గ్రామసేవకు అంకితమైన యువ కిశోరాలు

 Young people devoted to the village in Rangareddy

మన తెలంగాణ/వికారాబాద్ జిల్లా ప్రతినిధి: ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను, ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు సద్వినియోగం చేస్తే సరిపోతుందని సంకల్పించారు. కేవలం రెండేళ్లలో గ్రామ రూపురేఖలు మార్చేశారు. ప్రభుత్వమే గ్రామానికి వచ్చేలా చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్ వ్యక్తిగత మరుగుదొడ్ల పథకాన్ని విజయవంతం చేశారు. నూటికి నూరు శాతం మరుగుదొడ్లు నిర్మాణం చేయించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే గ్రామాన్ని అగ్రస్థానంలో నిలబెట్టారు. అప్పటి కలెక్టర్ రఘునందనరావు ప్రోద్భలం, మండల స్థాయి అభివృద్ధి అధికారు లు, పోలీసు యంత్రాంగం ప్రశంసలతో ముంచెత్తారు. గత యేడాది కలెక్టర్‌గా పనిచేసిన దివ్యదేవరాజన్ చేతుల మీదుగా యువకులకు అవార్డు లభించింది. హరితహారం, స్వచ్ఛత, ఇంకుడు గుంతల్లోనూ నెంబర్‌వన్‌గా నిలబెట్టారు. పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వరరెడ్డి ‘గ్రామజ్యోతి’లో గ్రామాన్ని సందర్శించి వారిని అభినందించారు. చీపుర్లు చేతపట్టి గ్రామం శుభ్రం చేస్తూ యువత భుజం తట్టారు. వికారాబాద్ జిల్లా ధారూరు మండలం కొండాపూర్ కలాన్ గ్రామంపై ఫోకస్. జిల్లా కేంద్రానికి 16 కిలోమీటర్ల దూరాన గల కొండాపూర్ కలాన్‌లో జనాభా 651. గ్రామంలో 234 కుటుంబాలు నివసిస్తున్నాయి. అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న సొంత ఊరు రూపురేఖలు మార్చేందుకు గ్రామానికి చెందిన యువ శాస్త్రవేత్త వడ్ల నందు ఉద్యమంలా ముందుకు సాగాడు.

గ్రామ యువకులను చేరదీసి వారిలో చైతన్యం తీసుకువచ్చాడు. గ్రామాభివృద్ధికి తన వెంట ఉంటేచాలునని వారికి భరోసా నిలిచారు. తన రాజకీయ గురువైన ధారూరు పిఎసిఎస్ చైర్మన్ హన్మంత్‌రెడ్డి సహకారంతో మంత్రి మహేందర్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్ సునీతారెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, కలెక్టర్ రఘునందనరావును కలిసి గ్రామానికి కావాల్సిన వసతుల గురించి విన్నవించాడు. గ్రామజ్యోతి లో కొండాపూర్ కలాన్‌ను హన్మంత్‌రెడ్డి దత్తత తీసుకోగా, పక్కనే ఉన్న నర్సాపూర్‌ను వడ్ల నందు దత్తత తీసుకున్నారు. ముందుగా కొండాపూర్ కలాన్‌లో గ్రామంలో నూటికి నూరు శాతం స్వచ్ఛ భారత్ మరుగుదొడ్ల నిర్మాణం చేపడతామని వారికి విన్నవించాడు. అతనిలో ఉన్న ఆసక్తి చూసి గ్రామానికి కావాల్సిన వసతులపై ప్రతిపాదనలు రూపొందించారు. యువకులతో కలిసి ప్రతి అభివృద్ధి పని కోసం ఆయా శాఖల చుట్టూ తిరిగి నాలుగేళ్లలో గ్రామ స్వరూపమే మారిపోయింది. నర్సాపూర్ కూడా అభివృద్ధి సా ధించింది. వ్యక్తిగత మరుగుదొడ్లపై ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు. బహిరంగ ప్రదేశాలలో బహిర్భూమికి వెళ్లడం వల్ల కలిగే నష్టం, ప్రమాదాలు, పరిసరాల శుభ్రతపై వివరించారు. దాంతో ప్రతిఒక్క కుటుంబం మరుగుదొడ్ల నిర్మాణానికి ముందుకు వచ్చింది. వారికి సకాలంలో బిల్లుల అందేలా చొరవ తీసుకున్నారు. ఇది గుర్తించిన అప్పటి ఉమ్మడి జిల్లా కలెక్టర్ రఘునందనరావు యువతను అభినందించారు. యువకుడు నందును చేరదీసి మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సానుకూలత వ్యక్తం చేశారు.

మరుగుదొడ్ల నిర్మాణంలో జిల్లాలోనే టాప్‌గా కొండాపూర్ కలాన్‌ను నిలబెట్టారు. ఆ గ్రామంలో మొత్తం 210 మరుగుదొడ్లు (100%) నిర్మించారు. జిల్లాల విభజన తర్వాత తొలి కలెక్టర్‌గా వచ్చిన దివ్యాదేవరాజన్ చేతుల మీదుగా కొండాపూర్ కలాన్‌కు అవార్డు అందజేశారు. ఉన్నతాధికారుల సమక్షంలో వడ్ల నందు, యువకులకే అంకితంచేసి అందజేయడం విశేషం. గ్రామంలో సిమెంటు కాంక్రీటు రోడ్లు నిర్మాణానికి నిధులు తీసుకురావడమే కాకుండా వాటిని పూర్తి చేయించారు. వికారాబాద్ నుంచి గ్రామానికి వెళ్లే రహదారిలో వంతెన పనులకు నిధులు సాధించి, వేగవంతంగా నిర్వహించారు. గ్రామాభివృద్ధిపై నందు ఓ డాక్యుమెంటరీ రూపొందించి ప్రజలకు వివరించడం ఆసక్తికరంగా మారిం ది. తమ ఊరు స్వరూపమే మారిపోవడాన్ని ప్రొజెక్టర్ ద్వారా ప్రజలకు చూపించాడు. అంతటితో ఆగని వడ్ల నందు మండలంపై దృష్టి సారించా డు. జిల్లాలో ఎక్కడాలేని విధంగా పంటలపై కోతుల దాడి అధికంగా ఉం టుంది. పంటలను సర్వనాశనం చేయడం వల్ల రైతులు తీవ్ర ఆందోళన చెం దుతున్నారు. ఈ విషయాన్ని అటవీశాఖ మంత్రి జోగు రామన్న దృష్టికి తీసుకువెళ్లారు. కోతులు పట్టేందుకు మంత్రి ఆదేశించినా అప్పట్లో జిల్లాలో పనిచేసిన అధికారులు పెద్దగా స్పందించలేదు.

గిరిజనుల భూముల స్వాధీనం పైనా పలుమార్లు మంత్రిని ఆశ్రయించారు. ప్రస్తుతం అటవీశాఖ అధికారులు కాస్త వెనక్కు తగ్గారు. ఇటీవల హన్మంత్‌రెడ్డి, నందు కలిసి నాగా రం గ్రామంలో మన్నెకుచ్చల ప్రాజెక్టుకు రూ.16 కోట్లు మంజూరు చేయించారు. నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు సహకారంతో నిధులు వచ్చాయని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకంపై వారు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రైతుబంధు పథకంపైన గ్రామగ్రామాన రైతులకు అవగాహన కల్పించారు. ఇలాంటి యువకులు ఉంటే గాంధీ కలలు కన్న విధంగా గ్రామాల రూపురేఖలే మార్చవచ్చని చెప్పొచ్చు.
కొండాపూర్ కలాన్‌పై సంక్షిప్తంగా
కొండాపూర్ కలాన్‌లో జనాభా 651 ఉండగా పురుషులు 310, మహిళలు 341 నివసిస్తున్నారు. వారిలో చిన్నారులు 76 మంది ఉన్నారు. అందులో బాలురు 139, బాలికలు 156 మంది నివసిస్తున్నారు. గ్రామంలో అక్షరాస్యత 54.5 శాతం, వారిలో పురుషుల అక్షరాస్యత 63.41 శాతం, మహిళల అక్షరాస్యత 46.49 శాతం ఉన్నట్లు తేలింది. గ్రామంలో వ్యవసాయ కూలీలు 377 ఉండగా పురుషులు 195, మహిళలు 185 ఉన్నారు. ఊరిలో కేవలం ముగ్గురు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు.
ఎవరీ నందు…
కొండాపూర్ కలాన్‌లోని దళిత కుటుంబానికి చెందిన వడ్ల నందు కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎంఎస్‌సి ఆర్గానిక్ కెమిస్ట్రీ విద్యనభ్యసించారు. 2007 నుంచి 2009 వరకు వరంగల్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగంలో పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. పలుమార్లు వరంగల్ జైలుకు వెళ్లారు. ప్రస్తుత ఎంపీ వినోద్ సహకారంతో విడుదలయ్యారు. ఔషధ తయారీ కంపెనీలో సైంటిస్ట్‌గా పనిచేస్తున్నా మరోవైపు ఉద్యమానికి ఎక్కువగా సమయం కేటాయించాడు.
2013లో పిఎసిఎస్ చైర్మన్ హన్మంత్‌రెడ్డి, నందు కలిసి గ్రామపంచాయతీ ఎన్నికలలపై దృష్టి సారించారు. సొంత గ్రామంతో పాటు పలు పంచాయతీలకు తమ అనుకూలమైన అభ్యర్థులను నిలబెట్టి గెలిపించారు. మరోవైపు హైదరాబాద్ శివార్లలో ఒక ఔషధ కంపెనీ నెలకొల్పి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాడు. ప్రస్తుతం జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నాడు. ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావులను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగుతూ… శ్రీమంతుడు సినిమా పట్ల ప్రభావితుడైన నందు గ్రామాలాభివృద్ధి కోసం రూ.30 లక్షల వరకు సొంత డబ్బు ఖర్చు చేశాడని తెలిసింది. జిల్లా ప్రజాప్రతినిధులు, నాయకులతో సత్సంబంధాలు నెలకొల్పారు. రాష్ట్ర విద్యా మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాగేందర్ గౌడు, వైద్యా ఆరోగ్య సంస్థ అభివృద్ధి చైర్మన్ పర్యాద కృష్ణమూర్తి ఆశీస్సులు మేరకు ముందుకు సాగడం హర్షదాయకం.

Comments

comments