కేజ్రీవాల్ వినూత్న పథకం

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 40 రకాల ప్రభుత్వ సేవలను అవసరార్థుల ఇంటి ముంగిట్లో అందించే వినూత్న పథకానికి శ్రీకారం చుట్టారు. ఇది ప్రభుత్వ కార్యాలయాల ముందు క్యూలైన్‌లను తొలగిస్తుందని, ఆ విధంగా ప్రజలకు సమయం, తిరుగుడు, ధన వ్యయం ఆదా అవుతుందని భావించబడుతున్నది. మధ్యదళారులపై ఆధారపడవలసిన అవసరం ఉండ దు. ఫోన్ కొడితే ప్రభుత్వం నియమించిన వ్యక్తులు ఇంటి తలుపు తట్టి మీ సమస్యకు హాజరవుతారు, సంబంధిత ప్రభుత్వ పత్రం ఇంటికి వస్తుంది. అలవాటు ప్రకారం […]

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 40 రకాల ప్రభుత్వ సేవలను అవసరార్థుల ఇంటి ముంగిట్లో అందించే వినూత్న పథకానికి శ్రీకారం చుట్టారు. ఇది ప్రభుత్వ కార్యాలయాల ముందు క్యూలైన్‌లను తొలగిస్తుందని, ఆ విధంగా ప్రజలకు సమయం, తిరుగుడు, ధన వ్యయం ఆదా అవుతుందని భావించబడుతున్నది. మధ్యదళారులపై ఆధారపడవలసిన అవసరం ఉండ దు. ఫోన్ కొడితే ప్రభుత్వం నియమించిన వ్యక్తులు ఇంటి తలుపు తట్టి మీ సమస్యకు హాజరవుతారు, సంబంధిత ప్రభుత్వ పత్రం ఇంటికి వస్తుంది. అలవాటు ప్రకారం దీన్ని కేజ్రీవాల్ తమాషాగా కొట్టిపారేయ వీలులేదు. తొలిరోజు సాయంత్రం 6 గంటల వరకు జరిగిన కార్యకలాపాలను పరిశీలిస్తే సేవల అవసరార్థులు ఈ కొత్త ప్రయోగంపట్ల ఆసక్తి చూపుతున్నట్లు విదితమవుతున్నది; ఫోన్ కాల్స్ చేసిన వారు 21,000; కనెక్ట్ అయిన కాల్స్ 2,728; జవాబులు అందుకున్న కాల్స్ 1286; అపాయింట్‌మెంట్ల ఖరారు 369; డాక్యుమెంట్ల కలెక్షన్ 7. ఈ రద్దీ దృష్టా ఆపరేటర్లను 40 నుంచి 80కి, ఫోన్‌లైన్‌ల సంఖ్యను 50 నుంచి 120కి పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చెప్పారు.
పరిపాలనా సంస్కరణల శాఖ విఎఫ్‌ఎస్ గ్లోబల్ అనే సంస్థకు ఈ ప్రాజెక్టును పొరుగు సేవల పద్ధతిలో అప్పగించింది. దీనికి 2017 నవంబర్‌లోనే మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. అయితే లెఫ్ట్‌నెంట్ గవర్నర్ (ఎల్.జి.) అనిల్ బైజాల్ కొర్రీల వల్ల ఆలస్యమైంది. ఢిల్లీ అసెంబ్లీ ఉన్నప్పటికీ కేంద్ర పాలిత ప్రాంతం అయినందున ప్రభుత్వం ఏ చిన్న పని చేయాలన్నా ముందుగా ఎల్.జి. అనుమతి తీసుకోవాలి. ఈ విషయంలో రాజకీయంగా కేంద్ర ప్ర భుత్వంతో, ఎల్‌జితో పోరాటం చేస్తున్న కేజ్రీవాల్, న్యాయ పోరాటంతో కొంత వెసులుబాటు పొందటం తెలిసిందే. విఎఫ్‌ఎస్‌తో కాంట్రాక్టును జులై 3 మంత్రివర్గం ఆమోదించింది.
డ్రైవింగ్ లైసెన్స్, వివాహ రిజిస్ట్రేషన్, రేషన్ కార్డు, జనన సర్టిఫికేట్, వాటర్ కనెక్షన్ ఇలా 40 రకాల పత్రాలకు ఢిల్లీ వాసులు ఈ సర్వీసును ఉపయోగించుకోవచ్చు. 100 రకాల సేవలకు విస్తరించాలన్నది ప్రభుత్వ భవిష్యత్ ప్రణాళిక. నిర్దేశించిన నెంబరుకు ఫోన్ చేసిన పౌరుడు తాను కోరుతున్న సేవను తెలియజేసి సంచార సేవక్‌తో అపాయింట్ ఫిక్స్ చేసుకుంటే, అతడు లేక ఆమె ఆ చిరునామాదారు ఇంటికి వెళ్లి అవసరమైన దరఖాస్తు పూర్తిచేసి, సపోర్టుగా కావలసిన డాక్యుమెంట్లు తీసుకుని, నిర్ణీత ఫీజు + 50 రూపాయలు సేవాఛార్జీ వసూలు చేస్తాడు. ఆ సేవక్ సంబంధిత ప్రభుత్వ కార్యాలయంలో డాక్యుమెంట్లు సమర్పిస్తాడు. దీనివల్ల ఆఫీసుల్లో రద్దీ ఉండదు, చేతులు తడిపాల్సిన అవసరం అసలే ఉండదు. పని పూర్తయినాక సంబంధిత సర్టిఫికేట్‌ను ఆ కార్యాలయం దరఖాస్తుదారుకు పోస్టు చేస్తుంది.
ప్రజలకు ప్రభుత్వ సేవలను మెరుగుపరచటంపై రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రీతుల్లో ప్రయత్నిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అమలులో ఉన్న ‘మీ సేవ’ కూడా అలాంటి వాటిలో ఒకటి. అయితే ఇక్కడ మీ సేవ కేంద్రానికి వెళ్లాలి అవసరాన్ని బట్టి సమయం వెచ్చించాలి. ఏదైనా డాక్యుమెంట్ కొరత ఉంటే దాన్ని సమకూర్చుకుని మళ్లీ వెళ్లాలి. దీనితో పోల్చినపుడు ఢిల్లీ పథ కం ఎంతో మెరుగైనది, మేలైనది. ప్రభుత్వ కార్యాలయాల్లో చిరు అవినీతిని ఇది అరికడుతుంది.
201213 సంవత్సరాల్లో అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారె నాయకత్వంలో పెద్ద ఎత్తున సాగిన అవినీతి వ్యతిరేక ఆందోళనకు ఢిల్లీలో నాయకత్వం వహించిన ప్రముఖుడు కేజ్రీవాల్. అవినీతి నిర్మూలనకు అప్పుడు కేంద్ర ప్రభుత్వంతో చర్చకు వచ్చిన ముఖ్యమైన అంశాల్లో లోక్‌పాల్ లోకాయుక్తల నియామకానికి చట్టం, ప్రజావేగులకు రక్షణ చట్టం, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజల ఫిర్యాదుల పరిష్కారానికి నిర్ణీత వ్యవధిని నిర్దేశించే చట్టం ఉన్నాయి. 2014 ఎన్నికల్లో యుపిఎ ప్రభుత్వాన్ని గద్దె దించటానికి ఈ ఉద్యమం బలమైన శక్తిగా ఉపకరించింది. ప్రభుత్వమైతే మారింది. కాని ఆ చట్టాలైతే అమలులోకి రాలేదు. ఆనాటి ఉద్యమం కారణంగానే కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నెలకొల్పి ఢిల్లీ రాష్ట్రంలో తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. పలువురు ముఖ్యమైన ఆప్ వ్యవస్థాపక నాయకులు కేజ్రీవాల్ వ్యవహార శైలితో విసిగిపోయి పార్టీని వీడినా అతడు గిమ్మిక్కులతో ప్రజాదరణ పొందుతున్నారు. ఈ తాజా సేవల పథకం మరో గిమ్మిక్కు కాకూడదు. చిత్తశుద్ధితో విజయవంతంగా అమలు చేస్తే ప్రజాదరణ లభిస్తుంది. ఇతర రాష్ట్రాలకిది ఆదర్శవం తమవుతుంది.

Comments

comments