ఖాతాదారులకు ఎస్‌బిఐ వడ్డింపు

SBI has raised interest rates on loans

న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బిఐ) రుణాలపై వడ్డీ రేటును స్వల్పంగా పెంచింది. రుణాల వడ్డీ రేటును 0.2 శాతం పెంచింది. ఇతర రుణదాత బ్యాంకులు కూడా ఈ బాటనే అనుసరించాయి. ఈ కొత్త వడ్డీ రేటు శనివారం నుంచి అమలులోకి వచ్చింది. దీంతో ఎస్‌బిఐ ఉపాంత నిధుల వ్యయ ఆధారిత రుణ రేటు(ఎంసిఎల్‌ఆర్) 7.9 శాతానికి బదులు8.1 శాతం అయింది. ఎస్‌బిఐ వెబ్‌సైట్ ఈ విషయాన్ని పేర్కొంది. ఈ రుణ వడ్డీ రేటు పెంపుతో గృహ, వాహన రుణాలు మరింత ప్రియం కానున్నాయి. భారత రిజర్వు బ్యాంకు రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 6.5 శాతం చేసిన నెల తర్వాత ఎస్‌బిఐ ఈ రుణ వడ్డీరేటును పెంచింది. దీంతో ఏడాది కాలపరిమితి రుణాలపై వడ్డీ రేటు 8.25 శాతం నుంచి 8.45 శాతానికి పెరిగింది. మూడేళ్ల కాలపరిమితి రుణాలపై వడ్డీ రేటు 8.45 నుంచి 8.55 శాతానికి పెరిగింది. ఇదివరలో జూన్ 6న ఆర్‌బిఐ రెపే రేటును 0.25 శాతం పెంచి 6.25 శాతం చేసింది. అది ఇప్పుడు తాజాగా 6.5 శాతానికి చేరింది.