కాంగ్రెస్ ఏడుపు

TRS leaders criticisms of Congress party

ప్రగతి నివేదన ఘన విజయాన్ని చూసి ఆ పార్టీ నేతలు సహించలేకపోతున్నారు
ప్రభుత్వం గొప్పతనం గ్రామ గ్రామానా కనిపిస్తుంటే కళ్లుండి చూడలేకపోతున్నారు
వారివి దిగజారుడు రాజకీయాలు : హస్తం పార్టీపై టిఆర్‌ఎస్ నేతల ఫైర్  

మన తెలంగాణ/ హైదరాబాద్: ప్రగతి నివేదన సభపై కాంగ్రెస్ నేతలు చేసిన విమర్శలపై రాష్ట్ర మంత్రులు, టిఆర్‌ఎస్ ఎంపిలు, ఎంఎల్‌సిలు, శాసనసభ్యులు, నాయకులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం సాధించిన ప్రగతి రాష్ట్రంలో గ్రామగ్రామానా కనిపిస్తుంటే కాంగ్రెస్ నేతలు మాత్రం కళ్ళుండి కూడా చూడలేని దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నారని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, పార్లమెంటు సభ్యుడు బాల్క సుమన్, శాసనమండలి సభ్యుడు కర్నె ప్రభాకర్, శాసనసభ్యుడు జీవన్‌రెడ్డి, మాజీ శాసననభ్యుడు దానం నాగేందర్, టిఎస్‌ఐఐసి చై ర్మన్ గ్యాదరి బాలమల్లు తదితరులు ధ్వజమెత్తా రు. ప్రగతి నివేదన సభకు వచ్చిన లక్షలాది ప్రజ ల సమూహాన్ని చూసి ఆ పార్టీ నేతలు సహించలేకపోతున్నారని పేర్కొన్నారు. జనసమూహాన్ని చూసి కాంగ్రెస్ నాయకులకు మతిభ్రమించి పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారని టిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు ఘాటుగా స్పందించారు. ప్రగ తిసభకు వచ్చిన జనం ఏనాడైనా జాతీయ స్థాయి లో కాంగ్రెస్ నిర్వహించిన సభలకు వచ్చారా, ఆ సత్తా ఆ పార్టీ నేతలకు ఉందా అని నిలదీశారు.

ప్రగతి కాంగ్రెస్ నేతలకు కనబడడం లేదా?
టిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృ-ద్ధి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు కనబడడం లేదా అని ప్రశ్నించిన మంత్రి తలసాని కనీసం ఆ పార్టీ నేతలు వారి కుటుంబ సభ్యులను అడిగితే కొన్ని నిజాలైనా తెలుస్తాయని వ్యాఖ్యానించారు. దేశం లో ఇప్పటివరకు మరే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకంటే టిఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసినవి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయని, రాష్ట్ర ప్రజలకు స్వీయానుభవం అని పేర్కొన్నారు. అందువల్లనే అనేక రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రజలకు అచంచలమైన విశ్వాసం ఉండడం వల్లనే కొంగరకలాన్‌లో జరిగిన ‘ప్రగతి నివేదన’ సభకు లక్షలాది మంది తరలివచ్చారని అన్నారు. టిఆర్‌ఎస్‌ఎల్‌పి భవన్‌లో సోమవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ నేతలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కళ్ళు ఉండి కూడా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేని దౌర్భాగ్యపు స్థితిలో కాంగ్రెస్ నేతలు ఉన్నారని మండిపడ్డారు. ప్రగతి నివేదన సభలో కెసిఆర్ తమను ఎక్కువగా తిడతారని కాంగ్రెస్ ఆశపడిందని, కానీ అది ప్రగతి నివేదక సభ అనే విషయాన్ని ఆ పార్టీ నేతలు గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు.

పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన ఆరోపణలను తలసాని ప్రస్తావిస్తూ, ఆయనవి ఉత్తర ప్రగల్భాలేనని వ్యాఖ్యానించారు. ఆయనకు దేవుడు మంచి బుద్ది, జ్ఞానాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నానని అన్నారు. ఉత్తమ్ చెప్పే గాలి మాటలను ప్రజలతో పాటు ఆ పార్టీ నేతలు కూడా విశ్వసించడం లేదన్నారు. ప్రగతి సభ కోసం ఎక్కడా అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని తలసాని స్పష్టం చేశారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన బహిరంగ సభలకు ఆర్‌టిసి బస్సులను వినియోగించుకోలేదా? అని ప్రశ్నించారు. మాజీ మంత్రి పొన్నాలకు సొంత ఊరిలోనే పరపతి లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ దిక్కు దివానా లేని పార్టీ అంటూ ఆయన అభివర్ణించారు. టిఆర్‌ఎస్ హయంలోనే దేవాదుల నీళ్లు జనగామాకు వచ్చాయా? లేదా? పొన్నాల సమాధానం చెప్పాలని తలసాని డిమాండ్ చేశారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీరు, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరద్ధరణతో పాటు రైతులకు 24 గం టల పాటు ఉచిత కరెంటు అందుతున్నదా? లేదా కాంగ్రెస్ నేతలు వారి సొం త ఊర్లోకి వెళ్లి తెలుసుకోవాలని సూచించారు.

టిఆర్‌ఎస్ ప్రభుత్వం చెప్పిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి చెప్పుకుంటూ పోతే కొన్ని గంటలు పడుతుందన్నారు. ఈ పథకాలను చూసి హస్తం నేతలు సహించలేకపోతున్నారని ధ్వజమెత్తారు. అందుకే ‘కెసిఆర్ హఠావో’ అని కాంగ్రెస్ నేతలు బుద్ది, జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు తమ భాష మార్చుకోవాలని సూచించారు. వారి కంటే మేము కూడా అంతకంటే ఎక్కువగా మాట్లాడగలమన్నారు. ప్రగతి నివేదన సభ కాంగ్రెస్ నాయకుల గుండెల్లో రైళ్ళు పరుగెత్తించిందన్నారు. ఢిల్లీకి చెంచాగిరీ చేసే కాంగ్రెస్ నేతలు టిఆర్‌ఎస్ గురించి మాట్లాడే నైతిక హక్కులేదని తలసాని పేర్కొన్నారు. కనీ సం ఇప్పటికైనా ఆ పార్టీ నేతలు సొంతంగా బతకడం నేర్చుకోవాలన్నారు.

కాంగ్రెస్ నేతలవి దిగజారులు రాజకీయాలు
ప్రగతి సభపై కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలు పూర్తిగా సత్యదూరమని ఎంఎల్‌సి కర్నె ప్రభాకర్, టిఎస్‌ఐఐసి చైర్మన్ జి. బాలమల్లేష్, పార్టీ రాష్ట్ర నాయకుడు గట్టు రాంచందర్ విమర్శించారు. ప్రగతి నివేదన సభకు ఇరవై ఐదు ల క్షల మంది వస్తారా అని కాంగ్రెస్ నేతలు పెద్దఎత్తు అనుమానాలు వ్యక్తం చే శారని, కానీ సభకు లెక్కకు మించిన జనం వచ్చి కెసిఆర్‌పై సంపూర్ణ విశ్వా సం ప్రదర్శించారని వ్యాఖ్యానించారు. కెసిఆర్ పిలుపునిచ్చిన ప్రతీ సందర్భం లో జనం భారీగా తరలివచ్చారని, ఈ ఘనత ఒక్క టిఆర్‌ఎస్ పార్టీకే దక్కిందన్నారు. సభలో తెలంగాణ అమరవీరులను స్మరించలేదని కాంగ్రెస్ నాయకు లు చేసిన ఆరోపణలు పచ్చి అబద్దమన్నారు. ప్రతీ సభలో వారికి నివాళులు అర్పించిన తరువాతే మొదలయ్యాయని వారు తెలిపారు. ఒకసారి టిఆర్‌ఎస్ సభలకు సంబంధించిన క్లిప్పింగ్‌లను తెప్పించుకోని చూడాలని సూచించారు.

కాంగ్రెస్ నేతల కాకిగోల
ప్రగతి నివేదన సభపై కాంగ్రెస్ నేతలు కాకిగోల చేస్తున్నారని మాజీ మంత్రి దానం నాగేందర్ మండిపడ్డారు. టిఆర్‌ఎస్ సభ పై పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలన్నీ ఉత్త మాటలేనని ఆయన అభివర్ణించారు. కెసిఆర్ హఠావో తెలంగాణ బచావో కాదని, గాంధీభవన్‌లోనే ఉత్తమ్‌కో హఠావో… కాంగ్రెస్ బచావో అని బహిరంగంగానే ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారన్నారు. త్వరలోనే కాంగ్రెస్‌కు చెందిన పలువురు ముఖ్యనేతలు టిఆర్‌ఎస్‌లో చేరబోతున్నారని అన్నారు. ఇందుకు సంబంధించిన జాబితాను రెండు, మూడు రోజుల్లో బయటపెడుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్ నాయకులు ఎన్ని ఆరోపణలు, విమర్శలు చేసినా మళ్ళీ అధికారం టిఆర్‌ఎస్‌దేనని దానం ధీమా వ్యక్తంచేశారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎందుకు రహస్యంగా సమావేశం అయ్యారో చెప్పాలని డిమాండ్ చేశారు.

చరిత్రలో నిలిచిపోయే సభ
ప్రగతి నివేదన సభ చూసి కాంగ్రెస్ నేతలు బెంబేలెత్తున్నారని ఎంపి బాల్కసుమన్, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సభ చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. కాంగ్రెస్‌లో వచ్చిన కొత్త బిచ్చగాడు రేవంత్‌రెడ్డి, పాత బిచ్చగాడు మధుయాష్కీ, బొమ్మాళి డికె అరుణ, గడ్డం బాబా ఉత్తమ్‌కుమార్ తదితరులు ప్రగతి నివేదన సభపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. టిఆర్‌ఎస్ సభలు పెట్టుకుంటే కాంగ్రెస్ నేతలకు ఎందుకు కడపుమంట? అని వారు ప్రశ్నించారు. తమ సభలో పల్లీలు, వాటర్ పాకెట్లు అమ్ముకునే వారి సంఖ్య కంటే మొన్న రాహుల్‌గాంధీ వచ్చిన వారి సంఖ్య తక్కువ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలది అంతా పురాణమని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు ప్రగతి నివేదన సభపై తిట్లు ఆపకపోతే ఆ పార్టీకి డబుల్ డిజిట్ సీట్లు కూడా రావన్నారు. వచ్చే ఎన్నికల్లో చాలా మందికి డిపాజిట్లు కూడా దక్కవన్నారు. టిఆర్‌ఎస్‌ను విమర్శిస్తే సూర్యిడిపై ఉమ్మేసినట్లేనని వారు పేర్కొన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని కెసిఆర్ ఎక్కడ చెప్పారని బాల్క సుమన్ ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలంతా పేపర్ పులులు, టివి టైగర్లుగా మారారని ఆయన మండిపడ్డారు. అందుకే ఎన్నికలు అంటే ఆ పార్టీ నేతల్లో ఆందోళన, భయం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. అనంతరం ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలతో పాటు 29 రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ నేతలను పిలిచి దమ్ముంటే ప్రగతి నివేదన వంటి సభను పెటే ధైర్యం కాంగ్రెస్ నేతలకు ఉందా? అని ప్రశ్నించారు. ఇరవై ఐదు లక్షల మంది కాదు…ఏకంగా కోటి మందితో బహిరంగ సభను పెట్టే సత్తా కెసిఆర్‌కు ఉందన్నారు. ప్రజల పాలిట కెసిఆర్ దేవుడు అని…అందుకే మా పార్టీ సభలకు పెద్దఎత్తున జనం వస్తున్నారని పేర్కొన్నారు.

ఐటిఐఆర్ ద్వారా కాంగ్రెస్ ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు
ఐటీఐఆర్ ద్వారా 50 లక్షల ఉద్యోగాలు వస్తాయని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ చేసిన వ్యాఖ్యలపై టిఆర్‌ఎస్‌వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. మరి కాంగ్రెస్ హయాంలో ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదని ప్రశ్నించారు. తప్పుడు ఆరోపణలు, విమర్శలు చేసిన ఉత్తమ్ తక్షణమే సిఎం కెసిఆర్‌కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కంటే నాలుగున్నర సంవత్సాల టిఆర్‌ఎస్ పాలనలో తెలంగాణకు అనేక కంపెనీలు వచ్చాయన్నారు. టిఎస్-ఐపాస్ విధానం ద్వారా పదిహేను రోజుల్లోనే కంపెనీలకు అన్ని రకాల అనుమతులు ఇస్తుండడం వల్లే పారిశ్రామిక వేత్తలు పెద్దఎత్తన పెట్టుబడులు పెట్టేందుకు మన రాష్ట్రానికి వస్తున్నారని ఆయన తెలిపారు.

Comments

comments