గ్రామీణ శ్రామిక రైతాంగవర్గాల కథలు-సామాజికత

viige

ఆధునిక తెలుగు సాహిత్యంలో 1970 నిశ్చితమైన విభజన బిందువు. భావజాలం ప్రాతిపదికగా రచయితల్లో, మేధావుల్లో అంతకుముందు ఎన్నడూ లేనంత తీవ్రంగా,స్పష్టంగా వర్గీకరణ (పోలరైజేషన్) వచ్చింది. 1970 దశకం విప్లవ కవితాయుగం. 1980 దశకం సామాజిక భావజాలం చాలాతక్కువగా, వ్యక్తిగత స్పందన చాలా ఎక్కువగా ఉన్న కవిత్వం సాహిత్యరంగాన్ని ఏలిన కాలం. కాబట్టి 1970, 80 దశకాలు కవిత్వాన్ని ముందుకు తెచ్చినంతగా కథను తీసకురాలేదని చెప్పటంలో కొంత సత్యం లేకపోలేదు. దాదాపుగా ఇదే కాలంలోనే పత్రికల్లో వ్యాపార దృష్టి పెచ్చు పెరిగిపోయింది. చాలా పత్రికలు సాహిత్య ప్రమాణాలనూ,వాస్తవిక జీవితాన్నీ తిరస్కరించిన వ్యాపార నవలల్ని పుంఖాను పుంఖంగా ప్రచురించటం ప్రారంభించాయి. వ్యాపార నవల మన సాహిత్యానికి కొత్తకాదు. కానీ జీవితాన్ని ప్రమాణంగా తీసుకున్న మంచి నవలకూ, వ్యాపార నవలకూ మధ్య ఉన్న సాహిత్య విలువల తారతమ్యం ఆనాడు సాధారణ పాఠకులక్కూడా తేటతెల్లంగా ఉండేది. అది 1960 దశకంలో చెరిగిపోవటం ప్రారంభించింది. ఈ పరిణామం 1962లో ‘చక్రభ్రమణం’ ప్రచురణతో ప్రారంభమైందని చెప్పవచ్చు. దాదాపు పదిపన్నెండు సంవత్సరాలకాలం జీవితవాస్తవికతా, జీవితచలనసూత్రాల పరిజ్ఞానమూ, జీవిత దృక్పథమూ లేని నవలలు పత్రికల్ని ఆక్రమించుకున్నాయి.
భూషణం, అల్లం శేషగిరిరావు, ఎన్.ఎస్.ప్రకాశరావు, సింగమనేని నారాయణ, కవనశర్మ, అల్లం రాజయ్య, బి.యస్.రాము లు, పతంజలి, వినినమూర్తి, అర్నాద్, పాపినేని శివశంకర్, స్వామి, తుమ్మేటి రఘోత్తమరెడ్డి, జగన్నాధశర్మ, చక్రవేణు, చంద్రశేఖరరావు, పతంజలిశాస్త్రి, ఉమామహేశ్వరరావు, గంటేడ గౌరనాయుడు, జి.ఆర్.మహర్షి, నరేంద్ర, మహేంద్ర, ఓల్గా, సత్యవతి నిలదొక్కుకొని నుంచి కథలు రాస్తూ ఉన్నారు. వీరిలో కొందరు 1970కి ముందుగానే రచన ప్రారంభించినా 1970 తరువాతే వీరి ఉత్తమరచనలు వచ్చాయి. కానీ విరమించినవారు విరమించ గా మిగిలిన సీనియర్ రచయితలు చాలా కొద్దిసంఖ్యలో మాత్రమే మంచి కథల్ని రాయగలిగారు.
గ్రామీణ శ్రామిక, రైతాంగ వర్గాలు భూమికోసం, భుక్తికోసం, విముక్తి కోసం అనాది కాలం నుండీ అవిశ్రాంతంగా పోరాటం సాగిస్తున్నాయి. రెక్కలు ముక్కలు చేసుకున్నా చేరెడు నేల కూడా దక్కని పరిస్థితులకు వ్యతిరేకంగా, భూస్వాముల చేత, ధనవంతుల చేత నిరంతరంగా దోచుకోబడుతున్న తమ శ్రమశక్తుల దోపిడీలకు వ్యతిరేకంగా, తమను నిలబెట్టి కాలరాస్తున్న కలిమిగలవారి అరాచకాలకు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా శ్రామిక, రైతాంగవర్గాలు తగిన చైతన్యాన్ని పొంది, సుసంఘటీతమై, వ్యవస్థీకృతమై పోరాట బావుటాలను ఎగురవేసి జీవన పోరాటాలు సాగిస్తున్నారు. తమ హక్కులను సాధించుకొని, తమ బ్రతుకుల్ని మరింత అర్థవంతంగా తీర్చిదిద్దుకుంటున్నారు. గ్రామీణ శ్రామిక రైతాంగవర్గాలు నెరిపిన పోరాటాలను, పొందిన చైతన్యాలను, సాధించిన విజయాలను నేపథ్యంగా స్వీకరించి ఎందరో కథకులు చక్కని కథలు రచించారు. శ్రామికవర్గ చైతన్యాన్ని అక్షరీకరించిన మొట్టమొదటి తెలుగుకథ కరుణకుమార‘క్రొత్త చెప్పులు’. హద్దులు మీరి న ధనమదాంధుల క్రౌర్యాలకు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, అణగారిన దళితులు గుండెలు మండి, సంఘటితపడి, ఎదురుతిరిగి, పోరాటం నడిపి సఫలీకృతులైన ఉదంతం ఈ కథకు ఇతివృత్తం.
చిన్నపురెడ్డి ఆ గ్రామానికి మకుటంలేని మహారాజు. దౌర్జ న్యం, దుర్మార్గం అతనికి వెన్నతోపెట్టిన విద్యలు. క్రొత్తచెప్పులు కాస్తంత ఆలస్యంగా తెచ్చిన చిన్న తప్పిదానికి ఆగ్రహించి రెడ్డిగారు దిక్సూమొక్కూ లేని ‘నరిసిని’ నిర్ధాక్షిణ్యంగా కొట్టి చంపి, ఆ శవాన్ని చెరువులో వేయించి తన పలుకుబడితో, ధనబలంతో ఆ హత్యను ఆత్మహత్యగా చిత్రించారు. కానీ వాస్తవం తెలుసుకున్న దళితులు నరిసికి జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడడానికి సంఘటితమయ్యారు. చిన్నపురెడ్డి ఇంట, పొలాలలోను పనిపాటలు మానేశారు. రెడ్డి గారి ఇంటి పనులు, పొలం పనులు ఎక్క డి వక్కడే నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో రెడ్డిగారి ఎద్దు చనిపోయింది. కానీ ఎందరు బ్రతిమాలినా, బెదిరించినా ప్రలోభపరచి నా లొంగని దళితులు ఆ ఎద్దు కళేబరాన్ని ఎత్తుకుపోవడానికి నిరాకరించారు. దళితుల్ని లొంగదీసుకుపోలేక పోయానన్న మనోవ్యధతో,ఓటమితో మానసికంగా ఎంతో క్రుంగిపోయిన చిన్నపురెడ్డి నికృష్ణపు మరణాన్ని పొందాడు. దళితవర్గంలోని పోరాట పటిమ ను, సంఘటిత శక్తిని చక్కగా అక్షరీకరించిన కథ ‘క్రొత్త చెప్పులు’.
తెలంగాణా భూపోరాటాల చరిత్ర నేపథ్యంగా నడిచిన ఈ కథలో రైతాంగ పోరాటాలకు తమ జీవితాల్ని త్యాగం చేసిన పార్వతి, సుబ్బయ్యల జీవిత చిత్రణ ప్రధానాంశం. రైతులు, రైతు కూలీలే కాదు చదువు సంధ్యలకు ఎంతమాత్రం నోచుకోని దళితవర్గాలకు చెందిన మహిళలు సైతం నూతనోత్సాహంతో, ఉద్యమస్ఫూర్తితో పోరాటాలలో పాల్గొని, తమ జీవితాలను తృణప్రాయం గా త్యాగం చేసిన ఉదంతాలను కూడా కథకుడు ఈ కథలో పొం దుపరిచాడు. పోరాటవీరుల బలిదానాలతో, మరువలేని త్యాగాలతో ఎరుపెక్కిన ఉద్యమబాటలో నడిచిన సామాన్య జనులు ఎదుర్కొన్న కష్టనష్టాలను, మానావమానాలను చాలా వాస్తవంగా, మరింత ఉత్తేజభరితంగా చిత్రించిన కథ ‘గెరిల్లా’.
ఇనాక్ రాసిన ‘తల లేనోడు’ కథ కూడా భూస్వాముల దౌర్జన్యాన్ని వ్యతిరేకించినదే. ఒక మోతుబరి దుర్మార్గానికి మౌనంగా తలవంచక ఎదురుతిరిగి కోర్టులకు సహి తం వెళ్లి తన హక్కుల కోసం ధర్మపోరాటం చేసిన ఓ వృత్తి శ్రామికుని చైతన్యవంతమైన జీవితమే ‘తల లేనోడు’ కథ.
ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి రాసిన ‘చీకటి నాడీ వెలుగు నెత్తురూ’ కథ గ్రా మాలలోని భూస్వాములు పైకి కనబరచే లేదా ప్రదర్శించే ‘మంచితనం’ ఆచ్ఛాదన కింద దాగిన అసలు రహస్యాన్ని, శ్రామికవర్గ వ్యతిరేక దృక్పథాన్ని చక్కగా బయటకీడ్చిన కథ. దౌర్జన్యం ద్వారా, దుర్మార్గం ద్వారా చేయలేని పనిని మంచితనం ముసుగులో భూస్వామ్యవర్గం ఎలా చేయగలదో ఈ కథ ద్వారా కేతు విశ్వనాథరెడ్డి విశ్లేషించి చూపాడు. రామిరెడ్డి పెద్ద భూస్వామి. ఏ వ్యసనమూలేని మనిషి కనీసం ఏ కూలీని కూడా పరుషంగా నిందించి ఎరుగని సరళభాషి. ఏమగువనూ కన్నెత్తి చూడని అపర ప్రవరాఖ్యుడు. ఇన్ని మంచి గుణాలతో ఊరిలోని రైతువర్గానికంతటికీ తలలోని నాలుకలా మెదిలే రామిరెడ్డి హృదయంలో దాగిన శ్రామికవర్గ వ్యతిరేక దృ క్పథం ‘ఎర్రసుబ్బులు’ రంగప్రవేశం చేసేదాక గ్రామస్థులెవ్వరూ గుర్తించలేకపోయారు. తన దగ్గర ఏళ్లతరబడి పనిచేస్తున్న పాలేరుల, పనివాళ్ల, కూలీల జీతభత్యాలు పెంచలేదు సరికదా గ్రామంలోని ఇతర కూ లీల కూలీకాని, పాలేరుల జీతాలుకానీ పెరగకుండా తన చాకచక్యంతో, మంచితనంతో లౌక్యంగా అడ్డుకున్నాడు.
ఈ కథలో కథకుడు ప్రవేశపెట్టిన ‘ఎర్రసుబ్బులు’ శ్రామికవర్గంలో తలెత్తిన నూతన చైతన్యానికి సంకేతం. ఈ పాత్రద్వారా రచయిత భూస్వామ్యవర్గం తమ మంచితనం మాటున శ్రామికులను దోచుకుంటున్న దోపిడీల తీరుతెన్నులను స్పష్టం చేశాడు. శ్రామికవర్గం యొక్క శ్రేయస్సుకు, అభివృద్ధికి ఏ మాత్రమూ ఉపయోగపడని భూస్వాములు ‘కృత్రిమ మంచితనాలు’ వెనుకనున్న అభివృద్ధి నిరోధక తత్త్వాన్ని చక్కగా విశ్లేషించిన కథ ‘చీకటినాడీ వెలుగు నెత్తురూ’ కథ. అడవులలో గొర్రెలు, మేకలు మేపుకొని జీవనం సాగించే అమాయక గ్రామీణ గొల్లలను, కురవలను వారి అజ్ఞానాన్ని, అమాయకతను, అనైక్యతను ఆధారం చేసుకొని చిరకాలంగా దోచుకుంటున్న ఫారెస్టు అధికారులను సంఘటితంగా ఎదిరించిన కథ నందిని సిధారెడ్డి రచించిన ‘పుల్లర’. అడవులలో తమ ‘జీవాలను’ మేపుకుంటున్నందుకు కాపరులు అటవీశాఖకు చెల్లించాల్సిన రుసుము ‘పుల్లర’. ఇలాంటి భూ కామంధుల అన్యాయలకు బలవుతున్న బడుగు జీవుల వ్యదార్థ కథలు చక్కగా రచించబడినాయి.

Comments

comments