కాంగ్రెసోళ్లకు ఓటేస్తే బతుకులు ఆగమే

KCR speech against congress party

మరింత అభివృద్ధి కోసం టిఆర్‌ఎస్‌ను ఆశీర్వదించండి

హుస్నాబాద్ ప్రజల ఆశీర్వాద మహాసభలో కెసిఆర్ 

పైసా పైసా లెక్కగట్టినం, నంబర్ వన్ రాష్ట్రం చేసుకున్నం

కోటి ఎకరాల ఆకుపచ్చ తెలంగాణను సాకారం చేద్దాం 

నిరాహారదీక్ష చేసి చావు నోట్లోదాకా పోయి రాష్ట్రం సాధించా. ఇప్పుడు తెలంగాణలో పేకాట క్లబ్బుల్లేవ్, మట్కాల్లేవ్, గుట్కాల్లేవ్, గుడుంబా అడ్డాల్లేవ్, అరాచకాల్లేవ్, గూండాగిరీ లేదు. ఫ్యాక్షనిజం లేదు. కరెంట్ కోతల్లేవ్. 2014కు ముందు ఇవన్నీ మీరే చూసిండ్రు. అందుకే చెబుతున్నా.. కాంగ్రెసోళ్లకు ఓటేస్తే మనం ఆగమైపోతం. అవన్నీ మళ్లీ వస్తాయ్. గతంలో కాంగ్రెస్ లీడర్లకే పేకాట క్లబ్‌లతో పాటు ఇవన్నీ ఉండేవి. మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 

మన తెలంగాణ/ హైదరాబాద్ : “ఇప్పుడు తెలంగాణలో పేకాట క్లబ్బుల్లేవ్, మట్కాల్లేవ్, గుట్కాల్లేవ్, గుడుంబా అడ్డాల్లేవ్, అరాచకాల్లేవ్, గుండాగిరీ లేదు, ఫ్యాక్షనిజం లేదు, కరెంట్ కోతల్లేవ్… 2014కు ముందు ఇవన్నీ మీరే చూసిండ్రు అందుకే చెబుతున్నా. కాంగ్రెసోళ్లకు ఓటేస్తే ఆగమైపోతం. అవన్నీ మళ్లీ వస్తయి. గతంలో కాంగ్రెస్ లీడర్లకే పేకాట క్లబ్బులతో పాటు ఇవన్నీ ఉండేవి, మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని మీరే చూసిండ్రు. నిరాహారదీక్ష చేసి చావు నోట్లో దాకా పోయి రాష్ట్రం సాధించా. పైసాపైసా లెక్కగట్టి మీ కోసం ఖర్చు చేశా. రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ చేశా. మీరు ఆశీర్వదించండి. మరోసారి టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఎన్నుకోండి. కోటి ఎకరాల ఆకుపచ్చ తెలంగాణను సృష్టిద్దాం. సంక్షేమ తెలంగాణగా మార్చుకుందాం” అని టిఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శుక్రవారం హుస్నాబాద్‌లో నిర్వహించిన పార్టీ తొలి ప్రచారసభలో కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగా రు. ముందస్తుకు ఎందుకు పోవాల్సి వచ్చిందో వివరించారు. అసెంబ్లీ రద్దు అనంతరం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి ‘ప్రజా ఆశీర్వాద సభ’లో ముఖ్యమంత్రి పై విధంగా వ్యాఖ్యలు చేశారు. నాలుగున్నరేళ్ళ టిఆర్‌ఎస్ పాలనలో సాధించిన ప్రగతిని, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను సంక్షిప్తంగా, సవివరంగా ప్రజలముందుంచారు.

ప్రభుత్వ స్థైర్యాన్ని దెబ్బతీసే కాంగ్రెస్ కుట్ర
సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం విధ్వంసానికి గురైందని, అసెంబ్లీని రద్దు చేయడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని కెసిఆర్ వివరణ ఇచ్చారు. అర్థరహితమైన, ఆధార రహితమైన అవాకులు చెవాకులు పేలుస్తూ, ఉద్దేశపూర్వకంగానే విమర్శలు చేస్తూ ప్రభుత్వ స్థయిర్యాన్ని దెబ్బతీసేలా అలవికాని ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ కారుకూతలు కూస్తోందని, ప్రజల్లో తేల్చుకోడానికే శాసనసభను రద్దు చేయాలన్న నిర్ణయం తీసుకున్నామన్నారు. దేశంలో ఏ రాష్ట్రానికీ లేనంత అభివృద్ధి మన దగ్గర ఉందని అన్నారు. నాలుగున్నరేళ్ళ పసిగుడ్డుగా ఉన్న తెలంగాణ స్వీయ ఆర్థిక ఆదాయంతో నాలుగేళ్ళుగా 17.17% అభివృద్ధి సాధిస్తే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లోనే 21.96% వృద్ధిరేటు సాధించి దేశంలోనే అగ్రగామిగా ఉందని తెలిపారు. ఇది సాక్షాత్తు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ అధికారికంగా ప్రకటించిన విషయమన్నారు. అభివృద్ధి చెందిన రాష్ట్రాలైన గుజరాత్, మహారాష్ట్రలో సైతం సాధ్యంకానిది ఇప్పుడు తెలంగాణలో సాధ్యమవుతోందన్నారు.

సమైక్య పాలనలో జీవన విధ్వంసం
సమైక్య పాలనలో జీవన విధ్వంసం జరిగిందని, తెలంగాణ ఏర్పడిన తర్వాత నోరు, కడుపు కట్టుకుని క్రమశిక్షణతో పాలన చేయడం వల్లనే ఇంత ప్రగతి సాధ్యమైందన్నారు. ప్రభుత్వం ఇలా సమకూర్చుకున్న ఆదాయాన్ని పేదల సంక్షేమం, సాగునీటిపారుదల, మంచినీటి కోసం శాశ్వత ప్రాతిపదికన ఖర్చు పెట్టిందని స్పష్టంచేశారు. కాంగ్రెస్ నేతలు పిచ్చి కూతలు కూస్తున్నారన్నారు. చేసిన అభివృద్ధి వారి కళ్లకు కనిపించడం లేదని, కంటి వెలుగు శిబిరాల్లో పరీక్షలు చేయించుకోవాలని ఎద్దేవాచేశారు. యాభై ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఏం చేసిందని కెసిఆర్ ప్రశ్నించారు. చైనాలో 2.23 లక్షల కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్ హైవే ఉంటే మన దేశంలో కేవలం 1900 కిలోమీటర్లే ఉందన్నారు. సరుకులు రవాణా చేసే లారీల, ట్రక్కుల వేగం అంతర్జాతీయంగా 82 కి.మీ. ఉంటే మన దగ్గర 24 కి.మీ. మాత్రమే ఉందన్నారు. గూడ్సు రైళ్ళు వేగం అంతర్జాతీయంగా 86 కి.మీ. ఉంటే మన దగ్గర మాత్రం 36 కి.మీ. ఉందన్నారు.

ప్రకృతి మనదేశానికి 70 వేల టిఎంసిల నీరు ఇచ్చిందని, దీనితో మన అవసరాలకు సరిపోగా మరో యాభై ఏళ్ళ దాకా ఈ దేశానికి నీటి కొరత ఉండదన్నారు. మిగులు జలాలు ఉన్నా కోట్లాది ఎకరాలు కరువుతో మాడిపోతున్నాయన్నారు. కరువుకు, నష్టానికి మూల కారణం కాంగ్రెసేనన్నారు. 193 కి.మీ. సముద్ర తీరం ఉన్న సింగపూర్‌లో ఏటా 5.74 లక్షల కంటెయినర్‌లను డీల్ చేస్తారని, 7500 కి.మీ. సముద్రతీరం ఉన్న మన దగ్గర 45 లక్షల కంటెయినర్‌లు మాత్రమే డీల్ చేస్తామని, ఇది సిగ్గుగా ఉందన్నారు. దీనికి కారణం, కారకులు కాంగ్రెస్సేనని స్పష్టం చేశారు. దేశంలో 3.25 లక్షల మెగావాట్ల విద్యుత్ ఉంది, కానీ వాడుకోలేకపోతున్నామని, తలసరి ఆదాయం, మంచినీళ్లు.. ఇలా ఏ రంగంలో చూసినా అవే పరిస్థితులున్నాయని, ప్రజలు ఆలోచించాలన్నారు.

హుస్నాబాద్‌కు కాంగ్రెస్‌తో ఒరిగిందేమీ లేదు
హుస్నాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ చేసిందేమిటి అని ప్రశ్నించిన కెసిఆర్ కేవలం 1టిఎంసితో గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మిస్తే దానిని రీడిజైన్ చేసి 8 టిఎంసీల సామర్థానికి పెంచామన్నారు. ఎల్లమ్మచెరువు, మహసముద్రం ఎలా చేశామో మీరే చూసారు కదా అంటూ గౌరవెల్లి ప్రాజెక్టుకు రీడిజైన్ చేస్తే కుట్ర అంటూ కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందన్నారు. కాంగ్రెస్ అంతా చేస్తే 14 ఏళ్లు ఎందుకు కొట్లాడినం అని ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో బచ్చన్నపేటలో సభ పెడితే అంతా ముసలోల్లే వచ్చారని, ఎందుకంటూ అడిగితే యువకులంతా పొట్టచేతపట్టుకుని ఉపాధి కోసం పోయారని సమాధానం వచ్చిందని గుర్తుచేశారు. ఇదేనా కాంగ్రెస్ చేసిన ఘనకార్యం అని వ్యాఖ్యానించారు. తాము వెయ్యి రూపాయలు ఫించన్ ఇస్తే వారు రెండు వేలిస్తమంటున్నరు, మేం 2020 ఇస్తమంటే ఏం చేస్తరని ప్రశ్నించారు.

ఢిల్లీకి గులాంలుగా ఉండాల్నా?
కాంగ్రెస్‌దంతా గులాంగిరీ చేయడమేనని కెసిఆర్ వ్యాఖ్యానించారు. వీరంతా ఢిల్లీ చేతిలో కీలుబొమ్మలని, అక్కడికి వెళ్తే గోడ బయట చేతులు కట్టుకుని నిలబడాల్సిందేనని అన్నారు. ఢిల్లీ నేతల దగ్గర వారి లాగులు తడుస్తయన్నారు. “మీరే ఆలోచించండి. గులాంగిరి కావాలా లేక మన నిర్ణయం మనమే తీసుకోవడం కావాలా? మీరే ఆలోచించండి” అన్నారు. మిషన్ కాకతీయ, భగీరథలు కమిషన్ కోసమేనంటూ పిచ్చి విమర్శలు చేసిన కాంగ్రెస్ నేతలు నిజాయితీ ఉంటే ప్రజల వద్దకు పోదాం అని సవాలు విసిరారని, తీరా ఇప్పుడు నేను ఆ పనిచేస్తే హైదరాబాద్‌లో ఉండి ఆగమాగమై పోతున్నరని, ఎందుకింత భయమని ప్రశ్నించారు. ఏడు నెలల ముందుగానే ఎన్నికలకు పోతున్నామని, ఆ అవసరం లేకున్నా… ప్రగతి ఆగకూడదనే ఉద్దేశంతోనే వెళ్తున్నామన్నారు.

కాంగ్రెస్‌కు ప్రజల పట్ల ముందుచూపేది?
ప్రజల నుంచి డిమాండ్ లేకున్నా రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ళలో కళ్యాణలక్ష్మికి రూపకల్పన చేశామని, ఆర్థిక అంశాలపై సమగ్రమైన అవగాహన లేకపోవడంతో మొదట రూ.51వేలే ఇచ్చామని, ఆదాయం పెరుగుతుండడంతో దానిని లక్షా నూటపదహారు రూపాలయలకు పెంచామన్నారు. రాష్ట్ర ఆదాయం పెంచుతూ ఆ మేరకు సంక్షేమ కార్యక్రమాలు చేసుకుపోతున్నామని స్పష్టంచేశారు. గురుకులాల్లో చదువుతున్నవారంతా పేద పిల్లలేనని, కెసిఆర్ కిట్స్ అందుతున్నది కూడా ప్రభుత్వ పాఠశాలల్లోని ఆడపిల్లలకేనని, 24గంటల కరెంట్ అందుకుంటోంది మన పల్లె రైతులేనని, భగీరథతో ఇళ్ళల్లోకి వస్తున్న నీళ్లు కూడా మన తెలంగాణ కుటుంబాలకేనని& ఇలా ఒకటేమిటి అన్నీ ప్రజలకు స్వీయానుభవమేనని అన్నారు.

అల్పాదాయ వర్గాలకు ఆసరా
అల్పాదాయ ఉద్యోగుల పరిస్థితి ఎక్కడికి తెచ్చామో చూశారు కదా అని ప్రస్తావించిన కెసిఆర్ అంగన్ వాడీలు, ఆయాలు, ‘ఆశా’ వర్కర్లు, కాంట్రాక్టు కార్మికులు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు& ఇలా ఎందరో జీతాలను పెంచి వారు గౌరవంగా బతికేలా చేశామన్నారు. మళ్లీ గెలిపిస్తే జీతాలను రెట్టింపు చేస్తానని చెప్పారు. ముసలి వాళ్లు, ఒంటరి మహిళలు సైతం గౌరవంగా బతికేలా ఫించన్ ఇచ్చామన్నారు. సబ్‌స్టేషన్ల సిబ్బంది, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఇలా ప్రతీ ఒక్కరి జీతాలు పెంచామన్నారు. యాదవ, కుర్మలకు 70లక్షల గొర్రెలను పంపిణీ చేస్తే అవి మరో 30లక్షల గొర్రెలకు జన్మనిచ్చాయన్నారు. వారిప్పుడు పేదలు కాదని, వారి సంపద రూ.1500కోట్లకు చేరిందన్నారు. ప్రభుత్వం ఏర్పడే నాటికి కాలిపోయే మోటార్లు, పేలిపోయే మోటార్లు, కరిగిపోయే వైర్లు… లంచాలు… పంట పండుతుందో లేదో తెలియని పరిస్థితులుంటే ఇప్పుడు వాటిని సరిచేసుకున్నామన్నారు. రైతాంగానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణయేనని అన్నారు. సమైక్య పాలనలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కొట్లాడి ఉంటే, మాట్లాడి ఉంటే మనకీ దుర్గతి ఉండేది కాదన్నారు. చిప్పలు పట్టుకుని టిక్కెట్లు, చందాలు, పైరవీలు, మంత్రి పదవుల కోసం సమైక్య పాలకుల దగ్గర తంటాలు పడ్డారే తప్ప ఏనాడూ క్రియాశీలకంగా పనిచేయలేదన్నారు. ఉద్యమంలో వారేం చేశారో అందరికి తెలుసని, కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ ప్రాంతానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వనని చెప్తే, వినోద్‌కుమార్, ఈటల, హరీశ్‌రావు కొట్లాడారే తప్ప కాంగ్రెస్ నేతలు రాజీనామా చేయలేదని, సిగ్గు లేకుండా వ్యవహరించారన్నారు. డూప్లికేట్ రాజీనామాలు చేసి ఇళ్ళల్లో పడుకున్నారన్నారు.

తెలంగాణతో ఆత్మగౌరవం పెరిగింది
“అనేక పోరాటాలు, త్యాగాలు, పోలీసు కాల్పులు, తూటాల దెబ్బలు తిని తెలంగాణ తెచ్చుకున్నం. ఎన్నికల్లో పోటీచేసినం. బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చిండ్రు. మంచి పరిపాలన చేస్తున్నాం. అనేక కార్యక్రమాలు, మంచి పనులు జరుగుతున్నాయి, ప్రజలకు బతకగలుగుతామనే ధైర్యం వచ్చింది” అని కెసిఆర్ వ్యాఖ్యానించారు. హుస్నాబాద్ నుంచి పోటీ చేస్తున్న సతీష్ గెలిచినట్లేనని సభకు వచ్చిన 70 వేల మందిని చూస్తేనే తెలుస్తుందన్నారు. సతీష్ మంచోడని మీకోసం ఏంచేశారో మీకే తెలుసని, నేను చెప్పాల్సిందేమి లేదన్నారు.గౌరవెల్లి ప్రాజెక్టు ద్వారా సింగారం తదితర ప్రాజెక్టులకు 1.60 లక్షల ఎకరాల నీరు ఇస్తామన్నారు.

జానారెడ్డీ… టిఆర్‌ఎస్‌కు ప్రచారం చేస్తావా
టిఆర్‌ఎస్ కండువా కప్పుకుని ప్రచారం చేస్తావా అంటూ ప్రతిపక్ష నేత జానారెడ్డికి కెసిఆర్ సవాల్ విసిరారు. “వ్యవసాయ రంగానికి ఒకవేళ 24 గంటల కరెంటు ఇస్తే నేనే గులాబీ కండువా కప్పుకుని నేనే ప్రచారం చేస్తాన”ని జానారెడ్డి అసెంబ్లీలో మాట్లాడారని, తాను మాత్రం 24 గంటల విద్యుత్‌ను ఇచ్చి మాట నిలబెట్టుకున్నానని, కానీ జానారెడ్డి తన మాటను నిలబెట్టుకునేలా ఇప్పుడు గులాబీ కండువా కప్పుకుని ప్రచారం చేస్తారా అని కెసిఆర్ ప్రశ్నించారు. నిజాయితీ ఉంటే ప్రచారం చేయాలన్నారు. కాంగ్రెస్ నాయకులు పిచ్చికూతలు కూస్తున్నారని, వారేమైనా గంధర్వలా, కిన్నెరలా, కింపురుషులా… మనం చూడనివారా? ఆకు పసరు తాగి వచ్చారా అని అన్నారు. ఈ రాష్ట్రాన్ని యాభై ఏళ్ళు పాలించిందెవరో, అప్పుడు మన పరిస్థితేంటో చైతన్యవంతులైన హుస్నాబాద్ ప్రజలు ఆలోచించాలన్నారు.

పథకాలు అమలు ఘనత కెసిఆర్‌దే : వినోద్
రాష్ట్రంలో అతి గొప్ప సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుదేనని కరీంనగర్ ఎంపి బోయినిపల్లి వినోద్ కుమార్ అన్నారు. హుస్నాబాద్ పట్టణంలో శుక్రవారం జరిగిన ప్రజల ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ రైతులు వ్యవసాయంతోపాటు పాడి పంటల్లో సైతం ఉండాలన్న లక్షంతో సిఎం కెసిఆర్ ప్రతీ లీటర్ పాలకు రూ.4ల చొప్పున సహాయాన్ని అందిస్తున్నారన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న ముల్కనూర్ డైయిరీకి ప్రతీ సంవత్సరం రూ.15కోట్లను పాలపై ఖర్చు చేసి రైతులకు సహాయం అందిస్తున్నామన్నారు. ఇదే విధానాన్ని కరీంనగర్ జిల్లాలో సైతం కొనసాగిస్తున్నామన్నారు. రాష్ట్రంలోనే వెనుకబడ్డ ప్రాంతం హుస్నాబాద్ ప్రాంతమని గుర్తు చేస్తూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేలా కెసిఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని అన్నారు.

కాంగ్రెస్ హయాంలో హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న గౌరవెల్లి ప్రాజెక్టును పట్టించుకోలేదని టిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే దానిని రీడిజైనింగ్‌లో 800 శాతం ఎక్కువ చేసి ప్రాజెక్టును అభివృద్ధి చేశామన్నారు. ఎల్కతుర్తి నుండి మెదక్ వరకు జాతీయ రహదారిని సుందరంగా తీర్చిదిద్దేందుకుగాను రూ.1150 కోట్లు మంజూరు చేసుకోవడం జరిగిందన్నారు. హుస్నాబాద్‌లో జరిగిన ప్రజల ఆశీర్వాద సభకు కనీ వినీ ఎరగని రీతిలో ప్రజలు భారీగా తరలివచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ మాట్లాడుతూ మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్‌లో 1.60 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించాలనే లక్షంతో నియోజకవర్గంలో గౌరవెల్లి, గండిపల్లి, సింగరాయ ప్రాజెక్టులను పునరుద్ధరణకు కృషి చేస్తున్నామన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి పనులను సిఎం కెసిఆర్, మంత్రి హరీశ్‌రావుల చొరవతో చేస్తున్నామన్నారు. హుస్నాబాద్ సభకు మహిళలు పెద్ద ఎత్తున తరలిరావడం కనిపించింది.