కృత్రిమ మేధస్సుతో కొత్త ఉపాధి అవకాశాలు

New employment opportunities with artificial intelligence

ఉద్యోగుల సంబంధాలు మెరుగవుతాయి
నిర్ణయాలను తీసుకోవడంలో కీలకపాత్ర : సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ: పనిచేసే ప్రదేశాల్లో కృత్రిమ మేధస్సు(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) సానుకూల ప్రభావం చూపుతుందని సర్వేలో తేలింది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఎఐ) కొత్త ఉపాధి అవకాశాలను కల్పించడంతో పాటు ఉద్యోగుల మధ్య సత్సంబంధాలు, నిర్ణయాలను తీసుకోవడంలో కీలకపాత్ర పోషిస్తుందని నివేదిక పేర్కొంది. టాటా కమ్యూనికేషన్స్ దాదాపు 120 మంది అంతర్జాతీయ వ్యాపారవేత్తల నుంచి అభిప్రాయాలను సేకరించింది. ఈ సర్వే ప్రకారం, కృత్రిమ మేధస్సు మానవుడి ఆలోచనలను విస్తృతం చేస్తుందని వ్యాపారవేత్తలు చెప్పారు. యాజమాన్యానికి వైవిధ్యం ఎంతో ప్రధానమని 90 శాతం మంది వ్యాపారవేత్తలు అంగీకరించారు. అలాగే కృత్రిమ మేధస్సు ఉద్యోగులకు కొత్త పనిని కల్పించనుందని 75 శాతం మంది చెప్పగా, నిర్ణయాలను తీసుకోవడంలో కృత్రిమ మేధస్సు సహాయపడుతుందని 93 శాతం మంది వ్యాపారవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు.  ‘కొన్ని పనులను కృత్రిమ మేధస్సు చేస్తుంది. ఇది పనుల్లో కొత్త మార్గాలను కూడా సృష్టిస్తుంది. దీంతో కంపెనీల్లో కొత్త పాత్రలు, ఉపాధి అవకాశాలు లభిస్తాయి’ అని టాటా కమ్యూనికేషన్స్ సిఇఒ, ఎండి వినోద్ కుమార్ తెలిపారు. కృత్రిమ మేధస్సుతో సంస్థల ఉత్పాదక మరింత మెరుగవుతుందని, ఇది మనిషి యంత్రం మధ్య పోటీ కాదని, ఇది మనిషియంత్రం కలిసి పనిచేసే విధానమని ఆయన అన్నారు. అలాగే కృత్రిమ మేధస్సుకు.. ఉద్యోగుల నైపుణ్యాలు, వినూత్న ఆవిష్కరణలను అంచనా వేసే సామర్థం ఉంటుంది. సృజనాత్మక ఆలోచనలను సూచించడం ద్వారా సంస్థకు దోహదం చేస్తుందని నివేదిక వెల్లడించింది. చాలా క్లిష్టమైన పనుల నుంచి స్వేచ్ఛగా పనిచేసే అవకాశం కల్పించడంతో పాటు కమ్యూనికేషనల్, కొత్త ఆవిష్కరణలపై మరింతగా దృష్టి కేంద్రీకరించేందుకు కృత్రిమ మేధస్సుకు సహకరిస్తుందని నివేదిక తెలిపింది. యుసి బర్క్‌లీ ఎఐ పరిశోధకుడు ప్రొఫెసర్ కెన్ గోల్డ్‌బర్గ్ తెలిపిన ప్రకారం, కృత్రిమ మేధస్సు మనిషి ఆలోచనలను అధిగమిస్తుందని, యంత్రాలు మనుషులపై పెత్తనం చేస్తాయనే ఆందోళనలు ఉన్నాయి. అయితే యంత్రాలు పనులను బాగా చేసినప్పటికీ కొన్ని విషయాల్లో ఆశించిన విధంగా లేదని, కమ్యూనికేషన్, అర్థం చేసుకునే విధానం వంటివి ప్రతికూలమని అన్నారు.

కృత్రిమ మేధస్సుతో సంస్థల ఉత్పాదక మరింత మెరుగవుతుంది. ఇది మనిషి యంత్రం మధ్య పోటీ కాదు, ఇది మనిషియంత్రం కలిసి పనిచేసే విధానం. అలాగే కృత్రిమ మేధస్సుకు.. ఉద్యోగుల నైపుణ్యాలు, వినూత్న ఆవిష్కరణలను అంచనా వేసే సామర్థం ఉంటుంది. సృజనాత్మక ఆలోచనలను సూచించడం ద్వారా సంస్థకు దోహదం చేస్తుంది.
 – టాటా కమ్యూనికేషన్స్ సిఇఒ, ఎండి వినోద్ కుమార్