కొత్త సంవత్సరంలో రైలు పట్టాలెక్కాలి

Railway works must be accelerated

రైల్వేలైన్ పనులను వేగవంతం చేయాలి
1.50 కోట్లతో అండర్ బ్రిడ్జ్ నిర్మాణం
జాతీయ రహదారి క్రాసింగ్‌లపై ప్రత్యేక దృష్టి
రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు

మన తెలంగాణ/సంగారెడ్డి : మనోహరబాద్- గజ్వేల్ రైల్వేలైన్ పనులను వేగవంగం చేయాలని, చేపట్టాల్సిన పనులన్నీ త్వరితగతిన పూర్తిచేయాలని రైల్వే అధికారులకు, జిల్లా అధికారులకు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖమంత్రి హరీశ్‌రావు ఆదేశాలు జారీచేశారు. ఈ రైల్వేలైన్ పనులను సోమవారం ఉదయం ఆయన దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, రైల్వే సిఇ రమేష్, డిప్యూటీ సిఇ సుబ్రమణ్యం, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ భూమిరెడ్డిలతో కలిసి పరిశీలించారు. స్వయంగా ట్రాక్‌లు తిరుగుతూ ఎక్కడికక్కడ పరిశీలన జరిపారు. క్షేత్రస్థాయిలో జరిపిన ఈ పర్యటన రైల్వే ట్రాక్ పనుల పురోగతిపై స్ఫష్టత చేకూర్చింది.

మనోహరాబాద్ ప్రాంతంలో పాటు చుట్టుపక్కల 12 గ్రామాల ప్రజలందరికీ శుభవార్త :
మనోహరాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో గేట్ వద్ద ఆయా ప్రాంతాల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవారని ఇకమీదట వారి ఇబ్బందులు తొలగిపోతున్నాయన్నారు. సిఎం కెసిఆర్ చొరవతో రూ.1.50 కోట్లతో రైల్వే అండర్ బ్రిడ్జిని ఇక్కడ నిర్మించబోతున్నట్లు తెలిపారు. మూడు నెలల్లో ఈ పనులు పూర్తవుతాయని పేర్కొన్నారు. మనోహరాబాద్-, గజ్వేల్‌ల మధ్య రైల్వే లైన్ కోసం 31కి.మీ ఉండగా, మొత్తం భూసేకరణ పూర్తిచేసి రైల్వేశాఖకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. అలాగే అటవీ భూమి అనుమతులను పొందినట్లు పేర్కొన్నారు. 17కి.మీల రైల్లేలైన్ పనులు కూడా పూర్తిచేశామని, ఇంకా 14 కి.మీ మేర పూర్తి చేయాల్సి ఉన్నదని, ఆ పనులను వేగవంతంగా పూర్తిచేయాలని రైల్వేశాఖ అధికారులను కోరినట్లు మంత్రి తెలిపారు. ఆగస్టు నెలలో పనులు ప్రారంభించి 3 నెలల్లో పనులు పూర్తిచేస్తామని చెప్పారన్నారు. వచ్చే కొత్త సంవత్సరంలో గజ్వేల్ రైలు నడపాలని ప్రయత్నం చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. సిఎం కెసిఆర్ ప్రత్యేక చొరవతో నిధులకొరత లేకుండా పనులు ముందుకెళ్తున్నాయని మంత్రి వివరిస్తూ మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, అలాగే జిల్లాలోని ఆర్డీవోలు ఎంతగానో కృషిచేశారని అభినందించారు.

యుద్ధప్రాతిపదికన పనులు : జాతీయ రహదారి క్రాసింగ్స్‌పై ప్రత్యేక దృష్టిసారించినట్లు మంత్రి తెలిపారు. ఇటీవల ఢిల్లీలో తాను మెదక్ ఎంపి కొత్తప్రభాకర్‌రెడ్డి, కరీంనగర్ ఎంపి వినోద్‌లతో పాటు రైల్వేశాఖ సౌత్ రీజన్ డిప్యూటీ ఛీఫ్ ఇంజనీర సుబ్రహ్మణ్యంలు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్‌తో తగు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ డైరెక్టర్ హమీద్‌అలీతో పాటు పనులు పర్యవేక్షణకు వచ్చారని, ఆ దిశగా జాతీయ రహదారి క్రాసింగ్ పనులు యుద్ధ్దప్రాతిపదికన నిర్మాణ పనులు చేపడుతున్నామని, అందుకు కావాల్సిన అన్ని అనుమతులను పొందినట్లు వివరించారు. దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి కోరిక మేరకు సిద్దిపేట జిల్లాలోని దౌల్తాబాద్- తూప్రాన్, రాయపోల్ మండలాలకు ఉపయోగకరంగా ఉండేలా బేగంపేటలో రైల్వేస్టేషన్ మంజూరు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. గజ్వేల్- మనోహరాబాద్ మీదుగా రైల్వేలైన్, స్టేషన్లు, బాటిల్ నెక్స్ తదితర అంశాలపై హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో ఉదయం 8.30 గంటలకు వివిధ శాఖాధికారులతో సమీక్షించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ మేరకు పలువురు ఉన్నతాధికారులతో ఫోన్‌లైన్‌లో మాట్లాడి పనుల పురోగతిపై ఆరా తీస్తూనే కావాల్సిన పూర్తి ప్రతిపాదనలతో జరిగే సమీక్షలో సమావేశానికి హాజరుకావాలని సూచనలు చేశారు. గజ్వేల్- మనోహరబాద్ మీదుగా రైల్వే శాఖ ఛీప్ ఇంజనీర్ రమేష్, డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ సుబ్రమణ్యం, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ డైరెక్టర్ హమీద్ అలీలతో సమీక్ష జరుపనున్నట్లు మంత్రి వెల్లడించారు. 5 విద్యుత్ టవర్ల ట్రాన్స్‌కో లైన్లపై చర్చించి వచ్చే రెండునెలల్లో పూర్తిచేసేలా చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి చెప్పారు. అయితే అప్పాయిపల్లి గ్రామస్థులు ఇళ్లు కోల్పోతున్నందున వారికి రెండు పడకల గదులు కేటాయించనున్నామని మంత్రి వెల్లడించారు.

Comments

comments