కులవృత్తిని వదలని మహిళా సర్పంచ్

మన తెలంగాణ/జుక్కల్: కులవృత్తే దైవంగా భావించే వారు  చాలా తక్కువ మంది కనిపిస్తారు. కాలక్రమేనా  పాశ్చాత్య పోకడలతో   కుల వృత్తులు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. కొందరు కులవృత్తులను లెక్కచేయడం లేదు. చాకలి, కమ్మరి, కుమ్మరి, మంగలి, డక్కలి ఇలా చాలా వృత్తులు క్రమంగా కనబడకుండా పోతున్నాయి.  కానీ జుక్కల్ మండలంలోని పెద్ద ఏడ్గి గ్రామ సర్పంచ్‌గా బిసి మహిళా రిజర్వేషన్ కింద  మాజీ ఎంపిటిసి భార్య అయిన పద్మావతి వెంకట్‌గౌడ్ ఎన్నికైంది. అప్పుడు కూడా భర్త ఎంపిటిసి […]

మన తెలంగాణ/జుక్కల్: కులవృత్తే దైవంగా భావించే వారు  చాలా తక్కువ మంది కనిపిస్తారు. కాలక్రమేనా  పాశ్చాత్య పోకడలతో   కుల వృత్తులు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. కొందరు కులవృత్తులను లెక్కచేయడం లేదు. చాకలి, కమ్మరి, కుమ్మరి, మంగలి, డక్కలి ఇలా చాలా వృత్తులు క్రమంగా కనబడకుండా పోతున్నాయి.  కానీ జుక్కల్ మండలంలోని పెద్ద ఏడ్గి గ్రామ సర్పంచ్‌గా బిసి మహిళా రిజర్వేషన్ కింద  మాజీ ఎంపిటిసి భార్య అయిన పద్మావతి వెంకట్‌గౌడ్ ఎన్నికైంది. అప్పుడు కూడా భర్త ఎంపిటిసి అని ఎప్పుడూ గర్వపడలేదు. ఇప్పుడు కూడా తాను సర్పంచ్‌ను అని గర్వపడటం లేదు. గౌడ కులస్తులైనందున కల్లు అమ్ముకునే జీవనం సాగించాలి. అదే విధంగా ఇంట్లో పనులు ముగించుకున్నాక నేరుగా కల్లు దుకాణంలోకి వెళ్ళి కల్లు అమ్ముతుంటుంది. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, సర్వసభ్యసమావేశాలు ఉన్నప్పుడు తప్పకుండా హాజరు అవుతుంది. తాను సర్పంచ్ కదా.. ఎలా కల్లు అమ్మాలి…? ఎవరైనా  చూస్తే బాగుండదేమో….? ఏమైనా అనుకుంటారేమో…? అనే వాటికి చోటివ్వకుండా ఎవరేమైనా అనుకోనివ్వండి ఈ సర్పంచ్ పదవీకాలం పూర్తయిన  తరువాతనైనా కల్లు అమ్ముకునే బతకాలి కదా…? పైగా తమకు ఇదే అన్నం పెడుతుంది. ప్రజల సేవకు వారు అవకాశం ఇచ్చారు. వారికి కూడా న్యాయమే చేస్తున్నాము. ఎన్నో పంచాయితీలు (సంసారం, భూ తగాదాలు, కొట్లాటలు) పెట్టుకుని తమను పిలిపిస్తారు. వారికి అయినంతకాడికి న్యాయంగానే మాట్లాడి ఇరువురికి నచ్చచెప్పి సంసారాలు కూలకుండా చూస్తాం అని అంటోంది ఈ మహిళా సర్పంచ్. వార్డు మెంబర్లు వచ్చి వీధి లైట్లు, మురికి కాలువలు, పరిశుభ్రత గురించి అడిగితే వారికి కావల్సిన డబ్బులు కార్యదర్శితో ఇప్పించి పనులు కూడా చేయిస్తానంటోంది. ఏ కార్యక్రమాలు లేనప్పుడు మాత్రం దిన చర్యగా కల్లు అమ్ముకుంటామంటోంది.

భర్తకు చేదోడు వాదోడుగా తన వంతు సహాయ సహకారాలు అందించి బతుకు బండిని నెట్టుకురావడంలో తప్పేముందని ఆమె చెబుతోంది. గతంలో తన భర్త వెంకట్ గౌడ్‌కు ఎంపిటిసిగా పదవి చేపట్టిన అనుభవం ఉండడంతో ఏదైనా తెలియని విషయాన్ని ఆయనతో చెప్పి చేయిస్తానంటోంది ఈ మహిళా సర్పంచ్. ప్రతి ఒక్కరూ కుల వృత్తిని కాపాడాలని ఆమె ఆకాంక్షిస్తోంది. బేషజాలకు పోయి బొక్కబోర్ల పడవద్దని కూడా ఆమె హితువు పలికారు. తమ పని తాము చేసుకుంటే తప్పేమీ లేదంటున్నారు. అయితే జిపికి సంబంధించి కొన్ని సమస్యలు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం జిపికి నిధులు అవసరమున్నంత రావడం లేదని, ఒక్క 14వ ఆర్థిక ప్రణాళిక నిధులే వస్తున్నాయని, వాటితోనే అన్ని పనులు చేయడం కష్టంగా మారిందన్నారు. ఇందులో నుంచే 30 శాతం కరెంటు బిల్లు, 30 శాతం ఫిల్టర్ వాటర్, 40 శాతం సఫాయిల జీతాలకు సరిపోతుందని అన్నారు. మిగతా డబ్బులు చిన్న చిన్న పనులకు తాము అప్పులు చేసి బోర్లు, మెకానిక్ చార్జీలు లాంటివన్నీ తామే చూసుకోవాల్సి వస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జవహర్ రోజ్‌గార్ నిధులు వచ్చేవని, ప్రస్తుతం అవి రాకపోడంతో చాలా సమస్యలు వస్తున్నాయన్నారు. కానీ ఇటీవల తమ మండలం అర్బన్ పథకం కింద ఎంపిక కావడంతో అంతో ఇంతో పనులు చేపడుతున్నామని కూడా ఆమె చెబుతోంది. ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు పెంచాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. తమకు ఏడాదికో, ఆరు నెలలకో గౌరవ వేతనం వస్తుందని, నెల నెల ఇస్తే బాగుంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. మొత్తానికి ఇటు ప్రభుత్వ కార్యక్రమాల్లో, అటు ఇంటి పనులతో సహా దుకాణం నడపడంతో ఆమె బిజీగా గడుపుతున్నారు. కులవృత్తే దైవంగా భావించి సర్పంచ్ అయి ఉండి కూడా కల్లు అమ్మడం కొత్తవారిని ఆలోచింపచేస్తోంది. కానీ తాను చేసేది వంద శాతం కరెక్టేనని నమ్ముతానంటోంది ఈ మహిళా సర్పంచ్. ఆమె ఆత్మస్థైర్యానికి జోహార్లు పలుకుదాం. కులవృత్తుల్ని చేపడదాం.

Related Stories: