గోలకొండ పత్రికలో స్త్రీల కవిత్వం

edt

గత శతాబ్ది ప్రారంభం వరకు తెలంగాణలో స్త్రీలకు చదువుకునే అవకాశమే తక్కువ. అదికూడా హైదరాబాద్ నగరంలో తప్ప మరెక్కడా వారి కోసం ప్రత్యేక పాఠశాలలు లేని కారణంగా స్త్రీల అక్షరాస్యత శాతం 5 శాతాన్ని మించలేదు. మిషనరీల చొరవతోపాటు అఘోరనాథ్ ఛటోపాధ్యాయ, కాసు రంగమ్మ, మాడపాటి హనుమంతరావులాంటి వారు ఏర్పాటు చేసిన పాఠశాలల వల్ల హైదరాబాద్‌లోని కొద్దిమంది బాలికలకైనా చదువుకునే అవకాశం ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో స్త్రీలు రాసిన సృజన సాహిత్యం కూడా తక్కువగానే వెలువడింది. నాడు తెలంగాణలో విజయవంతంగా వెలువడిన గోలకొండ పత్రికలో కవిత్వం రాసిన స్త్రీలు కేవలం 17 మంది మాత్రమే కనిపించారు. వీరిలో 9 మంది ఆంధ్ర బాలికా విద్యాలయం విద్యార్థినులే కావడం విశేషం. శ్రీకృష్ణదేవరాయల జయంతి సందర్భంగా శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బాలికల పాఠశాల ప్రీమెట్రిక్ విద్యార్థినులైన వి.లక్ష్మీదేవి, పి.సావిత్రి, ఎస్.భారతిరత్నాంబ, పీజే ఫ్లోరెన్స్, వడ్లకొండ ఇందిర, వై.అమృతమ్మ చదివి వినిపించిన కవితలు శ్రీకృష్ణ దేవరాయలు(1935, ఫిబ్రవరి 14) శీర్షికతో గోలకొండ పత్రికలో అచ్చయ్యాయి.
“సీ. విష్ణుచిత్తీయంబు వేడ్కతో రచియించి/ వినుతికెక్కినయట్టి ఘనుడనీవు/దిగ్విజయ మొనర్చి దివ్య వైభవమున/ సామ్రాజ్య విస్తృతి జరిగితీవు/ ముద్దులొల్కుచునుండు మిద్దెలగట్టించి/ నిదుభాగ్యోద్ధడి నెరపినావు
పొలుపార కవులను పోషించినీయాంధ్ర/ భారతీభక్తిగన్పరచినావు /గీ. ఆంధ్ర భాషయందు అధిక సంప్రీతితో/ఆంధ్ర భోజుడవను ఖ్యాతిగాంచి/ దేశభాషలందు తెలుగు లెస్సయటంచు/ పేరు నిల్పినావు ధారుణీశ ”
అని కృష్ణ దేవరాయల రచనలను, ఆయన సాహిత్య పోషణను గురించి బాలిక పాఠశాల ప్రీమెట్రిక్ విద్యార్థిని వి.లక్ష్మీదేవి ఐదు పద్యాలు రాశారు.
అంతకు ముందు నెలలో మణిత్రయి(1935, జనవరి 3) శీర్షిక కింద వి.లక్ష్మీదేవి, కోమలవల్లి, కె.లక్ష్మీభాయమ్మ, వై. కౌసల్యదేవి, వై. అమృతమ్మ,ఎస్. భారతీరత్నాంబ శ్రీకృష్ణుడిని స్తుతిస్తూ రాసిన పద్యాలు గోలకొండ పత్రికలో అచ్చయ్యాయి. ఆ తర్వాత ద్రోణంరాజు లక్ష్మీభాయమ్మ రాసిన ‘శ్రీరామయోగి’(20 ఆగస్టు, 1936) కవిత కనిపించగా, 1955 వరకు లభించిన సంచికల్లో స్త్రీలు రాసిన కవిత్వం కనిపించలేదు. 1956 నుంచి 1966 వరకు దశాబ్ద కాలంలో ఎనిమిది మంది స్త్రీలు రాసిన తొమ్మిది కవితలు లభించాయి. వారిలో ముదిగంటి సుజాతారెడ్డి, నాగరాజలక్ష్మి, రామశేషమ్మ, సుచరిత, సూరినాగమ్మ, విజయలక్ష్మీవర్ధన్, వంగల వాణీభాయితోపాటు రష్యన్ రచయిత్రి మదాం మిర్డుజాకెంపే రాసిన ఒక కవిత(అనువాదం) ఉంది. ఈ కవయిత్రుల సంఖ్య నాటి కవుల సంఖ్యతో పోల్చి చూస్తే ఒక్కశాతం కూడా లేకపోవడం సాహిత్యరంగంలో స్త్రీల వెనుకబాటుతనానికి అద్దంపడుతుంది. 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం ఏర్పాటును స్వాగతిస్తూ ఎం. సుజాతారెడ్డి ‘ఆంధ్ర జనని ఆగమనము’(11 నవంబర్, 1956) అనే శీర్షికన కవిత రాశారు. ఇందులో తెలుగుతల్లి హైదరాబాద్‌కు వస్తున్న తీరును వర్ణించారు.
‘కృష్ణా, గౌతములందు తీరికగా తీర్ధమాడి / పచ్చని ప్రకృతి అద్దకపు పయ్యెదతో/రక్తవర్ణపు పూల రవిక తొడుగుతో / పసపు పారాణి పదిలముగా / దిద్ది సింధూర తిలకము ఫాలమందు తీర్చి / గులాబీల గుబాళింపులతో / ఆంధ్ర కుమారుల గాఢ సుషుప్తి నుండి / మేల్కొలువ దివ్వె దీటుగా ధరియించి /అల్లదిగో ! ఆంధ్ర సౌదామనీయామిని / అరుదెంచినది ‘భాగ్యనగరము’నకు’ అంటూ ముగుస్తుంది. సుజాతరెడ్డి రాసిన మరో కవిత ‘ధర్మ చక్రము’(28 జనవరి, 1957). త్రివర్ణ పతాకంలోని అశోకుడి ధర్మ చక్రము వస్తువుగా చేసుకొని ఈ కవిత రాశారు. ‘ బుద్ధుడి అహింసాబోధనల సూచికగానేమో / అశోకుని బౌద్ధానికి శాశ్వత చిహ్నముగానేమో/ నని గర్వము చేతనేమో ఎగిరి పడుచున్నది / త్రివర్ణ పత్రాక నాభి బుద్ధ ధర్మ చక్రము’ అని అశోకుడి ధర్మచక్రం విశిష్టతను ఆమె వర్ణించారు.
1961లో వేదాంతం నాగరాజ్యలక్ష్మి రాసిన ‘ఆవేదనా లహరి అంతమందని సీమ..’ ప్రణయ కవిత్వం. ఇందులో తనను చూసి ఓ వ్యక్తి నవ్వాడని పొరబడిన మహిళ అతడిని ప్రేమించి, అతడి కోసం ఎదురుచూసినా అతడి వైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో పడిన ఆవేదన కనిపిస్తోంది.
మల్లెపందిరి కాడ మసక చీకటిలోన/నిలుచుండి నా రాజు నను జూచి నవ్వెనని /మనసులో తట్టె వెంతటి అమాయకురాలను/పిలిచినా పలుక లేదు చిత్తరవు చందాన /
ఏ గాడ్పు వీచినా, ఏ గొడవ వచ్చినా / మరలి వస్తున్నాడని మలుపుకేసే చూస్తి / ప్రేమలెరుగన వట్టి రాతి గుండెను ప్రేమించి/కరుణ రసము లేని కటిక గుండె కొరకేడ్చి
ఎడతెరపి లేక తిరుగాడి బడలినాను !!
నా జీవిత సుమము వాడిపోయెడి వేళ / కారు మబ్బులే కాని కటిక చీకటులేకాని / క్రమ్ముకొని, క్రమ్ముకొని మ్రింగివేయగ నిమ్ము / తాను వట్టి రాతి మనిషిని ప్రేమించానని, అతడి కోసం ఎదురు చూసి అలసి పోయానని యువతి ఆవేదనను నాగరాజ్యలక్ష్మి వ్యక్తీకరించారు. తన ప్రేమను అంగీకరించలేదనే నిరాశతో చివరికి తనను ఏదైనా కారు మబ్బో, కటిక చీకటో మింగేసిన బాగుండని తలచింది. ‘సంవాదము’(1 జనవరి, 1961) కవితలో వి.రామశేషమ్మ ఓ బాలుడికి, తండ్రికి మధ్య జరిగిన సంభాషణను రాశారు. ఇం దులో బాలుడు తన తల్లి గురించి చెప్పమని తండ్రిని అడగడం, అతడు సమాధానం చెప్పడం ఇందులో విషయం.
“ఏదీ ! మా అమ్మేది ! / అంబరములో అందగాడు
ఆవులిస్తూ అట్టె రాగా / పండుగపై పది దినమున
పరుగుతోనే వస్తుందని / పలువిధములగా పలికితివి
ఏదీ ! మా అమ్మేది !
చక్కనైన కథలు ఎన్నో / చాలా బాగా చెప్పగా
మన చెవిటి ఆయాకు చేతకాదు / అమ్మ వచ్చిన అన్ని చేయును” అంటూ సాగే ఈ సంభాషణలో బాలుడి తల్లి చిన్నతనంలోనే కాలం చేసిందని, ఫలితంగా ఆయా పెంపకంలో పెరుగుతున్నాడని అర్ధమవుతోంది. తాను పొందలేకపోతున్న తల్లి ప్రేమను గురించి చెబుతూ తనకు అమ్మే ఉంటే అన్ని చేసి పెట్టేదని, ఆయాకు తనను చూసుకోవడం రావట్లేదని బాలుడు బాధపడుతాడు. అందుకు తండ్రి సమాధానమిస్తూ ‘జీవితమనే మధుబాండమే పగిలి తునాతునకలైన తనకు అన్ని నీవేనని, నిన్ను వీడి నేను నిమిషం కూడా ఉండలేనని’ వాపోతాడు. ఇందుకు బాలుడు మళ్లీ ‘కలలో వచ్చే తెల్ల ఏనుగును కట్టి తీసుకురా, ఆకాశంలో జాబిల్లిని పట్టుకురా.. లేదంటే నా తల్లిని చూపించు’ అని అడగడంతో కవిత ముగుస్తుంది.
‘ఆశాపాశ వినాశకం’(29 జూలై,1962) అనే కవితను సుచరిత రాశారు.
“విశాల వినీలాకాశంలోకి / చుక్కల్లోకి రెక్కలు విప్పుకు ఎగిరాను కానీ../ఆకాశంలో కూడా చీకట్లుంటాయని / దూరపు కొండల నున్నదనం / మరీచికలో మంచినీళ్లు / ఇది నిత్యనూత్న జీవితమని /ఆ క్షణంలోమర్చిపోయి మరు / క్షణంలో మనసు మార్చుకున్నాను” అంటుందామె ఈ కవితలో.
విశాల వినీలాకాశంలో ఎగిరిపోయిన కవయిత్రికి అంతా చందమామ వెలుగులుంటాయని భ్రమిస్తుంది. ఆ తర్వాత అక్కడ కూడా చీకట్లుంటాయని, దూరపు కొండలు నునుపుగా కనిపించడం, మరీచికలో మంచినీళ్లు ఉంటాయని భ్రమించడం తప్పని ఆ క్షణంలో మర్చిపోయానంటారు. ఇవన్నీ నిజం కాదని తెలుసుకొని వాస్తవంలోకి వచ్చాక.. జీవితం అందుకు భిన్నంగా ఉందని చెబుతుందామె.
“మిగిలింది మరీచిక / మమత లేదు, మధువు లేదు
మన పీకలకు ఉరితాడు తప్ప / మన బ్రతుకులకు ఎదురుదెబ్బలు తప్ప” అంటూ పేదరికాన్ని గురించి, జీవితంలో ఎదురయ్యే ఇబ్బందుల గురించి ఆమె వివరించారు. సూరి నాగమ్మ రాసిన ‘శోణగిరి వాస రమణా !’ కవితలో రమణమహర్షి సంబోధన ఉంది.
పత్రమో, పుష్పమో లేక ఫలమొ జలమొ
తనకుగలదానిలో సాధుజనుల కొసగి
భక్తితో సేవలొనరింపవచ్చు సుఖము
సాదు సేవకు భువినేది సాటి రమణ
జవహర్‌లాల్ నెహ్రూ దివంగతులైన సందర్భంలో ఇద్దరు కవయిత్రులు రాసిన కవితలు గోలకొండ పత్రికలో అచ్చయ్యాయి. అందులో ఒకటి రష్యన్ రచయిత్రి మదాం మిర్డు జాకెంపె రాసిన కవితకు తెలుగు అనువాదం ‘భస్మగీతిక’(22 జూన్, 1964) కాగా, ‘సంతాపాంజలి’(3 జూన్,1964) శీర్షికతో సీహెచ్ విజయలక్ష్మి వర్ధన్ రాసిన మరో కవిత ఉన్నాయి.
అలాగే పురాణ స్త్రీ పాత్రలపై గోలకొండ పత్రికలో పలు వ్యాసాలు రాసిన వంగల వాణీబాయి ‘దేశభక్తి గీతము’(13 డిసెంబర్ 1965) శీర్షికతో ఓ కవిత రాశారు. పై కవితలను పరిశీలించినప్పుడు దైవారాధాన, ప్రణయం, కౌటుంబీక సంబంధాలు, రాష్ర్టఅవతరణ, దేశభక్తి, నెహ్రూ మరణం, ప్రణయం వస్తువులుగా కనిపించాయి. స్రీ సమస్యలకు అద్దం పట్టే కవితలేవి కనిపించలేదు.
తమ సమస్యను వస్తువుగా తీసుకొని స్త్రీలు కవితలు రాసే చైతన్యం ఆ కాలానికి వారికి రాలేదనే విషయం స్పష్టమవుతోంది.