధీ మరణించిన 60 ఏళ్లకు 2008లో గాంధీ మునిమనవరాలు నీలం బెన్ పారిఖ్ బొంబాయి తీరంలోని చౌపాటి బీచ్ వద్ద అరేబియా సముద్రంలో నిమజ్జనం చేశారు. ఆమె హీరాలాల్ పెద్ద కూతురు రామి బెహన్ కూతురు. నీలం బెన్ పారిఖ్ రచయిత్రి కూడా. శుద్ధ గాంధేయ వాది. ఖద్దరే కడ్తారు.

హీరాలాల్ గాంధీకి, మహాత్మా గాంధీకి మధ్య విభేదాల గురించి ఆమె ఓ పుస్తకం రాశారు. ఈ గ్రంథం ఆధారంగానే ఫెరోజ్ అబ్బాస్ ఖాన్ ‘గాంధీ మై ఫాదర్‘ సినిమా తీశారు. నీలం బెన్ పారిఖ్ 2008లో గాంధీ చితా భస్మాన్ని అరేబియా సముద్రంలో కలపడంవల్ల గాంధీ ఆంతకు శాంతి కలిగించడమే కాకుండా మహాత్ముడికి, ఆయన పెద్ద కుమారుడు హరీలాల్ కు మధ్య ఉన్న విభేదాలకు తెరదించినట్టయిందని భావించిన వారు ఉన్నారు. నీలం బెన్ అరేబియా సముద్రంలో కలిపిన గాంధీ చితా భస్మ కలశం దుబైలోని ఓ భారత వ్యాపారి అందించింది. ఇలాంటి కలశం ఒకటి ఉన్నట్టు అరవై ఏళ్ల తర్వాత కాని తెలియలేదు. ఆ వ్యాపారి తండ్రి మహాత్మా గాంధీకి సన్నిహిత మిత్రుడు.

గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ మహాత్ముడి చితా భస్మం ఒక బ్యాంకు లాకర్లో ఉన్నట్టు గమనించి కోర్టు కెళ్లి పోరాడి సంపాదించి 1997లో గంగా, యమున నదుల సంగమ స్థానంలో నిమజ్జనం చేశారు. హరీలాల్ నిర్వహించవలసిన బాధ్యతలను చివరకు తాము నిర్వహించాగలిగామని తుషార్ గాంధీ అన్నారు. కాలిఫోర్నియాలోని ఓ ఆశ్రమంలోనూ, పుణేలోని ఆగా ఖాన్ పాలెస్ లోనూ గాంధీ చితాభస్మ కలశాలు ఉన్నాయంటారు.

మహాత్మా గాంధీ మరణించిన 62 ఏళ్ల తర్వాత మరో కలశాన్ని 2010 జనవరి 30న, అంటే గాంధీ వర్దంతి రోజున దక్షిణాఫ్రికా సముద్ర తీరంలో హిందూ మహా సముద్రంలో నిమజ్జనం చేశారు. మహాత్ముడి మనవరాలు ఇలా గాంధీ ఈ అస్థి నిమజ్జనం చేశారు. హిందూ మహా సముద్రం భారత్ ను దక్షిణాఫ్రికాతో కలుపుతుంది కనక, ఈ రెండు దేశాలూ గాంధీ కార్యక్షేత్రాలు కనక ఉంగేని నది సముద్రంలో కలిసే చోట ఇలా గాంధీ నిమజ్జనం చేశారు.

హిందూ మతంపై ఆట్టే విశ్వాసం లేని పండిత్ నెహ్రూ తన చితా భస్మాన్ని దేశంలోని నదులన్నింటిలో కలపాలని వీలునామా రాశారు. నెహ్రూ చితా భస్మాన్ని ప్రత్యేక రైలులో అలహాబాద్ తీసుకెళ్లినప్పుడు చితాభస్మం ఉంచిన రైలు పెట్టెకు తెల్ల రంగు వేశారు. ప్రతి రైల్వే స్టేషన్ కు జనం తండోపతండాలుగా తరలి వచ్చి శ్రద్ధాంజలి ఘటించారు. స్టేషన్ లో రైలు ఆగినప్పుడల్ల ఇందిరా గాంధీ ముకుళిత హస్తాలతో రైల్వే స్టేషన్లో ఉన్న వారికి అభివాదం చేశారు. రైలు ఆగని సమయంలోనూ పొలాల్లో పని చేసుకుంటున్న వారు పని ఆపేసి మౌనంగా నిలబడి నెహ్రూకు శ్రద్ధాంజలి ఘటించారు. వాజపేయి చితాభస్మాన్ని దేశంలోని వివిధ నదుల్లో నిమజ్జనం చేయడంతో పాటు తాలుకా స్థాయిలో కూడా ప్రార్థనా సమావేశాలు ఏర్పాటు చేయాలని బిజెపి నిర్ణయించింది.

కచ్చితంగా వాజపేయి ఈ నివాళికి అర్హులే. ప్రధానమంత్రి మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ఈ కలశాలను వివిధ రాష్ట్రాల బిజెపి అధ్యక్షులకు అందజేశారు. వారు తమ తమ రాష్ట్రాలలో నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించారు. ఇది అభ్యంతరకరం కానక్కర్లేదు. కానీ వాజపేయి చితా భస్మ నిమజ్జనాన్ని బిజెపి వ్యవహారంగా మార్చడంవల్ల బిజెపి నాయకుల్లోకెల్లా ఉదారవాది అయిన వాజపేయిని మన్నిస్తున్నట్టా, ఈ అవకాశాన్ని రాజకీయ ప్రయోజనాలకు వినియోగిస్తున్నట్టా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. వాజపేయి ఎప్పుడూ సంఘ్ పరివార్ సిద్ధాంత పరిధిలోనే ఉన్నారు. అయినా ఆయన ఇతర మత భావజాలం ఉన్న వారిని ఈసడించలేదు. ద్వేషించలేదు.

కత్తిగట్టినట్టు ప్రవర్తించలేదు. బిజెపికే కాక ఇతరులకూ వాజపేయికి శ్రద్ధాంజలి ఘటించే హక్కు ఉంది. ఈ కార్యక్రమాన్ని బిజెపి వ్యవహారంగా మార్చి వాజపేయికి ఉన్న సర్వజనామోద యోగ్యతను పరిమితం చేస్తున్నట్టుంది. వాజపేయి నిస్సందేహంగా బిజెపి నాయకుడే. కానీ ఒకప్పుడు ఆయన దేశ ప్రధానమంత్రి. అయిదేళ్ల పూర్తి కాలం ప్రధానిగా కొనసాగిన ఏకైక కాంగ్రెసేతర నాయకుడు. జీవిత కాలమంతా ఇతర పార్టీల నాయకులను మన్నించారే తప్ప ద్వేషించలేదు. అందుకే ఆయన ఎన్.డి.ఎ. సంకీర్ణ ప్రభుత్వాన్ని సమర్థంగా నడపగలిగారు. దేశానికంతటికీ ప్రధానిగా నడుచుకున్నారు తప్ప బిజెపికే ప్రధానిని అనుకోలేదు.

ఈ సంకుచిత అభిప్రాయం వాజపేయికి ఎన్నడూ లేదు. ఆయన సిద్ధాంతాలను ఎంత తీవ్రంగానైనా వ్యతిరేకించవచ్చు. విభేదించవచ్చు. కాని ఆయన నడవడికలో ప్రదర్శించిన ఔదార్యాన్ని ఆయన శత్రువులూ విస్మరించలేరు. వాజపెయి అస్థి నిమజ్జనాన్ని బిజెపి నిర్వహిస్తున్న తీరు మాత్రం ఆయన వారసత్వాన్ని 2019 ఎన్నికలలో సొమ్ము చేసుకునే రీతిలోనే ఇంది. బిజెపితో సంబంధం లేకపోయినా వాజపేయిలోని భిన్న కోణాలను అభిమానించే వారికీ బిజెపి వ్యవహార సరళి బాధ కలిగిస్తోంది. సానుభూతి పవనాలను బ్యాలెట్ పెట్టెల్లోకి దించి లబ్ధి పొండం కాంగ్రెస్ సంస్కృతి మాత్రమే కాదు.

                                                                                                                                                –  ఆర్వీ రామారావ్

Related Stories: