కస్తూర్బాలో వసతుల కరువు

kasturba

* విద్యార్థులకు మెనూ ప్రకారం అందని భోజనం
* సమస్యలతో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు
* అధికారుల పర్యవేక్షణ లోపం

మన తెలంగాణ/బెజ్జూర్ : కస్తూర్బా గాంధీ విద్యాలయంలో కనీస వసతులు కరువయ్యాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బెజ్జూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో మెనూ ప్రకారం భోజనం అందడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఆదివారం విద్యార్థులకు బగారా రైస్, మటన్ కర్రి, సాంబార్, పెరుగు అందించాల్సి ఉండగా కొంత మంది విద్యార్థులు మటన్ తినరని తెలిసినా వారికి చికెన్, కోడి గుడ్డు అందించాల్సి ఉండగా వారికి వంకాయ కూర మాత్రమే వడ్డించారు. కొంత మంది విద్యార్థులకు మటన్ వడ్డించారు. పెరుగు, సాంబార్, బగారా మాత్రం అందించడం లేదని విద్యార్థులు ఆవేదనవ్యక్తం చేశారు. 20 రోజులుగా స్నాక్స్ అందకపోగా మూడు రోజుల నుండి అందిస్తున్నట్లు విద్యార్థులు పేర్కొన్నారు.  నెలరోజుల నుండి  పండ్లు అందించడం లేదు, మెనూలు గోడకు మాత్రమే పరిమితమయ్యాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల భవనానికి పైన ప్రహరీ లేకపోవడంతో విద్యార్థులు బట్టలు ఆరబెట్టుకునే సమయంలో అదుపుతప్పితే ప్రమాదం జరిగే అవకాకాశాలున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలకు చుట్టూ ప్రహరీ గోడ ఉన్నప్పటికీ ముందు గేటు లేకపోవడంతో పశువులు లోపలికి వస్తున్నాయి. దీంతో విద్యార్థులు ఆటలు ఆడుకునే సమయంలో భయాందోళనకు గురవుతున్నారు. స్నానపు గదుల నీరు పాఠశాల పక్కనే చేరడంతో పందుల విహారం చేస్తున్నాయి. దుర్వాసన వెదజల్లుతుందని, దీంతో దోమలు, ఈగల విహారంతో విద్యార్థులు వ్యాధుల బారిన పడుతున్నారని  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరాలు గడిచినప్పటికీ పాఠశాల గదులకు కిటికీలు లేక వర్షాకాలంలో వర్షం, చలికాలం చలిబారిన విద్యార్థులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. అధికారులు పలుమార్లు సందర్శించినప్పటికి సమస్యల పరిష్కారంలో మాత్రం శ్రద్ధచూపడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. స్నానపు గదులు, మరుగుదొడ్లు సరిపడ లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొందని విద్యార్థులు పేర్కొన్నారు. ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో కల్పిస్తున్నామని చెప్తున్నప్పటికీ అవి బెజ్జూర్ కస్తూర్బా గాంధీ విద్యాలయంలో మాత్రం అమలు చేయడంలో నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రిన్సిపల్ అనూష మాత్రం పాఠశాలకు పండగకు వచ్చినట్లు వచ్చి వెళ్తుంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా గ్యాస్ స్టౌవ్‌పై వంటలు చేయాల్సి ఉండగా కట్టెల పొయ్యిపైన వంటలు చేస్తున్నారు. మెనూ ప్రకారం భోజనం అందించాల్సి ఉండగా క్యాబేజి, వంకాయ (వల్లిపోయిన), ఆలుగడ్డ మాత్రమే అందిస్తున్నారని, ఈ భోజనం సైతం సరిగా తినలేకపోతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో కస్తూర్బా గాంధీ విద్యాలయంలో విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని  విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు సమస్యల పట్ల విద్యార్థులకు న్యాయం చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.