కౌలు రైతుకు కష్టమేనా…

అందని పెట్టుబడి సహాయం రుణాలు ఇవ్వని బ్యాంకర్లు.. ప్రభుత్వం గుర్తింపు కరువు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్న కౌలు రైతులు మన తెలంగాణ/ఆసిఫాబాద్ : కౌలు రైతులను పట్టించుకునే నాధుడే కరువయ్యారు. ఇటు ప్రభుత్వం నుంచి అటు బయట అప్పులు దొరక్క కౌలు రైతులు పంట సాగుకు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొలంలో పనిచేసే సామర్థం ఉన్నా సాగు చేసుకునేందుకు భూమి లేక భూ స్వాముల వద్ద భూమిని కౌలుకు తీసుకొని సాగు చేసి కుటుంబాన్ని పోషించుకోవాల్సిన పరిస్థితి […]

అందని పెట్టుబడి సహాయం
రుణాలు ఇవ్వని బ్యాంకర్లు.. ప్రభుత్వం గుర్తింపు కరువు
వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్న కౌలు రైతులు

మన తెలంగాణ/ఆసిఫాబాద్ : కౌలు రైతులను పట్టించుకునే నాధుడే కరువయ్యారు. ఇటు ప్రభుత్వం నుంచి అటు బయట అప్పులు దొరక్క కౌలు రైతులు పంట సాగుకు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొలంలో పనిచేసే సామర్థం ఉన్నా సాగు చేసుకునేందుకు భూమి లేక భూ స్వాముల వద్ద భూమిని కౌలుకు తీసుకొని సాగు చేసి కుటుంబాన్ని పోషించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పంటలు పండినా, పండకున్నా సంబంధం లేకుండా ముందస్తు ఒప్పందం ప్రకారం భూ యాజమానికి కౌలు చెల్లించాల్సి వుంటుంది. సంవత్సరంలో సాగు చేసిన పంటకు ఎలాంటి నష్టం జరిగినా ప్రభుత్వం నుంచి పరిహారం, భీమా వంటివి వస్తే కౌలు రైతుకే చెల్లించాల్సివుంటుంది. కానీ అవి ఎక్కడా అమలు కావడం లేదు. ప్రభుత్వం ఇచ్చే రాయితీ విత్తనాలు అందక పంట సాగుకు, పంట రుణాలు రాక వడ్డీ వ్యాపారుల నుంచే అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. జిల్లా లో మొత్తం 91800 మంది రైతులు ఉన్నా రు. ఇందులో కనీసం 30వేల మంది కౌలు రైతులు పంట సాగు చేస్తున్నారు. సాగు భూమిని వినియోగించుకున్నందుకు రైతు భూ యాజమానికి కౌలు చెల్లిస్తున్నందున కౌ లు తీసుకున్నట్లు ఒప్పందపత్రం ఇచ్చేవారు. ఇది భూ యాజమాని నుంచి కౌలు రైతు పొందే హక్కు పత్రం. దీని ఆధారంగానే ప్రభుత్వం కౌలు రైతుకు గుర్తింపు కార్డులు జారీ చేసే వారు వీటి ఆధారంగా వ్యవసాయ శాఖ రాయితీ విత్తనాలు పంట భీమా, ఎరువులు పంట రుణం ఇచ్చే వారు. గతంలో ప్రభుత్వం పంట రుణంతో పాటు రాయితీలు అందించేది. రుణాప్రణాళికలు ప్రత్యేకంగా నిధులు కేటాయించేది. పకృతి వైపరీత్యాలతో పంటలకు నష్టం జరిగితే కౌలు రైతుకే పరిహారం అందించే వారు. ఇప్పుడు ఈ పరిస్థితి లేదు. గుర్తింపు కార్డులు ఇచ్చే విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. అలాగే రాయితీలను కూడా ఎత్తివేసింది. బీమా చేసిన పంటకు నష్టం జరిగితే పరిహారం భూ యాజమానికి వర్తించేలా నిబంధనల్లో సవరణలు చేశారు. పంటలు సాగు చేసే కౌలు రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాకారం లేదు. గతంలో ఉన్న నిబంధనలు అన్ని తొలగించడంతో కౌలు రైతు పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట పకృతి వైపరీత్యంతో నష్టం జరిగితే కౌలు రైతుకు పరిహారం రాదు. వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు సర్వే నెంబర్ల వారిగా నష్టపోయిన పంటను అంచన వేసి ప్రభుత్వానికి నివేధికలు పంపిస్తారు. ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు నష్టపరిహారం మంజూరు చేస్తే పంట సాగు చేసిన రైతుకు కాకుండా భూ యాజమానికి నష్టపరిహారం అందుతుంది. పెట్టుబడి అందదు. ఈ ఖరీఫ్ నుంచి ప్రభుత్వం ఎకరానికి ఎనిమిది వేల రూపాయల చొప్పున పెట్టుబడి కింద రైతులకు అందిస్తుంది. ఇందులో మొదటి విడుతగా నాలుగువేల రూపాయల చొప్పున రైతులకు అందజేశారు. ఈ పెట్టుబడి సహాయం నేరుగా భూ యాజమాని పేరుమీదే చెక్కులు వచ్చాయి. పంట సాగు చేసే రైతుకు ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల భీమా చేసింది. ఇందులో కూడా కౌలు రైతుకు అవకాశం ఇవ్వలేదు. వ్యవసాయాన్ని నమ్ముకొని కష్టపడి పనిచేసి పంటలను పండించే వీరికి ఏవరి నుంచి సహాకారం అందక అప్పుల ఊబికురుకుపోతున్నారు. కౌలు రైతుకు పంట రుణం ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రావడం లేదు. పంటసాగు పెట్టుబడికి ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి అధిక వడ్డీలు చెల్లించి అప్పులు తీసుకుంటున్నారు. పండిన పంటను విక్రయించి కౌలు రైతుకు వడ్డీవ్యాపారులకు డబ్బులు చెల్లించి లాభం లేక ఇబ్బందులు పడిన రైతులు చాల మంది ఉన్నారు. ప్రతి సంవత్సరం వ్యవసాయ శాఖ అధికారుల కౌలు రైతులను గుర్తించి కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నుంచి గతంలో ఉత్తర్వులు ఉండేది. గత సంవత్సరం నుంచి ప్రభుత్వం ఉత్తర్వులను రద్దు చేయడంతో కౌలు రైతులు చాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కౌలు రైతులను గుర్తించి వీరికి పంట రుణాలు, భీమా సౌకర్యం కల్పించాలని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.