కశ్మీర్‌లో మళ్లీ ఘర్షణలు

ప్రార్థనల అనంతరం ఆందోళనలు
పోలీసులపై రాళ్లు విసిరివేత
నిరసనకారులను చెదరగొట్టేందుకు
టియర్ గ్యాస్ ప్రయోగం

Eid In Jammu and Kashmir: Clashes Erupt After Eid Prayers

శ్రీనగర్ : బక్రీద్ పర్వదినాన జమ్మూకశ్మీర్‌లో మళ్లీ ఘర్షణలు మొదలయ్యాయి. బుధవారం ఉదయం కశ్మీర్‌లోని అనేక ప్రాంతాల్లో ముస్లింలు బక్రీద్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ప్రజలు ఆందోళనకు దిగారు.దీంతో ఆందోళకారులు, పోలీసులకు మధ్య ఘర్షణలు తలెత్తాయి.పోలీసులపై నిరసనకారులు రాళ్లు రువ్వారు. అనంతనాగ్ పట్టణంలో నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్‌గ్యాస్‌ను, రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు. కశ్మీర్ వ్యాప్తంగా బక్రీద్ ప్రార్థ నలు ప్రశాంతంగా జరిగాయని, లోయలోని అనేక ప్రాంతాల్లో వేలాదిమంది ముస్లింలు ప్రార్థనల్లో పాల్గొన్నట్లు పోలీస్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.

అయితే ప్రార్థనల అనంతరం శ్రీనగర్, జంగ్లత్ మండి, అనంతనాగ్, సోపోర్‌లోని కొన్ని ఈద్ఘాల వద్ద కొన్ని చదురుముదురు ఘటనలు చోటు చేసుకున్నాయన్నారు. దుండగులు పోలీసులుపై రాళ్లు రువ్వారని, వారిని చెదరొట్టేందుకు పోలీసులు తీవ్ర చర్యలు తీసుకోవాల్సి వచ్చినట్లు ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా, ఆర్టికల్ 35 ఎ ఎత్తివేయాలంటూ బిజెపి, దాని అనుబంధ సంస్థల డిమాండ్‌కు నిరసనగా ప్రార్థనల అనంతరం ఈద్ఘాల వద్ద నిరసన తెలియజేయాలని సయ్యిద్ అలీ జిలానీ, యాసిన్ మాలిక్, మిర్వాయిజ్‌లతో కూడిన సంయుక్త ప్రతిఘటన నాయకత్వం (జెఆర్‌ఎల్) పిలుపునిచ్చింది.

పోలీసుపై ఉగ్రవాదులు కాల్పులు

ఇప్పటి వరకు ముగ్గురు పోలీసులను పొట్టన పెట్టుకు న్నారు. ఓ పోలీసుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో ఫయాజ్ అహ్మద్ అనే ట్రైనీ కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతిచెందారు. బక్రీద్ ప్రార్థనలు ముగించుకొని తిరిగివస్తున్న నేపథ్యంలో అతనిపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. అహ్మద్ కుల్గామ్ జజ్రిపొరా నివాసి.

బిజెపి నాయకుడి హత్య

పుల్వామా జిల్లాలో బిజెపి నాయకుడు షబ్బీర్ అహ్మద్ భట్‌ను కూడా ఉగ్రవాదులు దారుణంగా హత్య చేశారు. అతని మృతదేహం బుధవారం ఉదయం లభ్యమైంది. మంగళవారం సాయంత్రం శ్రీనగర్‌నుంచి పూల్వామాలోని తన ఇంటికి వెళ్తుండగా గుర్తుతెలియని ముష్కరులు భట్‌ను అపహరించారు. అనంతరం అతన్ని చంపేసి మృతదేహాన్ని లిట్టర్ గ్రామంలో వదిలివెళ్లారు. ఘటన పట్ల దర్యాప్తు చేస్తున్నట్లు ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. భట్ హత్యను బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి తీవ్రంగా ఖండించారు.