కష్టాల్లో టీమిండియా…

India lost six wickets for 174 runs

లండన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరి టెస్టులోనూ టీమిండియాకు పరాజయం తప్పెలా లేదు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 332 పరుగులకు ఆలౌటైంది. తర్వాత మొదటి ఇన్నింగ్స్ చేపట్టిన భారత్ శనివారం రెండోరోజు ఆట ముగిసే సమయానికి 174 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో చిక్కుకుంది. ఒకవైపు వికెట్లు పడుతున్నా యువ ఆటగాడు విహారి 25 (నాటౌట్) పోరాటం కొనసాగిస్తున్నాడు. అతనికి రవీంద్ర జడేజా 8(నాటౌట్) అండగా ఉన్నాడు. టీమిండియా బ్యాట్స్‌మెన్ మరోసారి పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచారు. ఓపెనర్ శిఖర్ ధావన్ మరోసారి నిరాశే మిగిల్చాడు. మూడు పరుగులు మాత్రమే చేసి బ్రాడ్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికి పోయాడు. అయితే చటేశ్వర్ పుజారాతో కలిసి మరో ఓపెనర్ లోకేష్ రాహుల్ ఇన్నింగ్స్ పటిష్ట పరిచాడు. ఇద్దరు కలిసి ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. పుజారా సమన్వయంతో బ్యాటింగ్ చేయగా ధావన్ కాస్త ధాటిగా ఆడాడు. అయితే కుదురుగా ఆడుతున్న రాహుల్ 37ను శామ్ కరన్ పెవిలియన్ పంపించాడు. దీంతో 64 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఈ దశలో కెప్టెన్ కోహ్లితో కలిసి చటేశ్వర్ పుజారా స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. ఇద్దరు కలిసి స్కోరును వంద దాటించారు. కానీ, కీలక సమయంలో పుజారా వికెట్ పారేసుకున్నాడు. అండర్సన్ బౌలింగ్‌లో పుజారా ఔటయ్యాడు. పుజారా ఐదు ఫోర్లతో 37 పరుగులు సాధించాడు. మరోవైపు అజింక్య రహానె తన పేలవమైన ఫాంను మరోసారి కొనసాగించాడు. అతను ఖాతా తెరవకుండానే అండర్సన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఈ దశలో కొత్త ఆటగాడు, తెలుగుతేజం హనుమ విహారితో కలిసి కోహ్లి పోరాటం కొనసాగించాడు. కానీ ఆరు ఫోర్లతో 49 పరుగులు చేసిన విరాట్‌ను స్టోక్స్ వెనక్కి పంపాడు. ఇక, జట్టును ఆదుకుంటాడని భావించిన వికెట్ కీపర్ రిషబ్ పంత్ (5) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయాడు. దీంతో భారత్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.
బట్లర్ జోరు…
అంతకుముందు ఇంగ్లండ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేసే అవకాశం లభించినా భారత్ దాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయింది. స్టార్ ఆటగాడు జోస్ బట్లర్ అసాధారణ బ్యాటింగ్‌ను కనబరచడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 332 పరుగులకు ఆలౌటైంది. అద్భుత పోరాట పటిమను కనబరిచిన బట్లర్ ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 89 పరుగులు చేసి ఇంగ్లండ్‌ను ఆదుకున్నాడు. అతనికి స్టువర్ట్ బ్రాడ్ అండగా నిలిచాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన బ్రాడ్ 38 పరుగులు చేశాడు. ఈ క్రమంలో బట్లర్‌తో కలిసి తొమ్మిదో వికెట్‌కు 98 పరుగుల భాగస్వామ్యంలో పాలు పంచుకున్నాడు. ఇద్దరు అద్భుతంగా ఆడడంతో ఇంగ్లండ్ స్కోరు 332కు చేరింది. భారత బౌలర్లలో ఇషాంత్, బుమ్రా మూడేసి వికెట్లు పడగొట్టారు. రవీంద్ర జడేజా అందరికంటే ఎక్కువగా నాలుగు వికెట్లు తీశాడు.