కాంగ్రెస్‌తో టిడిపి పొత్తా?

తెలుగువారి ఆత్మగౌరవం ఏమైంది? : అసదుద్దీన్ ఒవైసి

Owaisi

హైదరాబాద్ : కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఏర్పాటైన తెలుగుదేశం పార్టీ ఆ పార్టీతో ఎలా పొత్తు పెట్టుకుంటుందని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసి అన్నారు. కాంగ్రెస్, టిడిపి పొత్తు అంశంపై అసదుద్దీన్ స్పంది స్తూ టిడిపి విధానాలపై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్‌తో పొత్తు అంటే తెలుగు వారి ఆత్మగౌరవం ఏటుపోయిందని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని ప్రజలు ఎప్పుడో తిరస్కరించారని, జిహెచ్‌ఎంసిలో ఆంధ్రప్రజలు కూడా ప్రశాంతంగా ఉన్నారని ఆయన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ టిఆర్‌ఎస్ ప్రభుత్వమే ఏర్పడుతుందని, టిఆర్‌ఎస్, ఎంఐఎంను ఓడించడం చంద్రబాబు తరం కాదని స్పష్టం చేశారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో హైదరాబాద్ నుంచి పోటీ చేసి గెలువాలని అసదుద్దీన్ చంద్రబాబుకు సవా లు చేశారు. సెక్యులరిజం గురించి మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు నిన్నటి వరకు బిజెపి వెంట ఉన్నారని, కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవులు అనుభవించారని, ఆనాడు సెక్యులరిజం ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. టిడిపి కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నప్పుడే పీరూఖాన్, జునేద్ వంటి మైనారిటీ వ్యక్తులను అల్లరి మూకలు చంపితే చంద్రబాబు ఎందుకు స్పందించలేదని నిలదీశారు. 2019 ఎన్నికల తర్వాత చంద్రబాబు మళ్ళీ బిజెపి పంచన చేరుతారని, కప్పదాట్లు ఆయనకు అలవాటేనని దెప్పిపొడిచారు. నాలుగేళ్ళ చంద్రబాబు పాలనలో  ఆంద్ర రాష్ట్రానికి ఏమి చేశారని ఒవైసీ ప్రశ్నించారు. ఆంద్రప్రదేశ్ రాజధాని నిర్మించలేక పోయారని దుయ్యబట్టారు.  టిఆర్‌ఎస్ ప్రభుత్వ హాయంలో ఎలాంటి మత కలహాలు లేవని, ఎవరికీ అభద్రతా భావం లేదని అన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం మరిన్ని పనులు చేయాల్సి ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. టిడిపి, కాంగ్రెస్ పొత్తును ప్రజలు అంగీకరించరని, ఇరు పార్టీలు ఓటమి చవిచూస్తాయని జోస్యం చెప్పారు.  నాడు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్‌టిఆర్ టిడిపిని స్థాపించారని అదే కాంగ్రెస్‌తో చంద్రబాబునాయుడు పొత్తు పెట్టుకుంటున్నాడని విమర్శించారు.