గత ఆగస్టు 15 హామీలు ఏమయ్యాయి?

pm-modiప్రధాని నరేంద్ర మోడీ 2015 ఆగస్టు 15న తన రెండవ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఎనిమిది కీలక హామీలు దేశ ప్రజలకు ఇచ్చారు. వాటిలో ఆర్థికంగా ప్రజలందరినీ కలుపుకుపోయే బ్యాంకు అకౌంట్ల పథకం, ఎల్‌పిజి సబ్సిడీ వ్యయాన్ని తగ్గించడం, ప్రతి స్కూల్‌లో మరుగుదొడ్ల నిర్మాణం, గ్రామాల విద్యుదీకరణ వంటి హామీలు ఉన్నాయి. వాటి అమలు ఎంతవరకూ వచ్చింది అన్నది బేరీజు వేస్తే కొంత మేరకు అమలైనా, ఇంకా చేయాల్సింది చాలా ఉందని అర్థమవుతోంది. 

బ్యాంక్ అకౌంట్ల పథకం
హామీ : ‘ప్రధానమంత్రి జనధన్ యోజన’ పథ కాన్ని మోడీ ప్రకటించారు. స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడిచినా, బ్యాంకుల జాతీయకరణ జరిగినా దేశంలో 40 శాతం పేదలకు బ్యాంకు అకౌంట్లు లేవని ఆయన చెప్పారు. గత ఏడాది ఆ పరిస్థితి వుండగా ప్రస్తుతం నిర్ణీత కాలవ్యవధిలో లక్షాన్ని సాధించామని కూడా మోడీ చెప్పారు. 17 కోట్ల మంది ఈ పథకంకింద అకౌంట్లు తెరిచారని చెప్పారు.
అమలు తీరు : 22 కోట్ల 81 లక్షల బ్యాంకు అకౌంట్లను కొత్తగా 2016 ఆగస్టు 3 నాటికి తెరిచారు. వాటిలో 24 శాతం అకౌంట్లలో డబ్బు ఏమీ లేదు. అవి ‘జీరో బ్యాలెన్స్ అకౌంట్లు’. 2015లో కంటే ఇది 31 శాతం ఎక్కువ.

స్కూళ్లలో మరుగుదొడ్లు
హామీ : ఏడాది కాలంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బాలురు, బాలికలకు విడివిడిగా మరుగుదొడ్లు నిర్మించే పథకం ఇది. 2.62 లక్షల స్కూళ్లలో 4.25 లక్షలమరుగుదొడ్లు నిర్మించాల్సి ఉంది.
అమలు తీరు : దేశ వ్యాప్తంగా పరిస్థితిని బేరీజు వేయగా నూటికి నూరు శాతం స్కూళ్లలో ఈ హామీని అమలు పరుస్తాం అన్నమాట నిజం కాలేదని తేలింది. ఏడు రాష్ట్రాల్లో సర్వే జరుపగా చాలా లోటు పాట్లు తేలాయి. జార్ఖండ్, కర్ణాటక రాష్ట్రాల్లో మొత్తం మూడు జిల్లాల్లో అసలు మరుగుదొడ్లు లేవు. బాలురు, బాలికలకు విడివిడిగా మరుగుదొడ్లు హామీ నిజం కాలేదు. కొత్తగా కట్టిన మరుగుదొడ్లలో కొన్ని వాడదగ్గ స్థితిలో లేవు. చాలా వాటికి మురుగు నీటి పారుదల సౌకర్యం కూడా లేదు. మరుగుదొడ్ల వాడకంపై పిల్లలకు అవగాహన కల్పించలేదు. అసలు ఈ పథకం ప్రాముఖ్యత అమలు అధికారులకు, సంస్థలకు లేనేలేదు. అమలులో తొందర కనపడింది.

వంటగ్యాస్ ఆదా
హామీ : ‘ఆర్థికంగా బాగున్న కుటుంబాల వారు వంట గ్యాస్‌పై సబ్సిడీని ఎందుకు వదులుకోరు. టీమ్ ఇండియా స్ఫూర్తితో ఆ సబ్సిడీ డబ్బును వదులుకోండి’ అని మోడీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తన పిలుపుపై 20 లక్షల మంది సబ్సిడీ మొత్తాన్ని వదు లుకున్నట్టు ఆయన చెప్పారు.
అమలు తీరు : కోటి 4 లక్షల మంది ఎల్‌పిజి సబ్సిడీని వదులు కున్నారు. కేంద్రం 5 కోట్ల మంది పేదరికం దిగువ కుటుంబాల మహిళలకు మూడేళ్ల కాలంలో (2016-17 నుంచి) వంట గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడానికి ‘ప్రధాన మంత్రి ఉజ్వల యోజన’ పథకాన్ని ప్రకటించింది. ఈ కార్యక్రమం కింద 2016 జులై 25 నాటికి 10 లక్షల 76 వేల కనెక్షన్లను మాత్రమే ఇచ్చారు.

వంటగ్యాస్ ఆదా మొత్తం ఎన్ని కోట్లు?
హామీ : ప్రభుత్వం ప్రకటించిన సబ్సిడీ మొత్తం రూ. 2000 కోట్లు. 20 వేల కోట్లు కాదని ఆడి టర్ తేల్చారు. 15 వేల కోట్ల వంట గ్యాస్ సబ్సిడీ మొత్తాన్ని తగ్గిస్తానని ప్రధాని హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకుంటానని చెప్పారు. అయితే అలా ఆదా అయ్యే మొత్తం ఇదే రూ. 21,000 అని చమురు మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ 2016 మేలో చెప్పారు. కేవలం రూ. 2000 కోట్ల సబ్సిడీనే కస్టమర్లు వదులు కొన్నారని కాగ్ ఇటీవల పార్లమెంటుకు తెలిపింది. ఎల్‌పిజి సబ్సిడీకి పహాల్ పేరిట డబ్బు బదిలీ కొన్ని సమస్యలు కూడా ఉన్నట్లు కాగ్ పేర్కొంది. దిగుమతి ఎల్‌పిజి ధరలో భేదాల వల్ల సబ్సిడీ మొత్తాల్లో తేడాపాడాలు వస్తున్నట్లు కూడా ఆడిట్ పేర్కొంది.

గ్రామాలకు విద్యుత్ వెలుగులు
హామీ : గ్రామాల విద్యుదీకరణకు ప్రభుత్వం ప్రకటించిన లక్షంలో 98.1 శాతం తీరినట్లు ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో ఇంకా విద్యుత్ వెలుగులకు నోచని మొత్తం 18,500 గ్రామాలను రానున్న వెయ్యి రోజుల్లో విద్యుదీకరిస్తామని మోడీ శపథం చేశారు.
అమలు తీరు: 2016 జూన్ 30 నాటికి మొత్తం 5 లక్షల 97 వేల 464 గ్రామాలకూ 5,87,569 గ్రామాలను విద్యుదీకరించారు. అంటే 9,895 గ్రామాలే విద్యుత్ లేకుండా మిగిలాయి. అయితే విదుదీకరణ నిర్వచనానికి ఖచ్చితంగా సరిపోయే విద్యుదీకరణ జరుగలేదు. మౌలిక విద్యుత్ పరికరాలు సమకూర్చలేదు. విద్యుదీకరణ జరిగిన కొన్ని చోట్ల ఎవరూ నివసించటం లేదు. గ్రామాల్లోని దళితవాడలను మినహాయించినట్లు కూడా వార్తలున్నాయి. కనీసం 10 శాతం కుటుంబాలకు విద్యుత్ సౌకర్యం ఉంటేనే విద్యుదీకరణ జరిగినట్లు భావించాలి. అలాగే 50 శాతం ఇళ్ళకు, స్కూల్స్ వంటి ప్రజోపయోగ ప్రదేశాలకు సంపూర్తిగా విద్యుత్ సౌకర్యం నిర్వచనం ప్రకారం కల్పించాలి. ఈ లెక్కలు ప్రస్తుతం బేరీజు వేస్తున్నారు.

సామాజిక
హామీ : ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన (పిఎంఎస్‌బివై), అతల్ పెన్షన్ యోజన (ఎపివై), ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన (పిఎంజెజెబివై) ప్రారంభించినట్లు మోడీ ప్రకటించారు. కోట్లాది మంది దేశ ప్రజలకు ఇంతవరకు లేని సామాజిక భద్రత కోసం వాటిని ప్రకటించామన్నారు.
అమలు తీరు: ఎపివై 27 లక్షల మందికి, పిఎంఎస్‌బివై 9 కోట్ల 45 లక్షల మందికి, పిఎంజెజెబివై 2 కోట్ల 97 లక్షల మందికి 2016 జూన్ 14 నాటికి వర్తింపచేశారు. జూలై 20 నాటికి 34 లక్షల మందికి ఎపివై వర్తిస్తున్నట్లు తాజా సమాచారాన్ని ప్రభుత్వం ప్రకటించింది.

వ్యవసాయానికి
హామీ : ప్రధానమంత్రి కృషి సించాయి యోజన పథకాన్ని గ్రామా లలో వ్యవసాయ సముద్ధరణకు ప్రారంభిస్తున్నా మని మోడీ ప్రకటించారు. పొలాలకు విద్యుత్ మోటార్ల ద్వారా నీరు అంది స్తారు అని హామీ ఇచ్చారు. ‘నీరు, ఇంధనం’ ఆదాకు ఆయన పిలుపునిచ్చారు.
అమలు తీరు: దేశంలో 32 శాతం వ్యవసాయ క్షేత్రాలు 5 శాతం బడారైతుల చేతిలో ఉన్నాయి. పెద్ద రైతుకు చిన్న రైతుకు మధ్య 45 రెట్ల వ్యత్యాసం వ్యవసాయ క్షేత్రంలో ఉంది. 2008-2009లో కంటే సాగుకు అనుకూలమైన భూమి తగ్గింది. 2012-13 నాటికి ఈ భూమి 18కోట్ల 25 లక్షల హెక్టార్ల నుండి 18 కోట్ల 20 లక్షల హెక్టార్లకు తగ్గింది. వ్యవసాయానికి బడ్జెట్ కేటాయింపు 44 శాతం పెరిగింది. 2015-16 లో రూ. 24,909 కోట్ల నుండి 2016 -17లో రూ. 35,984 కోట్లకు పెరిగింది. బడ్జెట్‌లో దీర్ఘకాల సాగునీటి పారుదల నిధిని కూడా సమకూర్చారు.

ఒక ర్యాంకు – ఒక పెన్షన్
హామీ : ‘సర్వీసు సిబ్బందికి ‘ ఒక ర్యాంకు ఒక పెన్షన్ ( ఒఆర్‌ఒపి) డిమాండ్ ప్రతి ప్రభుత్వం ముందు వినపడుతోంది. దాని మీదటి ప్రతి ప్రభుత్వం హామీలు ఇచ్చాయి. కానీ మేము మాత్రం దానిని ఆమోదించినట్లు చెప్పదలచాము’ అని మోడీ అన్నారు.
అమలు తీరు: మోడీ ప్రతిపాదనను 2016 ఏప్రిల్‌లో ఆమోదించారు. అందువల్ల ప్రభుత్వానికి అదనంగా రూ. 7,488 కోట్లు ఏడాదికి అవసరపడుతాయి. బకాయిల మొత్తం రూ. 10,925 కోట్లు తేలింది. 16 లక్షల మంది పెన్షనర్లకు ఒఆర్‌ఒపి తొలి పెన్షన్లు చెల్లించారు. 2016 మార్చి 31 దాకా ఈ మొత్తం రూ. 2,261 కోట్లు. సర్వీసు సిబ్బంది కొన్ని అసమానతలు ఉన్నాయని ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ బృందం వాటి పరిశీలన సాగిస్తోంది.