కేరళకు కంపెనీల సాయం…

Maruti Suzuki Rs 3.5 crore for Kerala flood Relief

న్యూఢిల్లీ : కేరళలో భారీ వర్షాలతో వరదలకు అనేక ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. దీంతో బాధితులను ఆదుకోవడానికి పెద్ద ఎత్తున విరాళాలు తరలివస్తున్నాయి. తమ వంతుగా సహాయం అందించేందుకు కార్ల సంస్థలు ముందుకొచ్చాయి. సిబ్బంది విరాళాలతో కలిపి దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ దాదాపు రూ.3.5 కోట్లు కేరళ బాధితులకు సహాయ నిధిని ప్రకటించింది. పునరావాస, సహాయ కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించేందుకు రూ.2 కోట్లు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధికి అందించినట్టు కంపెనీ తెలిపింది. సిబ్బంది నుంచి అదనంగా రూ.1.5 కోట్లు ప్రభుత్వానికి విరాళంగా అందించామని పేర్కొంది. మరో సంస్థ బజాజ్ ఆటో కూడా కేరళ వరద బాధితుల సహాయార్థం రూ.2 కోట్లు విరాళం ప్రకటించింది. దీనిలో కోటి రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వగా.. వరద బాధితులకు వస్తువులను పంపిణీ చేసేందుకు గాను మరో కోటి రూపాయలు జెబిజివిఎస్(జానకీదేవి బజాజ్ గ్రామ్ వికా స్ సంస్థ)కు అందజేసినట్టు బజాజ్ ఆటో ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే హుందయ్ మోటార్ ఇండియా లిమిటెడ్, టివిఎస్ మోటార్ కంపెనీలు కూడా రూ. కోటి చొ ప్పున ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రకటించాయి. ఇం కా టాటా మోటార్స్, నిస్సాన్ ఇండియా, బిఎండబ్లు వం టి వాహన కంపెనీలు కూడా సహాయం ప్రకటించాయి.
తమ వంతుగా ఎఫ్‌ఎంసిజి కంపెనీలూ..
కేరళ వరద బాధితులకు ఎఫ్‌ఎంసిజి కంపెనీలు కూడా తమ వంతు సహాయ సహకారం అందిస్తున్నాయి. వరదల్లో చిక్కుకున్న వారి కోసం ఆహారం, మంచినీళ్లు, కనీస వస్తువులను కేరళకు తరలిస్తున్నాయి. ఐటిసి, కోకా కోలా, పెప్సీ, హిందూస్తాన్ యూనిలివర్ వంటి 12కు పైగా ఎఫ్‌ఎంసిజి సంస్థలు బాధితులకు అండగా నిలుస్తున్నాయి. వచ్చే రెండు రోజుల్లో మరింత ఆహారాన్ని, మంచినీటిని, కనీస వస్తువులను సరఫరా చేస్తామని ఈ కంపెనీ హామీ ఇచ్చాయని కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ చెప్పారు. ఎఫ్‌ఎంసిజి కంపెనీల అధికారులతో నిన్న జరిగిన భేటీ అనంతరం ఈ విషయాన్ని ప్రకటించారు. కేరళకు సహాయం చేసేందుకు అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్‌కు మంత్రి సూచించారు.

వరద బాధితుల బీమా క్లెయిమ్‌లు వేగవంతం

ప్రకటించిన ఎల్‌ఐసి

మన తెలంగాణ/ హైదరాబాద్: ప్రకృతి విపత్తుల బారినపడిన వారికి సహాయం చేయడంలో ఎల్‌ఐసి(లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఎల్లప్పుడు ముందుంటుంది. కేరళలో వరదల కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయాల పాలయ్యారు. దీనికి సామాజిక బాధ్యతగా తమ వంతుగా ప్రజలకు బీమా సంస్థ సహాయం అందించేందుకు ముందుకొచ్చింది. వరదల్లో నష్టపోయిన వ్యక్తిగత పాలసీదారులకు త్వరితగతిన క్లెయిమ్‌లు అందివ్వడం కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎల్‌ఐసి జోన్, డివిజన్, బ్రాంచ్ అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉంటారని తెలిపింది. రాష్ట్ర, జిల్లా ప్రభుత్వాల అధికార యంత్రాంగాలతో ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ.. వరదల్లో నష్టపోయిన వారికి క్లెయిమ్ వేగంగా అందించనున్నామని ఎల్‌ఐసి స్పష్టం చేసింది. వరదల కారణంగా చనిపోయిన వారి డెత్ సర్టిఫికెట్లను తప్పనిసరిగా ఇవ్వాల్సిన అవసరం లేదని, దీనికి ప్రత్యామ్నాయంగా సంబంధిత అధికారుల దృవీకరణ పత్రాలు లేదా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఎక్స్‌గ్రేషియా అయినా ఇవ్వొచ్చని తెలిపింది. ప్రీమియం లేట్ ఫీ విషయంలోనూ ఎల్‌ఐసి సడలింపు ఇచ్చింది. ప్రమాద లబ్ధికి నిబంధనలు సులభతరం చేసినట్టు సంస్థ తెలిపింది. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన(పిఎంజెజెబివై) కిందకు వచ్చే ప్రజలకు క్లెయిమ్ సెటిల్‌మెంట్‌లను వేగవంతం చేసినట్టు పేర్కొంది. పాలసీ హోల్డర్లకు అనుకూలంగా పలు నిర్ణయాలు తీసుకున్నామని ఎల్‌ఐసి పేర్కొంది.

Comments

comments