గంగ ప్రక్షాళనకు దీక్షలు

గంగానది ఒడ్డున హరిద్వార్‌లో ఉన్న మాత్రి సదన్ ఆశ్రమానికి చెందిన స్వామీ గ్యాన్ స్వరూప్ సనంద్ సాధారణ సాధువు కూడా కాదు. గంగానది పరిరక్షణకు అవసరమైన చట్టం చేయాలని ఆయన జూన్ 22వ తేదీ నుంచి నిరాహారదీక్ష చేస్తున్నారు. ఇంతకు ముందు ఈ ఆశ్రమానికి చెందిన ప్రధాన సాధువు స్వామి శివానంద్ కూడా గంగానది పరిరక్షణ కోసం నిరాహార దీక్ష చేశారు. ఆ తర్వాత ఆయన శిష్యులు నిగమానంద్, దయానంద్, యజ్ఞానంద్, పూర్ణానంద్‌లు కూడా సుదీర్ఘ నిరాహారదీక్షలు […]

గంగానది ఒడ్డున హరిద్వార్‌లో ఉన్న మాత్రి సదన్ ఆశ్రమానికి చెందిన స్వామీ గ్యాన్ స్వరూప్ సనంద్ సాధారణ సాధువు కూడా కాదు. గంగానది పరిరక్షణకు అవసరమైన చట్టం చేయాలని ఆయన జూన్ 22వ తేదీ నుంచి నిరాహారదీక్ష చేస్తున్నారు. ఇంతకు ముందు ఈ ఆశ్రమానికి చెందిన ప్రధాన సాధువు స్వామి శివానంద్ కూడా గంగానది పరిరక్షణ కోసం నిరాహార దీక్ష చేశారు. ఆ తర్వాత ఆయన శిష్యులు నిగమానంద్, దయానంద్, యజ్ఞానంద్, పూర్ణానంద్‌లు కూడా సుదీర్ఘ నిరాహారదీక్షలు చేశారు. హరిద్వార్‌లో గంగానది చుట్టూ అక్రమ మైనింగ్ కార్యకలాపాలను నిరోధించాలని వీరంతా పోరాడుతున్నారు. ఇందులో నిగమానంద్ చేసిన నిరాహారదీక్ష అక్షరాల ఆమరణ నిరాహారదీక్ష. 2011లో నిగమానంద్ 115 రోజుల నిరాహారదీక్ష చేసి తుదిశ్వాస విడిచారు. అప్పుడు ఉత్తరాఖండ్‌లో బిజెపి అధికారంలో ఉంది.

ఆయనపై ఆర్గనోఫాస్ఫేట్ అనే విషాన్ని ప్రయోగించి చంపేశారన్న ఆరోపణలు బలంగా వచ్చాయి. ఆయన హత్యలో ఆరెస్సెస్ కు చెందిన మైనింగ్ వ్యాపారి ప్రమేయం ఉందన్న ఆరోపణలపై విచారణ సరిగా జరగనేలేదు. ఇప్పుడు స్వామి గ్యాన్ స్వరూప్ సనంద్ నిరాహారదీక్ష చేస్తున్నారు. ఈయన అసలు పేరు ప్రొఫెసర్ గురుదాస్ అగర్వాల్. ఈయన కూడా అవసరమైతే గంగానది కోసం తన ప్రాణాలు బలిపెట్టడానికి సిద్ధమన్నట్లు మాట్లాడారు. తన శ్రేయోభిలాషులు తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందే బదులు గంగానది ఆరోగ్యం గురించి పట్టించుకోవాలని చెప్పారు. ఇప్పుడు పరిస్థితిని చక్కదిద్దడం చాలా కష్టంగా మారిందని ఆయన చెప్పారు. ప్రధానమంత్రి స్వచ్ఛ భారత్ ఉద్యమాన్ని కూడా ఆయన తీవ్రంగా విమర్శించారు. గుప్పెడు మంది చీపుర్లు చేతబట్టి శుభ్రం చేసేయడం సాధ్యపడదని ఆయన అభిప్రాయం. కాలుష్యానికి కారణం అభివృద్ధి విధానాల్లోని లోపం. పర్యావరణానికి అనుకూలమైన అభివృద్ధి విధానాలు అవసరం. అప్పుడే అభివృద్ధి స్థిరంగా ఉంటుంది. కాని నరేంద్రమోడీ ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాలుగా ఒక్కసారి కూడా స్థిరమైన అభివృద్ధి గురించి మాట్లాడలేదు.

నితిన్ గడ్కరి వద్ద ఉన్న మంత్రిత్వ శాఖల జాబితాపై కూడా స్వామి సనంద్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రోడ్డురవాణా, హైవేస్, షిప్పింగ్, జలవనరులు, నదుల అభివృద్ధి, గంగా ప్రక్షాళన అన్నీ నితిన్ గడ్కరి ఒక్కడి వద్దనే ఉన్నాయి. ఇటీవల ఉత్తరాఖండ్ ప్రభుత్వం జిమ్ కార్బర్ట్ నేషనల్ పార్క్ లో ఒక రోడ్డు వేయాలనుకుంది. ఈ రోడ్డు నిర్మాణం అడవికి, అడవిలోని వన్యప్రాణులకు ప్రమాదంగా మారుతుంది. ప్రభుత్వం మరో పెద్ద పథకాన్ని కూడా చేపట్టింది. ఆ ప్రాజెక్టు పేరు చార్ ధామ్ ప్రాజెక్టు. కేదార్ నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి నాలుగింటిని కలుపుతూ రోడ్డును వేసే ప్రాజెక్టు. ఈ రోడ్డు నిర్మాణానికి 12,000 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా. స్వామి సనంద్ ఈ ప్రాజెక్టు విధ్వంసక ప్రాజెక్టుగా పేర్కొన్నారు. ఈ రోడ్డు నిర్మాణం కోసం అనేక పెద్ద పెద్ద చెట్లను నరికేస్తారు. కొండచరియలను చదును చేస్తారు. వర్షాకాలంలో దీనివల్ల కొండలపై నుంచి బురద నదుల్లోకి వచ్చి చేరుతుందని ఆయన వాదిస్తున్నారు.

ప్రస్తుతం అభివృద్ధి కోసం చేస్తున్న ఈ ప్రయత్నాలు నిజానికి పర్యావరణానికి పెనుప్రమాదాలని, గంగా ప్రక్షాళన, పరిరక్షణ బాధ్యతలను గంగానది విషయమై శ్రద్ధ చూపించే స్థానిక ప్రజలకు అప్పజెప్పాలని లేకపోతే గంగానది పరిరక్షణ సాధ్యం కాదని అంటున్నారు. ఆగష్టు 20వ తేదీన ఉత్తరాఖండ్ హైకోర్టు ఒక తీర్పులో ట్రీట్ మెంటు చేయకుండా మురికినీరు గంగానదిలో వదలరాదని ప్రభుత్వాన్ని ఆదేశించింది. హరిద్వార్‌లో మురికినీటి శుద్ధీకరణ ప్లాంటు ఉంది. దాని సామర్థ్యం రోజుకు 4 కోట్ల 50 లక్షల లీటర్లు. కాని దీనికి రెట్టింపు శుద్ధిచేయని మురికినీరు గంగానదిలో వదలడం రోజూ జరుగుతోంది. కాలుష్యనియంత్రణ మండలి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునళ్ళు ఏం చేస్తున్నాయని స్వామి సనంద్ ప్రశ్నిస్తున్నారు.

అసలు ఈ మురికినీటి పరిమాణాన్ని ఎలా కొలుస్తున్నారని కూడా ప్రశ్నించారు. ఏదో ఒక రోజు కొలిచిన పరిమాణం గురించి చెబుతున్నారు. గరిష్ఠ స్థాయిలో ప్రవహిస్తున్న పరిమాణం ఇది కాదని అన్నారు. సాధారణంగా జనాభా సంఖ్యను బట్టి మురికినీటి పరిమాణాన్ని అంచనా వేస్తుంటారు. ఒక మనిషి వల్ల రోజుకు 50 లీటర్ల మురికినీరు ఉత్పత్తవుతుందన్నది అంచనా. వారణాసిలోని అస్సీ డ్రయిన్ రోజుకు 35 మిలియన్ లీటర్ల డ్రయినేజిని గంగానది ఎగువ ప్రాంతాన రమణలో ఉన్న మురికినీటి శుద్ధీకరణ ప్లాంటుకు పంప్ చేస్తున్నారు. నది ఎగువ ప్రాంతానికి మురికినీరు పంపింగ్ చేయడమేమిటని స్వామి ప్రశ్నించారు. యుపిఎ ప్రభుత్వంలో పర్యావరణ మంత్రిగా పనిచేసిన సైఫుద్దీన్ సోజ్ వారణాసిలోని రాజేంద్రప్రసాద్ ఘాట్ సందర్శించినప్పుడు అక్కడ ఉన్న మురికినీటి పంపింగ్ స్టేషన్ నెలరోజులుగా పనిచేయడం లేదని అధికారులు చెప్పారు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవస్థ ఉన్నప్పుడు గంగానది ప్రక్షాళనం ఎలా సాధ్యమని స్వామి సనంద్ ప్రశ్నించారు.

సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంటులను నడిపే నిజాయితి, సామర్థ్యం కూడా నేడు కనబడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో సమర్ధుడైన కన్‌సల్టెంట్ కూడా ఎవరు లేరని అన్నారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరి ఈ విషయమై స్వామి సనంద్‌కు లేఖ రాశారు. సీసామావ్ డ్రెయిన్‌లో ప్రవహించే 140 ఎంఎల్‌డి మురికినీటిలో 80 ఎంఎల్‌డి మురికినీటిని కాన్పూర్ నుంచి బింగావాన్ మురికినీటి శుద్ధీకరణ ప్లాంటుకు తరలిస్తున్నామని, నిరాహారదీక్ష విరమించాలని కోరారు. కాని స్వామి సనంద్ ఏమంటున్నారంటే కేవలం 80 ఎంఎల్‌డి సామర్థ్యం మాత్రమే ఉన్న శుద్ధీకరణ ప్లాంటు ఎందుకు కట్టారు. పట్టణం రోజురోజుకు పెరుగుతోంది. అత్యధికస్థాయిలో సామర్థ్యమున్న శుద్ధీకరణ ప్లాంటు అవసరం అంటున్నారు. కాని ప్రభుత్వం తక్షణం సాధ్యమైన స్థాయిలో ఏదో ఒకటి చేయాలను కుంటుంది. స్వామీ సనంద్ అనేక విషయాలపై తన అసంతృప్తిని ప్రకటించారు. కంవరియా యాత్రను కూడా విమర్శించారు. రామ్ కథను కూడా తప్పుపట్టారు. మతం పేరుతో సంస్కృతి పేరుతో మరింత కాలుష్యానికి కారణమవుతున్నారని చెప్పారు. కంవరియా యాత్ర చేస్తున్నవారి కోసం రోడ్డు పక్కన దుకాణాల్లో చోలే బటూరే వగైరా ఉంచారు. ఆ ప్రాంతమంతా చెత్తాచెదారంతో నిండిపోయింది. గంగోత్రి డ్యాం వద్ద మురారీ బాపు రామ కథ చెప్పారు. ఈ ప్రదేశం లో రామకథ నిర్వహించడం వల్ల పర్యావరణంపై మరింత ఒత్తిడి పెంచడమే జరిగిందని స్వామి అన్నారు.

స్వామి సనంద్ నిరాహారదీక్ష ఈనాడు ప్రారంభించింది కాదు. 2008లో జూన్ 13 నుంచి 30 వరకు దీక్ష చేశారు. 2009లో జనవరి 14 నుంచి 20 వరకు దీక్ష చేశారు. 2010లో జులై 20 నుంచి 23 వరకు దీక్ష చేశారు. భైరాన్ ఘాటీ, లోహారి నాగ్ పాలా, పాలా మనేరిలలో జలవిద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి వ్యతిరేకంగా చేసిన నిరాహారదీక్షలివి. ఈ మూడు ప్రాజెక్టులను తన దీక్షలతో ఆపగలిగారు. లోహారి నాగ్ పాలా వద్ద సొరంగం పూర్తయ్యింది. కాని ప్రభుత్వం ఈ ప్రాంతం పర్యావరణ పరంగా సున్నిత ప్రాంతంగా ప్రకటించేలా చేశారు. 2012లో జనవరి 14 నుంచి ఏప్రిల్ 15 వర కు ఆయన దీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. 2013లో జూన్ 13 నుంచి అక్టోబర్ 13 వరకు దీక్ష చేశారు. ఈ దీక్ష సందర్భంగా 15 రోజులు జైల్లో ఉన్నా రు. అప్పుడు బిజెపి అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ ఆయనకు ఒక లేఖరాసి, నరేంద్రమోడీ ప్రభుత్వం ఏర్పడితే ఆయన డిమాండ్లన్నింటినీ నెరవేరుస్తుందని చెప్పారు. ఈ లేఖను గంగాసభ అధ్యక్షుడు జితేంద్రానంద్ ఆయనకు చేర్చారు. మోడీ ప్రభుత్వం వచ్చింది కాని చేసింది శూన్యం.

                                                                                                                                        –  సందీప్ పాండే (ది వైర్ )