చరిత్ర చాటిన ‘కాలనాళిక’

‘ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం’ అని కాచివడబోసిన -అధ్యయనసారాన్నీ, అనుభవభారాన్నీ అక్షరీకరించాడు శ్రీశ్రీ. ఆనాటి నైజాం రాజ్యం, ఆ మధ్య హైదరాబాద్ స్టేట్, నిన్నమొన్నటి ఆంధ్రప్రదేశ్, ప్రజల బాధావ్యధల దారుణ కన్నీటిగాథమాత్రం – శ్రీశ్రీ అక్షరీకరణలోని సత్యానికి నిత్యనిరంతర సాక్షి. ఎలా? ఇదిగో – ఇలా- రామాచంద్రమౌళి’ ‘కాలనాళిక’లో భద్రపరచబడి! ‘కాలనాళిక’ని గత 80సంవత్సరాల వరంగల్లు మహానగర చరిత్ర కథాత్మకనవల’ అన్నారు. కనుక, చరిత్రలో కథ కలిసింది. […]

‘ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం’ అని కాచివడబోసిన -అధ్యయనసారాన్నీ, అనుభవభారాన్నీ అక్షరీకరించాడు శ్రీశ్రీ. ఆనాటి నైజాం రాజ్యం, ఆ మధ్య హైదరాబాద్ స్టేట్, నిన్నమొన్నటి ఆంధ్రప్రదేశ్, ప్రజల బాధావ్యధల దారుణ కన్నీటిగాథమాత్రం – శ్రీశ్రీ అక్షరీకరణలోని సత్యానికి నిత్యనిరంతర సాక్షి. ఎలా? ఇదిగో – ఇలా- రామాచంద్రమౌళి’ ‘కాలనాళిక’లో భద్రపరచబడి! ‘కాలనాళిక’ని గత 80సంవత్సరాల వరంగల్లు మహానగర చరిత్ర కథాత్మకనవల’ అన్నారు. కనుక, చరిత్రలో కథ కలిసింది. కథలో చరిత్ర నడిచింది. రెండూకలగలిసి నవలాత్మకంగా పాఠకుడి మనసులో దుర్భరమైన వేదనని నింపాయి. గుండెని ‘చిత్తడినేల’ చేశాయి. చరిత్ర కనుక కోటి కోటి కన్నీటిచారలజ్ఞాపకాలు. వందల వేల దారుణ దుర్మా ర్గ దౌష్ట్య దౌర్జన్యాల ఆనవాళ్ళు. 1324నుండి 2014 వరకూ జాలువారిన సామాజిక రాజకీయ ఆర్థిక కళావైజ్ఞానిక సాహిత్య సాంస్కృతిక పరిణామాల దృశ్యచిత్రణ. ఇదంతా గాఢమైన ఉద్వేగంతో, సాంద్రమైన ఆర్తితో, ఒక పరిణత కవీ, కథకుడూ, నవలా రచయిత చంద్రమౌళి సాహిత్య విజ్ఞతతో, అతనొక సామాజిక బాధ్యతా నిమగ్నతతో చేసిన అపురూప రచనగా రూపుదాల్చింది.
నవలా నాయకుడు రాజగోవిందు. నవల ప్రారంభం నాటికి అతను 26 ఏళ్ళవాడు. ఆజాంజాహి మిల్లులో కప్డాఖాతా నడిచే మూడుషిఫ్ట్‌లలో అందరికంటే చురుకైన, కష్టించిపనిచేసే, అతి ఎక్కువ ఉత్పత్తిని సాధించే కార్మికుడు. గత ఏడాదినుండి ‘షాన్’ పురస్కారం. అందరికన్న రెట్టింపు పని చేస్తాడు. అటు వ్యక్తిగా, అధ్యయనశీలిగా,స్వీయ అనుభవాల్ని రెప్పలకింద దాచుకుంటూ, చరిత్ర పరిణామాల్లో ప్రత్యక్ష, పరోక్ష ప్రమేయంతో ఎదిగినవాడు. తనతోపాటు తన భార్య రాజ్యలక్షినీ చేయి పట్టి నడిపించినవాడు.ఆమెను విద్యావంతురా ల్నీ, విజ్ఞురాల్నీ, ఉత్తమగృహిణినీ, పారిశ్రామికవేత్తనీ చేసిన మహిళా చైతన్యాభిలాషి! నవల ఫిబ్రవరి 5, 1946తో మొదలైంది. ఆవేళ రాజగోవిందు వరంగల్ స్టేషన్‌లో గాంధీగారిని చూసి ఉద్వేగి అయ్యాడు. ఆయన కాళ్ళమీద పడ్డాడు. గాంధీగారు వంగి, స్వయంగా అతని భుజాలు పట్టుకుని లేవనెత్తారు. వీపుపై చేతితో నిమిరి ‘బడోఆగే అహింసా సే లడ్నా హై జంగ్’ అన్నాడు కరచాలనం చేస్తూ. రాజగోవిందుకు శరీరమంతా విద్యుత్తు ప్రవహించినట్లైంది. ఆ ఉత్తేజంతో, స్ఫూర్తితో గుండె నిండిపోయింది. ఇంటికొచ్చేసరికీ ఆడబిడ్డని ప్రసవించి ఉన్నది భార్య రాజ్యలక్ష్మి! అక్కణ్ణుంచీ సుదీర్ఘ జీవన ప్రయాణంలో తెలంగాణా రాష్ర్ట ఆవిర్భావ సుదినాన్ని చూసే అదృష్టానికి నోచుకుని ఆనందించాడు. రాజ్యలక్ష్మి టెక్స్‌టైల్స్ ప్రారంభించి పారిశ్రామికవేత్తగా నిలబడ్డాడు. మొత్తం 23మంది సభ్యులు గల పెద్దకుటుంబ పెద్దగా 98 ఏళ్ళ నిండుజీవితాన్ని గడిపిన ధన్యజీవి అయినాడు. పిల్లల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్ది వారు విజ్ఞానవంతులుగా, ఇంజనీర్లుగా, ఐఏఎస్, ఐపిఎస్ లుగా ఎదిగేట్లు స్ఫూర్తి కలిగించిన నాయకుడైనాడు. ఇది ఒక పార్శ్వం.
తెలంగాణ, సాయుధ పోరాటం నుండి, తొలి, మలి తుది ఉద్యమాల్లో పాల్గొని – అనేక దారుణ మారణ హోమాల్నీ, హృదయవిదారకమైన సంఘటనల్నీ, ఊహాతీతమైన సంభవాల్నీ చూసి, భరించి, భరించలేక సంచలించి, ఎందరెందరో ప్రముఖ చారిత్రక మహనీయులతో అతి సన్నిహితంగా మెలగి, తెలంగాణ గడ్డపై జరిగిన అన్ని పరిణామాల్నీ గమనించిన ఉద్యమశీలిగా రాజగోవిందు బతుకు పోరు – ఇది రెండవ పార్శ్వం.
ఈ నవలా రచనలో రాజమౌళి సాహిత్యాలోచన, సామాజికదృష్టీ, ఐతిహాసిక దృక్పథం, వాస్తవికతని ‘రికార్డు’ చేయాలనే ఏకాగ్రత, కళారూప నిబద్ధత – సమస్తానికీ – ‘తెలంగాణ’ ఉద్యమచరిత్ర కేంద్రబిందువు.
దానిలో భాగంగా, దానితో సంబంధం వున్న ప్రపంచ పరిణామాల్ని కూడా విశదం చేస్తూ కథా క్రమాన్ని నిర్వహించారు రచయిత. ఎక్కడెక్కడ అలాంటి పరస్పర సంబంధం ఉన్న సందర్భాలు తటస్థించాయో అక్కడక్కడలా వాటి పూర్వాపరాల్ని చర్చించారు. వాటి ప్రస్తావనలోని సంభావ్యతని చదువరి గ్రహించేటట్లు సమన్వయించారు. ఉదాహరణకి మనదేశపు స్వాతంత్య్ర సమరం, రష్యాలో కమ్యూనిస్టు ఉద్యమం, మనదేశ రాజకీయ ఆర్థిక సామాజిక రంగాలపై, ప్రజల మనోభావాలపై, ప్రవర్తనపై – వాటి ప్రభావం. తెలంగాణలో ఆంధ్రమహాసభ ఆవిర్భావ, వికాసాలు, చోదకశక్తి, దాని ఛత్రీ క్రింద క్రమంగా తెలంగాణ సాయుధ పోరాటం రూపుదాల్చి, ప్రపంచంలోనే అతిపెద్ద తిరుగుబాటుగా సాగినవైనం, దానితో మమేకమైన ప్రముఖ నాయకులు, వారి మార్గదర్శకత్వం, సభ్యుల చొరవ, ఉరుకూ, పరుగూ, చావుబతుకులు, అడుగడుగున చీకటి వెలుగులూ, నీడలూ! ఇలా.. ఎన్నెన్నో సంభవాలు.. అలాగే, కొన్ని సంభవాల్లో, ముఖ్య ఘటనల్లో ప్రసంగాను ప్రసక్తంగా తటస్థపడే చారిత్రకాంశాల మూలాల్ని కూడా అతివిశదంగా వివరించారు. ఉదాహరణకి సమ్మక్క సారక్క జాతర సంబురాలు, రామప్ప దేవాలయం, ఓరుగల్లు చరిత్ర, భద్రకాళి దేవాలయం,మన దేశ ఆర్థిక రాజధానిగా బొంబాయి గతిశీలత, అక్కడి ప్రజల జీవనతత్త్వం, శైలీ; తెలంగాణ కళాక్షేత్రంలో ‘సాధనాశూరులు’ వంటివారి ప్రత్యేక చరిత్ర, కులాలూ ఉపకులాలూ వర్ణాలూ వృత్తులూ వాటి ఆవిర్భావ మూలాలు, నాగార్జున సాగర్ డ్యామ్ నిర్మాణ చరిత్ర వంటి ప్రాధా న్యం కల అంశాల్ని ఉత్కంఠ కలిగిస్తూ పొందుపరిచారు.
ఏ నవలలో అయినా కథ పాత్ర ప్రమేయంతోనే ముందుకు జరుగుతుంది. వారి ఆశనిరాశలూ, సాఫల్యవైఫల్యాలూ, అనేకానేక ద్వంద్వాల మధ్య సంఘర్షణ,మానసిక చైతన్య స్రవంతిలో ఎత్తుపల్లాలజాలు, సంఘటనల ఘాతాలూ, సామాజిక ఘాతకాలు పెట్టే వొరిపిడీ, రాపిడీ – ఇవన్నీ నవలకి సన్నివేశాల్ని సమకూరుస్తాయి. ‘కాలనాళిక’లో వీటన్నిటిని చూస్తాము మనం.
రాజగోవిందు, అతని భార్య రాజ్యలక్ష్మి ఒక జంట. రాజగోవిందు చెల్లె వీరలక్ష్మి ఆమె భర్త కైలాసం- ఇంకొక జంట. కథ ముందుకు సాగిన తర్వాత ప్రవేశించే సీతాకుమారి శివాజి- మరొక జంట. వీరంతానూ, వీరి సంబంధీకులూనూ కలిసి నవలా గమనానికి విపులత్వాన్ని సమకూర్చారు. వీరందరి మానసిక, తాత్విక, భౌతిక చలనంలో, గమనంలో ప్రేరకం ఉద్యమశీలం. ఆయా వలయాల్లోని కేంద్రబిందువు నిబద్ధత. ఆ వలయాలన్నీ ఒక్కొక్కప్పుడు విడివిడి వృత్తాలుగా – వారి వారి బతుకుపోరుని చూపుతాయి. ఒక్కొక్క సందర్భంలో ఒక వృత్తం మీద మరొక వృత్తం intrude అవుతూ వుంటుంది. ఈ intrusion లోనే చరిత్ర వాస్తవం జరిగింది జరిగినట్లు చెప్పబడుతుంది.
ఎలా అంటే: ఇటు ప్రధాన కథ సాగుతుండగా అటు- నిప్పుల కొలిమిలా ఉన్న తెలంగాణలో శలభాలై పోయిన వీర ఉద్యమకారుల చర్య లూ, వారి సాహసాలూ సమరాలూ, బాధలూ, చావులూ మనల్ని కలచివేస్తాయి. కడివెండిలో జానమ్మ గడీ దాడిలో- హింసాత్మకమైన కొట్లాటలో, బీభత్సంలో, ఉద్దేశపూర్వక హమ్‌లాలో – వీరవిక్రముడు యువకిశోరం, తెలంగాణ రైతాంగ పోరాటానికి ఆద్యుడు దొడ్డికొమరయ్య అసువులు బాసి అమరుడైన దృశ్యం గుండెని పట్టేస్తుంది. ఆతర్వాత కుమ్మరి నర్సయ్య మీది అకారణ దౌర్జన్యం వంటి దుర్మార్గాల చిత్రణ వస్తుంది. అలాగే, నిజాం నియంత నిరంకుశ పాలనలో రజాకార్ల పాశవిక చర్యల్నీ, దమననీతినీ, హింసనీ ఆర్తితో చదువుతాము. దొరల దొరసానుల గడీల్లో జరిగే అకృత్యాల్ని చదువుతూ పిడికిళ్ళు బిగిస్తాము. ఉదాహరణకు జానమ్మదొరసాని గడీలో – గడ్డం నర్సింహారెడ్డి, అమీన్ మస్కీనలీ, అబ్బాస్ ఆలీతో పాటు మరో ముపె్ఫై మంది గుండాలు, స్థానిక కడివెండి తొత్తులు – అందరి పైశాచికానందం మధ్యన మంగలి మల్లేశం. అతన్ని అసహాయున్ని చేస్తూ కట్టిపడేసి క్రూరంగా హింసిస్తూ, ముంత పొగవెట్టిన దృశ్యం అక్షరీకరణ (పేజీలు 38-42) ఒక్కటే చాలు- ఈ నవలా రచన ఎంత సాధికారతతో, నిబద్ధతతో, నిమగ్నతతో సాగిందో అర్థం చేసుకోవటానికి. ఇలాంటిదే అసంఘటిత యోధుల ప్రప్రథమ పోరాటంలో వీరమరణం పొందిన బత్తిని మొగిలయ్య గౌడ్, చరమాంక చిత్రణ, చాకలి ఐలమ్మ చరిత్ర, పాలకుర్తిలో పదకొండు మంది మగాళ్ళు, ఒక స్త్రీ – అందరూ బరిబాత. హింస. నగ్నంగా ఉంచి రాక్షసక్రీడ దుష్టకృత్యం. ఇంతకింత దారుణమూ, ఘోరమూ అయిన బైరాన్‌పల్లి పై రజాకార్లదాడి, ప్రజాహింస.. (3సార్లు) అమాయకుల ప్రాణత్యాగం, ఉద్యమకారుల పోరాట పటిమ…
నవలలో కదిలే సాంఘిక చరిత్రలో రావినారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య, బసవపున్నయ్య, కొండపల్లి సీతారామయ్య, ఆరుట్ల రామచంద్రారెడ్డి, చకిలం యాదగిరిరావు వంటి మహోద్యమ నాయకుల మార్గనిర్దేశకత్వం, త్యాగాలూ కళ్ళముందు కొస్తాయి.
అర్ధరాత్రి దేశ స్వాతంత్య్ర పరిణామం, పర్యవసానంగా తెలంగాణలో ‘జెండా పండుగ’ నిర్వహణ, ఆ సందర్భంగా రజాకార్ల గుంపు దాడి, సె్వైరవిహారం చిత్రణ – ఊపిరాడనివ్వదు. మధ్యాహ్నానికి లెక్కతేలింది. మొత్తం పదిహేను మంది పోయారని…మొత్తంగా గాయపడ్డవారు దాదాపు 180 మంది.వీరుగాక వేదికకు దగ్గర్లో వున్న పాతబావి బొందలో పడి చనిపోయిన వారు దాదాపు ఒక పదిమంది..’అనే వివరణ కలత రేపుతుంది. అలాగే,అటు ప్రజ లు, ఇటు దొరలు- తలపడే మహా సంఘర్షణలో ‘భయం’ పాత్రవర్ణన – జనగాం స్టేషన్ ముట్టడి-ఎంతో ఆర్తి కలిగిస్తుంది. బాబుదొరను,అమీన్ ఆలీనీ వేలాదిమంది కలిసి బహిరంగంగా ‘కుక్కచావు’ చంపడం.అదొక రాక్షస సంహారం!
సాయుధ పోరాటం తర్వాత పోలీస్ చర్య, హైదరాబాద్ స్టేట్ ఆవిర్భావం, ఆ సందర్భంలో కమ్యూనిస్ట్ ఉద్యమకారుల ఇక్కట్లని ఆవిష్కరించారు రచయిత.
కొందరి రాజకీయాల కారణంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ, ఆ తర్వాత ఒప్పందాల ఉల్లంఘన, ఉద్యోగాల్లో నీటి వాటాల్లో అక్రమాలు… యువతలో తీవ్ర అసంతృప్తి… ఫలితంగా 1969 తెలంగాణ ఉద్యమం. చెన్నారెడ్డి నాయకత్వం, అందరి చాణక్యం- ఫలితంగా మళ్ళీ తెలంగాణ మోసపోయిన దురదృష్టం. యువతదృష్టి తీవ్రవాదం వైపు మొగ్గటం, నక్సలిజం ఊపందుకోవటం, అమాయకులపై రాజ్యహింస.. దేశంలో ఎమర్జెన్సీ.. అనంతర పరిణామాలు. 990 / 91 గ్లోబలైజేషన్ ప్రభావం. 27.4.2001 నాడు కె.సి.ఆర్ నాయకత్వాన టిఆర్‌ఎస్ ఆవిర్భావం. మలిదశ తెలంగాణ ఉద్యమం. ఉద్యమరీతులు, భిన్న కార్యక్రమాల విజయాలు.. చివరికి 2014 జూన్‌లో ప్రత్యేక తెలంగాణ ఆవిష్కారం… ఈ పరిణామాల ఉత్థాన పతనాల మధ్య రాజగోవిందు కుటుంబంలో కొత్తతరం ఎదిగి రావటం… కొడుకు, కోడలు, వరలక్ష్మి పిల్లలు… అంతా తరం మార్పు. ఈనాటి చదువు అసలు సిసలైన పెట్టుబడిగా, జ్ఞానవిజ్ఞానాల సముపార్జన… వృత్తి ప్రవృత్తుల్లో వారందరి వ్యక్తిత్వాల ఫలోదయాన్ని కథాత్మకంగా చిత్రించారు రచయిత. చివరికి రాజగోవిందు ‘తెలంగాణ డ్రీమర్’గా కెసిఆర్‌ని కలిసి గౌరవాభిమానాల్ని పొందటం… ఇదీ ఇతివృత్తపు నడక, ముగింపు. ‘కాలనాళిక’ స్థలకాల ఐక్యతకి నిర్దిష్టంగా రూపమిచ్చిన నవల. 1324 నుండి1948 వరకు మొత్తం 624 సంవత్సరాల పరాయిపాలనలో తెలంగాణ ప్రాంతం బానిస బతుకు బతికింది. తెలంగాణ ప్రజలు చితికి, కనలి, ఛిద్రజీవనాన్ని అనుభవించారు. ఆ తర్వాత దశాబ్దాల పాటు పీడనకు గురైనారు. ‘వెట్టిచాకిరి’, బానిసతనం, నిస్సహాయ లొంగుబాట్లు, ‘నీ బాంచెను దొరా’ ఊడిగంతో నిప్పులకొలిమిలో గుండెల్ని మండించుకున్నారు. పీడకుల దౌష్ట్యాన్ని, పీడితుల ఆర్తారావాల్ని నవలలో అక్షరం అక్షరాన ప్రవహింపజేశారు రామాచంద్రమౌళి. సమాచారాన్ని గ్రహించటం సేకరించటం వేరు. దాన్ని విశ్లేషించుకుని, నవలా చట్రంలోకి యిమడ్చటం వేరు. దీనికి చాలా ‘హోమ్‌వర్క్’ కావాలి. దాన్ని వివరణాత్మకంగా విశదీకరించే కథాకథన నైపుణ్యం కావాలి. ఈ విషయంలో నవలా రచయితగా రామాచంద్ర మౌళి తన సామర్థ్యాన్ని నిరూపించుకొన్నారు. కాలక్రమాన్ని మాత్రమేకాక కాలవైపరీత్యాల్ని కూడా ఆయా స్థలాల స్థానికవిలక్షణాలతో అనుసంధించగలిగారు. దీనికి అతిపెద్ద గొప్ప ఉదాహరణ ‘బైరాన్‌పల్లె’ పోరు, విధ్వంసచిత్రణ! అలాంటిదే ఆల్ హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో సహాయకార్యదర్శి రఫీ అహమ్మద్ హైదరాబాద్‌లో మొట్టమొదటి జాతీయ భారత పతాకాల్ని ఆవిష్కరించిన చారిత్రక ఘటన – చిత్రణ. ఇలా ఎన్నెన్నో ఘటనలూ, ఘట్టాలూ మనల్ని అలజడికి గురిచేస్తాయి.
‘కాలనాళిక’ ఒక ప్రణాళికాబద్ధమైన నిర్మాణం కలిగిన నవల. వ్యూహాత్మకమైన కథన విధానం కలిగిన నవల. అది ఒక కొసనుండి ఇతివృత్తాన్ని పేనుకుంటూ పోతుంది. మరో కొసనుండి సాంఘిక రాజకీయ సాంస్కృతిక వాస్తవాల్ని ఉటంకిస్తూ, ఉల్లేఖిస్తూ సాగుతుంది. ఇటు కల్పన, అటు వాస్తవ సంభవాలచిత్రణ ఇది ఒక మహేతిహాసం అనదగిన నవల. ఈ రెండు కొసల్నీ పట్టుకుని లాక్కుపోతున్నది మనుషులే. ఈ రెండు సమూహాల్లోని మనుషుల్లోని నీతినిజాయితీల్ని, నిబద్ధతల్నీ గెలుపుఓటముల్నీ, ఓర్పుతీర్పుల్నీ, ఏడ్పునవ్వుల్నీ -అఖండమైన దృశ్యశ్రవణ చిత్రణలో మెళకువతో, వెలుగునీడల కదలికలతో అనుసంధించారు రామాచంద్రమౌళి. ఈ ప్రక్రియలో ఇతివృత్తాన్ని దృశ్యమానం చేస్తూనే, కొంతమంది మనుషులచేత తమ గతజీవితానుభవాల్నీ, అనుభూతినీ వ్యక్తం చేయిస్తారు రచయిత. ‘ప్రతిమనిషిలో అజ్ఞాత అధ్యాయాలెన్నో’ అనే 12వ అధ్యాయం దీనికి ఉదాహరణగా నిలుస్తుంది. ఇందులో ఆ సన్నివేశకాలానికి నిన్న మొన్న జరిగిన ‘అఖిలభారత ఉర్దూ అభ్యుదయ రచయితల మహాసభ’ ప్రస్తావననీ, వివరాల్నీ చెప్పింది సీతాకుమారి. ఆమె చెప్పే పద్ధతితో ఆశ్చర్యపోయాడు శివాజి. రచయిత ఆ పద్ధతి గురించి ఒక వాక్యం రాశారు ఇలా-‘ఓ శేరుకూరగాయలను తరగాలె అన్నంత సుళువుగా మనుషులను చంపడం గురించి చెబుతూంటే!’ అని. ఇదీ శ్రావ్య పద్ధతి. ‘శేరు’ సవాశేరు’ కూరగాయలు ఆనాటి పలుకుబడి! ఆ తర్వాత, ప్రముఖులూ, ఉద్యమంలో ముఖ్యులూ అయిన పద్దెనిమిదిముందు రావి నారాయణరెడ్డి ఉపన్యాసంలో, ఆయన చేసే ప్రతిపాదనలో దృశ్యశ్రావ్య విధానమే పారదర్శకమైంది. దీన్నే రచయిత సృజనాత్మకప్రతిభ అంటారు. ఈ సృజనాత్మకతలో ఎప్పుడూ రచయిత ఆలోచనా పటిమ, శాస్త్రీయ సిద్ధాంతాల అవగాహనా గరిమ నిబిడీకృతమై ఉంటాయి. నవలలో రచయిత ఆలోచన పటిమ రాజగోవిందు 98 ఏళ్ళ బతుకు గీతని గీయటంలో ప్రాపంచిక దృక్పథం ఆవిష్కృతమైతే, అతని అవగాహనా గరిమ- సంక్లిష్టమూ, సజీవమూ, సశేషమూ అ అయిన ప్రత్యేక తెలంగాణ కాలరేఖపై నిలిచి నడిచిన అతని పదశక్తిలో కనిపిస్తుంది. అందువలన, నవల చదువుతుంటే-ప్రత్యక్షంగా, సన్నిహితంగా ఒక రసభరితమైన నాటకాన్ని చూస్తున్న అనుభూతి కలుగుతుంది.
‘కాలనాళిక’ ఒక ‘స్టడీకోర్స్’ వంటి నవల. నవలా కథనమంతా ఎటూ వాస్తవచిత్రణతో సాగుతూనే వుంటుంది. అయితే ఉత్తమ రచయిత – ఈ రికార్డింగ్‌తో సంతృప్తి చెందడు. ఆపై తాను చూపే విశ్లేషణతోనూ పొంగిపోడు. ఆరెండిటితో పాటు అసలు సిసలైన జీవన వ్యాఖ్యానాన్ని జోడిస్తాడు. తనదైన తన అనుభవాన్నీ, అధ్యయానాన్నీ కలగలిపి ఈ జీవన వ్యాఖ్యానంలోని ‘మెరుపు’ ‘వెలుగు’ కథనానికి గాఢతని కూరుస్తాయి. అక్కడ చెప్పిన విషయసంగ్రహాన్ని ఆలోచనీయం చేస్తాయి. ‘చాకలి ఐలమ్మ భూమి. వరికోత, దౌర్జన్యం మీద ధిక్కారం తిరుగుబాటు పర్యవసానంగా పదకొండు మంది పురుషులమీద, సీతాకుమారిమీద వారిని నగ్నంచేసి చేసిన నీచనికృష్ట పాశవిక విషాదక్రీడ… ఆ తర్వాత? ‘జనసైన్యం.. కడ కెరటమై కదిలింది. ఇక ఎవ్వనితరం కాదు సూర్యుని కాంతినాప. ప్రజాఉప్పెన ఇది.. కొట్టుకుపోకతప్పదు. గడీలు, కోటలు, తరతరాల దోపిడీ ఇక తుత్తునియలు కాక తప్పదు. కదిలిందిక ప్రజారథం.. కదిలిందిక జన తుఫాను… గాలినిండా మహోగ్రావేశం.. కోపం… ఆక్రోశం…. సలసలమరుగుతూ కట్టతెంచుకుంటున్న ఉగ్రత…’ ఇలా ఒక ఊపుతో, తూగుతో, లయతో భావోద్వేగంతో, భావనోద్రేకంతో సాగుతుంది దృశ్యీకరణం. అరెస్టులు డాడ్జివ్యాన్ వెళుతోంది. ఇక్కడ రామాచంద్రమౌళి ఇచ్చే జీవన వ్యాఖ్యలు గమనార్హం. ‘కనీసం చాకలి ఐలమ్మను, చరిత్రలో ఒక వీరవనితను చేసిన ఆ పుణ్యపురుషులను చూడలేక పోయినం కదా….’ అనే చింతన తర్వాతి వాక్యం ‘నాయకత్వ లోపం.. సరియైన దిశానిర్దేశం లేని ఒకలోటు’ అని! ఇదీ ఒక ప్రత్యేక సంభవం నుండీ జనిస్తున్న ఒక సాధారణీకరమైన సత్యవాక్కు! దీనివెంటనే రచయిత)అంటాడు. ‘యుద్ధాలను ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా…. రణరంగంలో పాల్గొన్న సాధారణ సైనికులకు కలిగే అనుభూతితో ఎవరికి మాత్రం ఏమిపని’ అని! ఈ వ్యాఖ్య ఎంత అర్థవంతమో, వాస్తవమో, ఋతమో – అంతకంత ఆర్ద్రం, ఆర్తిజనకం కూడా కదూ!
రామా చంద్రమౌళి ‘నన్ను నేను తవ్వుకుంటూ… నన్ను నేను తెలుసు కుంటూ…’ ఈ నవల రాసినట్టు ముందుమాటకి శీర్షికనిచ్చారు. అది ప్రత్యక్షర సత్యం. ఒక అసాధారణమైన, కష్టసాధ్యమైన ప్రయత్నం చేసి విజయం సాధించారు. తెలుగుు నవలా సాహిత్య క్షేత్రంలో ‘కాలనాళిక’ ఒక గిరివృక్షం! దాన్ని విత్తి, దోహదాలు చేసి నిలిపి, ఇంతదాన్ని చేసి మన ఆహ్లాదానికీ, ఆనందానికీ, అనుభూతికీ కారకుడైన రచయిత శతథా అభినందనీయుడు!!