గోలకొండలో స్మృతికవిత్వం

GLKND

తెలంగాణ సమాజపు గొంతుకగా నిలిచి, నాలుగు దశాబ్దాలపాటు నిర్విఘ్నంగా నడిచిన గోలకొండ పత్రికలో నాలుగు కాలాలపాటు నిలిచిపోయే కవిత్వం వెలువడింది. పద్య కవితా ఖండికలు, వచన కవితలు, దీర్ఘకవితలు, శతక సాహిత్యం, విదేశీ కవులు రాసిన కవితలకు తెలుగు అనువాదాలు ఇందులో ప్రచురితాలయ్యాయి. ప్రముఖులు చనిపోయినప్పుడు వారిని స్మరిస్తూ కవులు రాసిన స్మృతి కవితలు(ఎలిజీలు) ఇందులో లభించాయి. వట్టికోట ఆళ్వార్‌స్వామి, త్రిపురనేని గోపీచంద్, విశ్వనాథ సత్యనారాయణ, బాలగంగాధర్ తిలక్ తదితర కవులు, రచయితలు దివంగతులైనప్పుడు పలువురు కవులు స్మృతికవిత్వం రాశారు. మీజాన్ పత్రిక సంపాదకుడు, రచయిత అడవి బాపిరాజుపై సింగరాజు లింగమూర్తి అనే కవి రాసిన కవిత గోలకొండ పత్రికలో అచ్చయ్యింది.
కులపతీ యశస్వీ /కళా తపస్వీ
అందులో ఓ రాజ/అంజలులు మావి
స్వార్థమెరుగని / సౌమ్యమూర్తి
మర్మమెరుగని / మధురమూర్తి
కథల కడలి నీవు / కవిత కోకిల నీవు
ప్రకృతి ఒడిలోని / ప్రేమ గాయకుడవు.. జోహార్ జోహార్ / జోహార్ కులపతీ /కులపతీ యశస్వీ/అందుకో ఓ రాజ/అంజలులు మావి అంటూ కీర్తించాడు. ప్రజల మనిషి, గంగు నవలల రచయిత, తెలంగాణ సాంస్కృతిక యోధుడు, గ్రంథాలయ ఉద్యమకారుడు వట్టికోట ఆళ్వార్‌స్వామి దివంగతులైన సందర్భంలో కె. యాదవరెడ్డి (నిఖిలేశ్వర్) రాసిన కవిత ‘ప్రజల మనిషి’ శీర్షికతో గోలకొండ పత్రికలో అచ్చయ్యింది.
“నిష్కామ మనీషి / ప్రజా సేవ తపస్వి/
నిర్విరామం నెత్తురుపిండి/అగ్ని అక్షర తూణీరంతో/ నిజాం కబంధ హస్తాలకి /చిచ్చుపెట్టిన జాగృతి/
తురకల ముష్కరత్వం / ప్రజా ఉద్యమ వాహినిని/ జైల్లో నిర్మానుష్యంగా అణిచితే “జైలు లోపల” రచించి/
తెలంగాణ తెలుగు రక్తాన్ని ఏడారిలో ఒయాసిస్‌గా మార్చి/రాజ్యకాంక్ష ముష్కరులను /సామాన్యుల బంధువై / నీటముంచిన ‘ప్రజల మనిషి” అంటూ తెలంగాణ ప్రజల స్వేచ్ఛ, స్వాతంత్య్రం కోసం సాంస్కృతిక సారథిగా ముందు నడిచి జైలు కెళ్లిన వట్టికోట ఆళ్వార్‌స్వామి త్యాగాన్ని కొనియాడాడు.
“మరుగున పడిన మాణిక్యాలను తవ్వే / వెలుగుతున్న వజ్రాలను మర్చే /
ఈ జాతి చస్తేనే గానీ కొలవదు ! /ఇది నిజం స్వామి గారు ! వ్యక్తి ఒక మహాసంస్థ /సంచార విజ్ఞాన గ్రంథం
పదవి, బిరుదులతో కాదు /జిజ్ఞాసలతో జ్వలిస్తేనే
మనగలిగే సృజన కర్త /అని సజీవంగా చూపించిన
నీకు మా అశ్రుతర్పణ” అంటూ ఏ పదవులకు, బిరుదులకు అందని వట్టికోట ఆళ్వార్‌స్వామి వ్యక్తిత్వాన్ని, తెలంగాణకు ఆయన చేసిన సాంస్కృతిక సేవను యాదవరెడ్డి తన తన కవితలో కొనియాడారు. ఆళ్వార్‌స్వామి మొదటి వర్ధంతి రోజున 1962లో ‘ఒక మిత్రుడు’ పేరున సమర్పించిన భాష్ఫాంజలి ‘ఏడూడి’ శీర్షికన అచ్చయ్యింది. ఇది రాసిన కవి అసలు పేరు ఇందులో పేర్కొనలేదు.
“నీవు కనుమరుగై పోయి / నిండుకొన్నదొక యేడు /
నీవు కీర్తిశేషుడవై / బావురుమన్నదొక యేడు
ఒంటి స్తంభం విరిగిందని / ఇంటి మొగురం కూలిందని
కంటికి మంటికి ఏకధారగా నీ / ఇంటిది వలపోస్తున్నా
సగం వ్రాసి నీవు విడిచిన / సాంఘిక నవల తెలంగాణది
సగానికి పోయిన, శాసనం వలె / సాహిత్య చరిత్ర కొక తీరని లోటు / భార్య పుత్రులకన్నా నీ / ప్రాణం కన్న మానం కన్నా / గ్రంథాలయం ముఖ్యమని / కడుగొప్పగా చెప్పేవాడివే ? /
పచ్చని బంగారు విగ్రహం / ప్రక్కనొక్క తోలు సంచీ
కలకలలాడే ఆ ముఖం / కనపించలే దెంత వెదకినా
నీ పేరును శాశ్వతంగా / నిలుపాలని తలచాలని
నిక్కి చెప్పిన మేమంతా / నీరుగారిపోయినాము
దేశోద్ధారక గ్రంథమాల / దేశోద్ధారక గ్రంథాలయం
యశోదమ్మతోపాటు / అనాథలైన ఏడూడిది”
అని ఆళ్వార్‌స్వామి వ్యక్తిత్వం, ఆహార్యాన్ని వర్ణించడంతోపాటు సాహిత్య ప్రచారానికి ఆయన చేసిన కృషిని కొనియాడారు. ఆయన చనిపోయాక కుటుంబం అనుభవిస్తున్న వేదనను, ఆయనను మరిచిపోయిన సమాజం గురించి కవి తన మాటలుగా పాఠకుల హృదయాలకు తాకేలా చెప్పారు. ఆ తర్వాత కూడా ఆళ్వార్‌స్వామి స్పూర్తిని కొనసాగించడం, జ్ఞాపకాలను పదిలపరచడం లాంటి పనులు కొందరు కవులు, రచయితలు తప్ప ప్రభుత్వాలు చేపట్టకపోవడం విచారకరం.
ప్రముఖ కథకుడు త్రిపురనేని గోపిచంద్ అస్తమయం సందర్భంలో కొడాలి గోపాలరావు అనే కవి ఆవేదనతో రాసిన కవిత ‘నివాళి’. “ కమ్మనిగాధ వింటిమి పకాలున నవ్వుచు పొంగిపోయి, లే
రిమ్మహి గోపించందునకు సాటిగ రాగల వారటంచు, చో
ద్యమ్ముగ చెప్పుకొంటిమి కథానికలందున నీచమత్కృతుల్
మమ్ముల ముగ్ధులన్ బరచి మాకిట చెప్పక దూరమైతివా ”
నవ్వుతూ పొంగిపోతూ నీవు రాసిన కమ్మని కథలు విన్నామని, కథకుల్లో గోపీచంద్‌కు సాటిగల వారే లేరని తామనుకున్నామని కవి కొడాలి గోపాలరావు ప్రముఖ కథకుడు గోపీచంద్‌ను ప్రశంసించారు. ఈ ఖండికలో మరో నాలుగు నివాళి పద్యాలున్నాయి. 1965 నవంబర్ 2 నాటికి గోపీచంద్ మరణించి మూడేళ్లయిన సందర్భంగా ‘గోపీచంద్’ శీర్షికతో ఈ కవిత గోలకొండ పత్రికలో అచ్చయ్యింది. అయితే ఈ కవిత రాసిన కవి పేరు మాత్రం అందులో పేర్కొనలేదు.
“సాహిత్యాంబర వీధుల్లో / స్వైర వివాహారం చేసి
వెళ్లిపోయాడు గోపీచంద్ / మళ్లీరాడు గోపీచంద్
ఆ సింహ గంభీర విగ్రహం / విశాలవదనం ప్రశాంత నయనాలు
ఉంగరాల తల బంగారు ఛాయ / గంభీర గాత్రం, ఆ గాత్రంలోని మాధుర్యం
మళ్లీ రాడు మన గోపీచంద్
ఆ చంద్రుడే గోపిగా కిందికి వచ్చి / నవలలలో వెన్నెలలు చిందించారు / చిన్నకథలలో వెన్న చిలికించాడు / నాటకాలలో తేనెలొలికించాడు / చిత్రసీమలో కొత్త పంథాలు చిత్రించాడు / యోగిలా విరాగిలా తత్వం బోధించాడు
ఇంత చేసినా.. ఎంత వ్రాసినా /ఇంకా తాను ‘సమర్ధుణ్ణని’
“జీవ యాత్ర ” చాలించాడు / జీవితాన్నే త్యజించాడు”
వెళ్లిపోయాడు మన గోపీచంద్ / మళ్లీ రాడు మన గోపీచంద్ /త్రిపురనేని వంశంలో పుట్టి ప్రశస్తి పొందినవారిని గురించి జి. కవిశేఖర రాసిన కవిత ‘ప్రశస్తి’ ఇందులో త్రిపురనేని రామస్వామి చౌదరి, త్రిపురనేని గోపీచంద్, త్రిపురనేని సుబ్బారావుల ప్రశంస ఇందులో ఉంది.
‘ఒక శ్రుతి వినబడును దూరదూరముల’ శీర్షికతో ప్రముఖ కవి బాలగంగాధర్ తిలక్ స్నేహితుల బృందం రాసిన కవిత గోలకొండ పత్రికలో అచ్చయ్యింది. ఆయన భౌతికంగా దూరమయ్యాడనే బాధాతప్త హృదయంతో వారు ఈ కవిత రాశారు.
“ఈ బాధకు అంతం లేదు / ఈ వార్తకు కనికరం లేదు/
దినపత్రికలకు కన్నీళ్లు లేవు / జీవసృ్మతులు మృతజీవుల గూర్చి మాట్లాడరు
తిలక్ మరణవార్త / రేడియో ప్రసారము చెయ్యదు
మనం చేసిన పాపం ఏమిటి ?
సిరంజిలో చావు బ్రతుకు / డాక్టర్ల చేతులలో అదే ప్రాణము
నిర్లక్ష్యానికి లొంగిపోయాడు డాక్టర్ / లక్ష్యానికి ముందే ఆగిపోయాడు తిలక్….” అంటూ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచిన తిలక్ మరణవార్తను ప్రచురించని పత్రికలు, ఆ విషాదాన్ని ప్రజలకు తెలియజేయలేని రేడియో ప్రసారాల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపారు. ఈ కవితను తిలక్‌కే అంకితమిచ్చారు.
ఇలా కవులు, రచయితల సాహిత్య,సాంస్కృతిక కృషిని కొనియాడుతూ సమకాలీన కవులు రాసిన స్మృతికవిత్వం వారిపై తమకున్న ఆదరాభిమానాలను తెలియజేస్తోంది. నాటి తరం కవులు, రచయితలు పాటించిన విలువలు నేటి తరం వారికి స్పూర్తిదాయకంగా నిలుస్తాయి.