కోహ్లి సేనపై అభిమానుల ఫైర్

Virat-Kohli

ముంబయి: వరుస ఓటములతో సతమతమవుతున్న టీమిండియాపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెత్త బ్యాటింగ్‌తో గెలవాల్సిన మ్యాచ్‌లను సైతం చేజార్చుకోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, ప్రధాన కోచ్ రవిశాస్త్రి, సీనియర్ ఆటగాళ్లు రహానె, పుజారా, ధావన్, హార్ధిక్ తదితరులపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. జట్టు వరుస పరాజయాలు పాలవుతున్నా కోచ్ పట్టించుకోక పోవడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. తొలి టెస్టులో, నాలుగో టెస్టులో గెలిచే స్థితి నుంచి చేజేతులా ఓటమిని కొని తెచ్చుకోవడాన్ని వారు తప్పు పడుతున్నారు.

ఏమాత్రం పోరాట పటిమ కనబరచకుండానే చేతులెత్తేయడం బాధాకరమని వారు వాపోతున్నారు. నాలుగో టెస్టులో ఓటమి తర్వాత అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. గెలిచే అవకాశాలు అధికంగా ఉన్నా ఘోర పరాజయం పాలు కావడాన్ని వారు తప్పుపడుతున్నారు. చివరి వరకు నిలిచి జట్టును గెలిపించాల్సిన కెప్టెన్ కోహ్లి వికెట్ పారేసు కోవడాన్ని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఆఖరు వరకు ఉండి జట్టును గెలిపించి నప్పుడే కోహ్లి మంచి కెప్టెన్‌గా పేరు తెచ్చుకుంటాడని వారంటున్నారు. కీలక సమయంలో వికెట్‌ను పారేసుకుని జట్టును ఒత్తిడిలోకి నెట్టడం కోహ్లికి అలవాటుగా మారిందన్నాడు. ఇక, ఓపెనర్లు రాహుల్, ధావన్‌లపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. వీరిని జట్టు నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సీనియర్లు రహానె, పుజారాలపై కూడా అభిమానులు దుమ్మెత్తి పోస్తున్నారు. ఏమాత్రం పోరాట పటిమను కనబరచని వీరిని జట్టుకు ఎంపిక చేయడంలో అర్థం లేదని దుయ్యబట్టారు. కోహ్లి, రవిశాస్త్రిలు అనుసరిస్తున్న విధానాల వల్లే ఆటగాళ్లలో అసంతృప్తి రగులుతుందని, దాని ప్రభావం జట్టుపై స్పష్టంగా కనిపిస్తుందని వారంటున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే రానున్న రోజుల్లో టీమిండియా మరింత బలహీనంగా మారడం ఖాయమని వారు జోస్యం చెపుతున్నారు. ఇప్పటికైన భారత బోర్డు నష్ట నివారణ చర్యలు చేపట్టాలని వారు సూచిస్తున్నారు.

Comments

comments