గిరిజనులు మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలి…

Sanitation activities in the village
ఆదిలాబాద్‌: జిల్లాలోని గిరిజనులు మూఢనమ్మకం, అమాయకత్వాన్ని విడనాడి చైతన్య వంతులు కావాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్ అన్నారు. తాంసి మండలం అట్నంగూడలో అతిసార ప్రబలి ఇద్దరు మరణించడం, మరికొందరు అస్వస్థతకు గురైన విషయాన్ని తెలుసుకొని గురువారం గ్రామాన్ని సందర్శించి గ్రామంలోని పరిస్థితులను స్వయంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కలుషితమైన బావి నీటని పరిశీలించడంతో పాటు మంచినీటి బావి పరిసరాలను చూసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మూడు రోజుల నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గ్రామం పక్కనే ఉన్న బావిలోని కలుషిత నీటిని తాగడంతోనే ఈ పరిస్థితి నెలకొందని గుర్తించారు. అనంతరం వైద్య శిబిరాన్ని తనిఖీ చేసి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అనంతరం గిరిజనులతో సమావేశమై పరిస్థితి తీవ్రతకు దారి తీసిన పరిస్థితులను వివరించారు. అతిసారంతో మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారిని ఓదార్చి అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దివ్యదేవరాజన్ మాట్లాడుతూ తమ సమస్యను వెంటనే అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లక పోవడంతోనే గిరిజనులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు. వాంతులు, విరేచనాలు మీదకు తెచ్చిందన్నారు. నీటిని కాచి చల్లార్చిన తరువాత తాగాలని, ప్రతి ఒక్కరు మరుగుదొడ్డిని నిర్మించుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. జ్వరం, వాంతులు, విరేచనాలు అయితే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాని అబులెన్స్ అందుబాటులో లేకపోతే ప్రైవేట్ వాహనంలో ఆసుపత్రికి తీసుకొని వస్తే కిరాయి సైతం చెల్లించే ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్రామంలో 3 నెలలో మంచినీటి ట్యాంకును నిర్మిస్తామని, నెల రోజుల్లో భగీరథ పైప్‌లైన్ ద్వారా సురక్షిత నీటిని అందిస్తామని వెల్లడించారు. ఎలాంటి సమస్య ఎదురైనా తన దృష్టికి తీసుకొని రావాలని సూచించారు. ఇదిలా ఉంటే అట్నంగూడలో అతిసార ప్రబలి ఇద్దరు మరణించడంతో అధికార యంత్రాంగం అంతా గ్రామానికి తరలి వెళ్లింది. వైద్య బృందం గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి అతిసారం, జ్వరాల బారిన పడిన వారికి ప్రత్యేక వైద్య సేవలందిస్తున్నారు. ఇక మినరల్ వాటర్‌ను ఇంటింటికి సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టారు. గ్రామ పరిసరాల్లోని చెత్తను ట్రాక్టర్ల ద్వారా తొలగించారు. పారిశుద్య కార్యక్రమాలను చేపట్టి గ్రామస్థులు వినియోగించిన బావి నీటి నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించే ఏర్పాట్లు చేశారు. అతిసారం, జ్వరాలు ప్రబలడానికి గల కారణాలను వివరించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.