చంద్రున్ని దాటిన చైనా లూనార్ ప్రోబ్

Lunar-Probe

బీజింగ్ : చైనా చంద్రయాత్రకు సంబంధించిన ‘చాంగ్‌ఎ4 లూనార్ పోబ్’ ఈ ఏడాది చంద్రునికి అవతలివైపు దిగవచ్చని వెల్లడైంది. ఈ మేరకు ఇమేజిలను ప్రదర్శించారు. ఈ రోవర్ చతురస్రాకార పెట్టెలా ఉంది. రెండు సౌరఫలకాలు, ఆరు చక్రాలు అమర్చి ఉన్నాయి. 1.5 మీటర్ల పొడవు, 1 మీటరు వెడల్పు, 1.1 మీటర్ల ఎత్తు కలిగి ఉంది. 2013లో ప్రయోగించిన చాంగ్‌ఎ3 లూనార్ ప్రోబ్ మాదిరిగానే ఈ చాంగ్ ఎ4 రోవర్ ఆకారం, ఇతర వ్యవస్థలు ఉంటాయని చైనా లూనార్ ప్రోగ్రాం చీఫ్ డిజైనర్ యు వెయిరెన్ చెప్పారు.

చంద్రుని అవతలివైపు సంక్లిష్ట విశాల ప్రదేశంపై కదలడానికి తగిన విధంగా విభాగాలు, పేలోడ్ అమరికలు దీనికి ఉన్నాయని తెలిపారు. ఇదివరకటి ప్రోబ్ మాదిరిగానే 4 సైంటిఫిక్ పేలోడ్స్, పనోరామిక్ కెమెరా, ఇన్‌ఫ్రారెడ్ ఇమేజింగ్ స్పెక్ట్రోమీటర్, రాడార్ మెజర్‌మెంట్ సాధనాలు, ఇవన్నీ చంద్రుని ఉపరితల దృశ్యాలను చిత్రీకరించడానికి ఉపయోగపడతాయని అన్నారు. అలాగే చంద్రుని మట్టి, నిర్మాణ స్వరూపాన్ని విశ్లేషిస్తాయని చెప్పారు. చంద్రునిపై గల శూన్యతను, తీవ్రమైన ధార్మికతను, అత్యధిక ఉష్ణోగ్రతను తట్టుకోగలుగుతుందని, చంద్రునిపై పగలు, రాత్రుళ్లు ఉష్ణోగ్రతల్లో తేడా ఉంటుందని, 300 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత చేరుకుంటుందని తెలిపారు.

లాండర్, రోవర్ ఈ రెండూ ఇతర దేశాలకు కూడా సమాచారం అందించగలవన్నారు. చంద్రునికి అవతలివైపు దక్షిణ ధ్రువంలో అయిట్‌కెన్ బేసిన్ వద్ద చాంగ్ ఎ4 లూనార్ ప్రోబ్ దిగుతుందని, అది శాస్త్రీయ పరిశీలనకు, అంతరిక్ష ప్రయోగాలకు వేడి ప్రదేశమని చెప్పారు. చంద్రుని అవతలివైపు నుంచి ప్రత్యక్ష కమ్యూనికేషన్ సాధ్యం కాదని, ఇదో ఛాలెంజ్ అని అన్నారు. భూమికి, చాంగ్‌ఎ4 లూనార్ ప్రోబ్‌కు మధ్య కమ్యూనికేషన్ అనుసంధానం కోసం చైనా ‘క్యుకియవో’ అనే శాటిలైట్‌ను మే నెలలో ప్రారంభించింది.

Comments

comments