సురేశ్‌రెడ్డి,సుద్దాల దేవయ్య, బండారు లకా్ష్మరెడ్డితో పాటు టిఆర్ఎస్లో చేరడానికి సిద్ధమవుతున్న పలువురు కాంగ్రెస్ నాయకులు
మన తెలంగాణ/ హైదరాబాద్ : గులాబీ పార్టీలోకి మళ్ళీ భారీగా చేరికలు మొదలవుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ నేతలు కారెక్కేందుకు పరుగులు తీసుతున్నారు. ఇందుకు ముహుర్తం ఈ నెల 12వ తేదీగా నిర్ణయించారు. ఆ రోజున కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో టిఆర్ఎస్ కండువను కప్పుకోనున్నారు. గులాబీ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ ఇప్పటికే 105 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసే టిఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. అయినప్పటికీ ఆయా నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ నేతలు పెద్దఎత్తున టిఆర్ఎస్ పార్టీలోకి వస్తుండడం విశేషం. ప్రస్తుతం కాంగ్రెస్‌ను వీడే వారిలో మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి, మాజీ మంత్రి సుద్దాల దేవ య్య, ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జీ బం డారు లకా్ష్మరెడ్డితో పాటు పలువురు నాయకులు ఉన్నట్లుగా తెలుస్తోంది.
రంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ మంత్రి, మరో ఇద్దరు మాజీ శాసనసభ్యులు కూడా టిఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్లుగా సమాచారం. టిఆర్ఎస్కు చెందిన ముఖ్యనేతలు, మంత్రులతో ఇప్పటికేమంతనాలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా సదరు నాయకులను ఎన్నికల రంగంలోకి దించేందుకు మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. పొత్తులు తేలాక తుది జాబితాను ప్రకటించాలని ప్రణాళిలను సిద్దం చేసుకుంటోంది. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ జాబితాలో పేర్లు ఉండే నాయకుల్లో పలువురు కారెక్కేందుకు తహతహలాడుతుండడం విశేషం. ఈ పరిణామాలు కాంగ్రెస్‌ను కలవరానికి గురి చేస్తోంది. కాగా కాంగ్రెస్‌ను వీడేందుకు సిద్దమవుతున్న నేతలను గుర్తించి వారిని సముదాయించేందుకు పార్టీ పెద్దలు రంగంలోకి దిగారు. అయినప్పటికీ కాంగ్రెస్‌లో ఉండేందుకు వారు ఆసక్తి చూపడం లేదు. దీంతో బుధవారం కాంగ్రెస్ నుంచి పెద్దఎత్తున టిఆర్ఎస్లో చేరడం తథ్యంగా కనిపిస్తోంది.