కాలం ఒడిలో కనుమరుగైన ‘రాచర్ల కోట’

Nearby villages that called by the name of the monarchs

చరిత్రకు నిలువెత్తు సాక్షాలుగా నాటి ఆనవాళ్లు
రాచర్ల పేరుతో పిలువబడుతున్న సమీప గ్రామాలు
కాపాడేందుకు చర్యలు తీసుకోవాలంటున్న స్థానికులు

మనతెలంగాణ/ఎల్లారెడ్డిపేట : వందల సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్న రాచర్ల కోట కాలం ఒడిలో కనుమరుగైపోతుండగా.. నేటికి నాటి చరిత్రను కన్నులకు కట్టినట్లు చూపించే కళాఖండాలు అక్కడక్కడ పారేసిన విధంగా కనిపిస్తూ చరిత్రకు నిలువెత్తు సాక్షాలుగా అగుపిస్తాయి. అద్భుతమైన సంపదను చేజారి పోకుండా వాటికంటూ ఓ ప్రత్యేకతను కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. తమ వంతు బాధ్యతగా నాటి కళా సంపదలోని ఆంజనేయ స్వామి విగ్రహానికి గుడికట్టించి నిత్య పూజలు నిర్వహిస్తున్నారు రాచర్ల బొప్పాపూర్ గ్రామస్థులు. ఇంతటి ఘన చరిత్ర కలిగి ఉన్న రాచర్ల కోట విశేషాలు స్థానికుల వివరాల ప్రకారం..అనాధి నుండి నేటి ఆధునిక యుగం దాకా ఉజ్వల మైన చరిత్ర కలిగి ఉంది రాచర్ల కోట.. ఆది మానవులు నడయాడిన ప్రాచీన వారసత్వ సంపద నేటికి ఎల్లారెడ్డిపేట మండలంలో ఇక్కడ కనిపిస్తుంది. శాతవాహనుల ఏలుబడిలో చారిత్రాత్మక ఘటనలకు వేదికైంది. ఆనాటి సంస్కృతులు, శిల్పాకళా నైపుణ్యాన్ని ప్రతిబింభించే కట్టడాలు, స్థలాలు కనుమరుగైపోయాయి. శాతవాహనుల సామ్రాజ్యానికి ప్రతీకగా రాచర్ల కోట ఆనాటి గుర్తుగా నేటికీ పరిడవిల్లుతుంది. అప్పటి కళాకారుల కళాతృష్ణకు నిదర్శనంగా నిలిచిన అద్భుత కళాఖండాలకు నిలయంగా వెలుగొందుతోంది. కోటలోని కళాఖండాలలోని కొన్ని అపూర్వమైన వాటిని తరగిపోనీయకుండా ఉండేందుకు నాడే హైదరాబాద్‌లోని మ్యూజియంకు తరలించినట్లు ఇక్కడి ప్రాంత వాసులు చర్చించుకుంటారు. మరి కొన్ని రాతి స్థూపాలను ఈ ప్రాంతంతో పాటు మరికొన్ని ప్రాంతాలకు చెందిన పలువురు ఆలయాల నిర్మాణాలకు వాడుకున్నట్లు సమాచారం. శిల్పాకళా సంపదలోని కొన్ని అవశేషాలు నేటికీ కోట పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడా చెల్లాచెదురుగా పడేసినట్లు కనిపిస్తూ శతాబ్ధాల చరిత్రకు రాచర్ల కోట నిదర్శనంగా నిలుస్తుంది.

అరుదైన చరిత్ర కలిగినది ఈ కోట..
సుమారు 11వందల సంవత్సరాల క్రితం సింగమమహారాజు రాచర్ల పట్టణాన్ని తన కేంద్రంగా చేసుకుని పరిపాలించాడని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. తన రాజ్యంపై శత్రువులెవరూ దండయాత్ర చేయకుండా కోట నిర్మాణాన్ని నాడే అత్యంత పటిష్టంగా ఏర్పాటు చేసినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఎత్తైన కోట, కోట చుట్టూ లోతైన కందకం, అందులో ఎళ్లవేలలా నీరుండేలా చర్యలు తీసుకొని కోటను శత్రు దుర్భేద్యంగా తయారు చేశారు. కోటకు పడమర దిశలో ఉన్న సింహద్వారాన్ని (నేడు వెనుక దిడ్డిగా పిలువబడే)ఆనుకొని ఓ చెరువు (ప్రస్తుతం జక్కులచెరువు గా పిలువబడే తటాకం), దాని పక్కనే అబ్బురపరిచే రాతి శిల్పాలతో నిర్మించిన శివాలయం ఉన్నాయి. నేడు కాలగర్భంలో ఆలయం కనుమరుగై పోగా విగ్రహాలు అక్కడక్కడ పారేసినట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో అభివృద్ది కోసం ప్రస్తుత  ప్రభుత్వం తగు చర్యలు తీసుకోనేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.

సమీప గ్రామాలకు ముందు రాచర్ల కోట పేరు..
సింగమ మహారాజు రాజ్యంలోని కోట రహస్యాన్ని తెలుసుకున్న గోల్కోండ రాజు తన సైన్యంతో దండయాత్ర చేసి సింగమ మహారాజు సామ్రాజ్యాన్ని అంతం చేశాడు. ఇక్కడి ప్రజలు ప్రాణభయంతో పారిపోయి కోట పరిసర ప్రాంతాల్లో స్థిరనివాసాలను ఏర్పాటు చేసుకుని ఉండడంతో ఆయా గ్రామాల పేర్లకు ముందుగా రాచర్ల అని చేరిపోయింది. తద్వారా వెలిసినవే రాచర్ల బొప్పాపూర్, రాచర్ల గొల్లపల్లి, రాచర్ల తిమ్మాపూర్, రాచర్ల గుండారం గ్రామాలు.. అంతే కాదు ఇక్కడి కొన్ని కుటుంబాలకు సైతం ఇంటి పేరుగా రాచర్ల ఉండడం విశేషం..

గుప్త నిధుల కోసం తవ్వకాలు..
నాడు ఎంతో వైభవంగా విలసిల్లిన రాచర్ల కోటలో ఏమైనా గుప్త నిధులు ఉండవచ్చనే ఆశతో కొందరు తవ్వకాలు జరుపగా కోటలోని శతాబ్దాల కాలం నాటి శిల్పకళా నైపుణ్యాలు, మధుర స్మృతులు కాలక్రమేనా అంతరించి పోయాయి. ఇప్పటికీ ఈ ప్రాంతంలో అప్పుడో ఇప్పుడో గుప్తనిధుల కోసం తవ్వకాలు అనే వార్తలు గుప్పుమంటుంటాయి. ప్రాచీన కళాఖండాలను, కట్టడాలను కాపాడాల్సిన ప్రభుత్వం, అధికారులు అటువైపు నిఘా పెట్టక పోవడంతో ఇక్కడ అసాంఘీక కార్యకలాపాలకు నెలవుగా మారి, పర్యాటకులు వెళ్లడానికి సైతం భయపడుతున్నారు. ప్రభుత్వం, అధికారులు ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతం పర్యాటక శోభను సంతరించుకుంటుందని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు.

Comments

comments