కాంగ్రెస్ నాయకుల వర్గంలో వర్గ పోరు

Fighting in the Congress leaders category

రేణుక వర్గీయుల మధ్య వాదోప వాదాలు
అలక బూనిన నేతలు
మారని నేతల తీరు
ప్రత్యర్థి పార్టీల కంటే అంతర్గత విమర్శలే ఎక్కువ

ఎవరెన్ని మాటలు చెప్పినా ఐక్యత అంటూ ఎన్ని కార్యక్రమాలు చేసినా కాంగ్రెస్ పార్టీలో మాత్రం వర్గపోరు మాత్రం చల్లారడం లేదు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది వర్గ పోరు మరింత బలపడుతుంది. ఇప్పటికే రెండు, మూడు వర్గాలుగా పార్టీ వీడిపోయింది. రాష్ట్ర జాతీయ స్థాయి నేతలు వచ్చినప్పుడు ఐక్యంగా ఉన్నామంటూ నమ్మబలికే ప్రయత్నం చేసినా ఆ తర్వాత ప్రత్యర్థి పార్టీల కంటే అంతర్గత విమర్శలే ఎక్కువగా ఉంటున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మల్లు భట్టివిక్రమార్క, రేణుకా చౌదరి వర్గాలతో పాటు పొంగులేటి సుధాకర్‌రెడ్డి వర్గం కూడా ఉంది. ఒక వర్గంలోనే వర్గ పోరు జరగడం చర్చనీయాంశమైంది. దానికి కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ వేదికైంది. చివరకు ముఖ్య నేత ఒకరు విసుగు చెంది కార్యక్రమం నుంచి బయటకు పోవాల్సి వచ్చింది. ప్రతిపక్షంలో ఉన్నా నేతల తీరు మారకపోవడం కాంగ్రెస్ కార్యకర్తలకు ఇబ్బంది కరంగా మారింది. 

మన తెలంగాణ/ఖమ్మం :  అసలే వర్గాలు మళ్లి ఒక వర్గంలోనే వర్గ పోరు ఇది మరింత ఇబ్బందికర పరిస్థితులకు దారి తీసింది. ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌లో మూడు వర్గాలు ఉన్నాయి. ఒకటి అరా సందర్భాలు మినహా ఎక్కువ భాగం ఎవరికీ వారే కార్యక్రమాలను నిర్వర్తిస్తుంటారు. ఒకరి కార్యక్రమానికి మరొకరు హాజరయ్యే పరిస్థితి కన్పించడం లేదు. మాజీ కేంద్ర మంత్రి రేణుకాచౌదరి గురువారం కొత్తగూడెంలో పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమాలను వివరించేందుకు ఖమ్మం కాంగ్రెస్ కార్యాలయంలో బుధవారం పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి రేణుకాచౌదరి వర్గానికి చెందిన ముఖ్య నేతలంతా హాజరయ్యారు. వేదికపైనా పోట్ల నాగేశ్వరరావు, మానుకొండ రాధాకిషోర్, దిరిశాల భద్రయ్య, ఎకె రామారావుతో పాటు ఇతర ముఖ్య నేతలు ముందు వరుసలో కూర్చోగా  వీరితో పాటు మరి కొందరు నేతలు వేదిక పై వెనక వరుసలో  కూర్చున్నారు. ఆ సమయంలో రేణుకా వర్గానికి చెందిన వైరా నియోజక వర్గ నేత సైదులు నాయక్ తీవ్ర అసహనాన్ని ప్రదర్శించారు. ఒక సామాజిక వర్గానికి చెందిన వారే వేదికను అలంకరిస్తే ఎలా అంటూ ప్రశ్నించాడు. గిరిజనులకు స్థానం లేకుండా పోతుందంటూ ఆందోళనకు దిగడంతో ఆయనకు కొంత మంది మద్దతు పలికారు. దీంతో సమావేశం గందరగోళంగా మారింది. ఒక ముఖ్య నేత  జరిగిన విషయానికి మనస్తాపం చెంది బయటకు వెళ్లిపోయాడు. దీంతో మొత్తం సమావేశం గందరగోళంగా మారింది. ఒకే వర్గానికి చెందిన నేతల మధ్య కూడా సయోధ్య లేకపోవడం శోచనీయం. ఇటీవల రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్ ఖమ్మం జిల్లాలో పర్యటించినప్పుడు సైతం ఇదే పరిస్థితి నెలకొంది. వైరాలో బహిరంగ సభ జరుగుతుండగా కొందరు నేతలు రేణుకాచౌదరి జిందాబాద్ అంటే మరి కొందరు భట్టివిక్రమార్క జిందాబాద్ అంటూ పోటా పోటీ నినాదాలు చేయడంతో మొత్తం సభలో గందరగోళం నెలకొంది. చివరకు తోపులాటకు దారి తీసింది. కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో బలమైన కేడర్ ఉన్నా వర్గపోరు ఆ ఆపార్టీని దెబ్బతీస్తుంది. ఎన్నికల వేళైనా ఐక్యత ప్రదర్శిస్తారనుకుంటే ఎన్నికల ముందు వర్గపోరు మరింత అధికమైంది. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఒకే ఒక శాసన సభ్యుడు ఉన్నాడు. మిగిలిన తొమ్మిది నియోజక వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్న నేతలు సైతం రెండు వర్గాలుగా వీడిపోయారు. కొందరు రేణుకాచౌదరి ద్వారా టికెట్ సాధించుకోవాలని ప్రయత్నం చేస్తుంటే మరి కొందరు భట్టివిక్రమార్క ద్వారా ప్రయత్నం చేస్తున్నారు. వీరి ప్రయత్నాలు హైద్రాబాద్‌కో, ఢిల్లికో పరిమితమైతే ఇబ్బంది ఉండదు. కానీ గల్లి వరకు తమ ప్రయత్నాలతో వర్గాలను ఏర్పాటు చేసుకుంటుంటే కార్యకర్తలు ఎవరి వైపు వెళ్లాలో ఎవరి కార్యక్రమానికి హాజరు కావాలో ఎటుపోతే ఏ చిక్కు వస్తుందోనన్న ఆందోళనకు గురవుతున్నారు. దీంతో పలు చోట్ల ముఖ్య నేతలు కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా వైరా, కొత్తగూడెం, ఇల్లందు నియోజక వర్గాల్లో ఈ పరిస్థితి నెలకొంది. వైరాలో ఆశావాహులు 10 మందికి పైగా ఉండడంతో మరింత ఇబ్బందికరంగా మారింది. మొత్తంగా ఎన్నికల ముంగిట జిల్లా కాంగ్రెస్‌లో నెలకొన్న వర్గపోరు రాష్ట్ర జాతీయ స్థాయి నేతలకే తలనొప్పిగా మారింది. ఆ క్రమంలోనే చుక్కాని లేని నావలా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు లేకుండానే పార్టీని నడిపిస్తున్నారు.