కివీస్‌ను కుమ్మేసిన భారత్

  • 45 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై కోహ్లీసేన విజయం
  • హాఫ్ సెంచరీతో విజృంభించిన కెప్టెన్ విరాట్
  • డక్‌వర్త్ లూయీస్ ప్రకారం టీమిండియా గెలుపు

india-new-zealand-live-scor

ఓవల్ (లండన్): చాంపియన్స్ ట్రోఫీ వామప్ మ్యాచ్‌లో టీమిండియా కివీస్‌పై విజయం సాధించింది. న్యూజి లాండ్ నిర్దేశించిన 190 పరుగుల విజయ లక్ష్య ఛేదనలో భారత్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఈ క్రమంలో మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 26 ఓవర్ల వద్ద నిలిపివేశారు. ఆ సమయానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. దీంతో డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం భారత్ కివీస్‌పై 45 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత్ ఓపెనర్లుగా బరిలోకి దిగిన అజింక్యా రహానె (7) పరుగులకే సౌథీ బౌలింగ్‌లో బోల్ట్‌కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ కెప్టెన్ విరాట్ కోహ్లి సహాయంగా దూకుడును పెంచేశాడు. ఒక దశలో కివీస్ బౌలర్ నీషామ్ బౌలింగ్‌లో అండర్సన్‌కు క్యాచ్ ఇచ్చి (59 బంతుల్లో 5 ఫోర్లు) 40 పరుగులకే నిష్క్రమించాడు. దీంతో ధావన్ హాఫ్ సెంచరీ చేరువలో రెండో వికెట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. అనంతరం వచ్చిన దినేశ్ కార్తీక్ బోల్ట్ బౌలింగ్‌లో శాంటనర్‌కు క్యాచ్ ఇచ్చి కనీసం ఖాతా తెరవకుండానే మూడో వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో కెప్టెన్ కోహ్లి అద్భుతమైన ప్రదర్శనతో కివీస్ బౌలర్ల బంతులను బౌండరీలు దాటించాడు. ఐపిఎల్‌లో అంతగా ఆకట్టుకోలేకపోయిన కోహ్లి ఈ మ్యాచ్‌లో ఫామ్‌లోకి వచ్చి బ్యాటింగ్‌ను ఝళిపించాడు. కోహ్లికి సహాయంగా ధోనీ (21 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) 17 పరుగులు చేయగా, కోహ్లి (55 బంతుల్లో 6 ఫోర్లు) 52 పరుగులు సాధించి హాఫ్ సెంచరీ పూర్తి చేసి నాటౌట్‌గా నిలిచారు. ఇరువురి భాగస్వామ్యంలో భారత్ జట్టు 26 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లు నష్టపోయి 126 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లు టిజె సౌథీ, బోల్ట్, నీశామ్ తలో వికెట్ తీసుకున్నారు.
విజృంభించిన భారత బౌలర్లు..
వామప్ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ జట్టుకు టీమిండియా బౌలర్లు చుక్కలు చూపించారు. ప్రత్యర్థి జట్టు న్యూజిలాండ్‌ను నిర్ణీత 50 ఓవర్లలో 38.4 ఓవర్లకు 189 పరుగులకే కుప్పకూల్చారు. దీంతో కివీస్ భారత్‌కు 190 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్‌లో 47 పరుగులు ఇచ్చిన మహ్మద్ షమి 3 వికెట్లు తీయగా, భువనేశ్వర్ 28 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అలాగే స్పిన్నర్ రవీంద్ర జడేజా 8 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. భారత బౌలర్ల ధాటికి కుదేలైన కివీస్ ఆటగాళ్లు ఒకరితరువాత ఒకరు పెవిలియన్ బాట పట్టారు. కివీస్ జట్టులో ల్యూక్ రాంకీ (63 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్) 66 పరుగులతో హాఫ్ సెంచరీ పూర్తి చేసి జడేజా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. మరో ఆటగాడు జేమ్స్ నీషమ్ (47 బంతుల్లో 6 ఫోర్లు) 46 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మిగతా ఆటగాళ్లంతా పేలవ ప్రదర్శనతో భారత పేసర్ల ధాటికి తట్టుకోలేక వెనువెంటనే ఔటై చేతులేత్తేశారు. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్, ఉమేశ్ యాదవ్ తలో వికెట్ తీసుకున్నారు.

స్కోరు వివరాలు..

న్యూజిలాండ్ ఇన్నింగ్స్: మార్టిన్ గుప్టిల్ (సి) భువనేశ్వర్ (బి) షమి; 9, ల్యూక్ రాంకీ (బి) జడేజా; 66, విలియమ్సన్ (సి) రహానె (బి) మహ్మద్ షమి; 8, బ్రూమ్ (సి) ధోనీ (బి) షమి; 0, అండర్సన్ (బి) భువనేశ్వర్; 13, శాంటనర్ (సి) జడేజా (బి) అశ్విన్; 12, గ్రాండ్‌హోమ్ స్టంప్ ధోనీ (బి) జడేజా; 4, జేమ్స్ నీషమ్ నాటౌట్; 46, మిల్నే (సి) ధోనీ (బి) ఉమేశ్; 9. ఎక్స్‌ట్రాలు: 9. మొత్తం: 38.4 ఓవర్లలో ఆలౌట్) 189 పరుగులు. వికెట్ల పతనం: 1-20, 2-63, 3-63, 4-86, 5-110, 6-116, 7-126, 8-156, 9-166, 10-189.
భారత్ బౌలర్లు: మహ్మద్ షమి 8-0-47-3, హార్ధిక్ పాండ్య 6-0-49-0, బుమ్రా 4-0-14-0, భువనేశ్వర్ 6.4-1-28-3, జడేజా 4-0-8-2, అశ్విన్ 6-0-32-1, ఉమేశ్ యాదవ్ 4-0-11-1.
భారత్ ఇన్నింగ్స్: రహానె (సి) బోల్ట్ (బి) సౌథీ; 7, ధావన్ (సి) అండర్సన్ (బి) నీషామ్; 40, విరాట్ కోహ్లి నాటౌట్; 52, దినేశ్ కార్తీక్ (సి) శాంటనర్ (బి) బోల్ట్; 0, ధోనీ నాటౌట్; 17. ఎక్స్‌ట్రాలు: 13, మొత్తం: 26 ఓవర్లలో 3 వికెట్లు) 129 పరుగులు. వికెట్ల పతనం: 1-30, 2-98, 3-104. న్యూజిలాండ్ బౌలర్లు: సౌథీ 7-0-37-1, బోల్ట్ 7-1-34-1, మిల్నె 4-0-20-0, నీషామ్ 3-0-11-1, గ్రాండ్‌హోం 5-0-22-0.

Comments

comments