కీసర రిజర్వు ఫారెస్టుకు మహర్దశ

Keesara

కెటిఆర్ గిఫ్ట్ ఏ స్మైల్ సవాల్‌కు భారీ స్పందన
2042 ఎకరాలను దత్తత తీసుకున్న ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్
రూ.2.90 కోట్లతో అర్బన్ లంగ్ పార్క్
ఈనెల 29న మంత్రి మల్లారెడ్డితో కలిసి మొక్కలు నాటనున్న ఎంపి

మన తెలంగాణ/హైదరాబాద్ : కీసర రిజర్వ్ ఫారెస్ట్‌కు మహర్దశ మొదలైంది. రిజర్వ్‌ఫారెస్ట్‌ను శరవేగంగా అభివృద్ధి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేపడుతున్నారు. ముఖ్యంగా యువనేత, టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ గిఫ్ట్ ఏ స్మైల్ ఛాలెంజ్‌ను స్పూర్తిగా తీసుకుని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ కీసర ఫారెస్టును అభివృద్ధి చేసేందుకు నడుం బిగించిన విషయం విదితమే. గత నెల24న కెటిఆర్ పుట్టిన రోజు సందర్భంగా కీసర ఫారెస్టును ఎంపి సంతోష్ దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకున్న వెంటనే అటవీ ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలని సంకల్పించారు. ఫారెస్టులోని 2042 ఎకరాలను రూ. 2.90 కోట్లతో అర్భన్ లంగ్ పార్కుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. పార్కులో చేపట్టాల్సిన పలు అంశాలపై సంతోష్‌కుమార్ ఇప్పటికే సంబంధిత అధికారులతో పలు దఫాలుగా చర్చించారు. ఫారెస్టులో పెద్ద ఎత్తున మొక్కలను నాటేందుకు ఆదివారం నుంచి గుంతలు తీసే పనులు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 29వ తేదీన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డితో కలిసి ఎంపి సంతోష్‌కుమార్ విస్తృతంగా మొక్కలను నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. థీమ్ పార్కులు, వాక్‌వే, యోగా, ఓపెన్ జిమ్, చిల్డ్రన్స్‌పార్క్ ఏర్పాటుతోపాటు ఔషధ మొక్కలు, ఆక్సిజన్‌ను అధికంగా విడుదల చేసే మొక్కలను నాటనున్నారు.

కెటిఆర్ పుట్టిన రోజున మొక్కలు నాటి ఛాలెంజ్‌కు అనేక మంది ప్రముఖులు తాము సైతం అంటూ మొక్కలను నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈక్రమంలో కెటిఆర్ కోటి ఒకటవ మొక్కను నాటి కెటిఆర్ తిరిగి మరోసారి గ్రీన్ ఛాలెంజ్ విసరడం, ఇందులో భాగంగా ఎంపి సంతోష్‌కుమార్ రెండు కోట్ల ఒకటవ మొక్క నాటి గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా కీసర ఫారెస్ట్‌లో విరివిగా మొక్కలు నాటేందుకు నాంది పలికారు. గ్రీన్ ఛాలెంజ్‌కు అటు సినీ రంగం, క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలతో రాజకీయ నాయకులకు మొక్కలు నాటాలని సంతోష్‌కుమార్ పిలుపునివ్వడంతో వారంతా ముందుకు వచ్చి మొక్కలు నాటుతూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టులు చేసిన విషయం తెలిసిందే. వారు మొక్కలు నాటడంతో పాటు మరికొందరి పేర్లు సూచిస్తూ గ్రీన్ ఛాలెంజ్‌ను విసురుతున్నారు. దీంతో హరిహారం కార్యక్రమం రాష్ట్రంలో ఒక ఉద్యమంలా కొనసాగుతోంది.

development of keesaragutta resrve Forest

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కీసర రిజర్వు ఫారెస్టుకు మహర్దశ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.