కల్తీ కోరల్లో అన్నదాత

On fake seeds, today are adulterated chemicals

నాడు నకిలీ విత్తనాలు, నేడు కల్తీ రసాయనాలు
తాండూర్, బెజ్జూర్‌లలో భారీగా రసాయనాల పట్టివేత
గుంటూరు కేంద్రంగా సాగుతున్న అక్రమ దందా
రహస్య ప్రదేశాల్లో అక్రమంగా భారీ నిల్వలు
మోసాలకు గురవుతున్న అమాయక రైతులు

మన తెలంగాణ/మంచిర్యాల : ఒకవైపు నకిలీ విత్తనాలు మరోవైపు కల్తీ రసాయనాలతో అన్నదాతలు మోసాలకు గురువుతున్నారు. ప్రభుత్వ నిషేధిత రసాయనాలను జోరుగా విక్రయించి వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో పెద్ద ఎత్తున నకిలీ విత్తనాల దందా కొనసాగించిన వ్యాపారులు ప్రస్తుతం కలు పు మొక్కల ఏరివేతకు ఉపయోగించే కల్తీ రసాయనాలను రైతులకు అంటగట్టి నిలువు దోపిడి చేస్తున్నారు. గుంటూరు కేంద్రంగా సాగుతున్న ఈ అక్రమ దందాపై అధికారులు పట్టనట్ల్లుగా వ్యవహరించడంతో కోట్లాది రూపాయల టర్నోవర్‌లో వ్యాపారం సాగుతోంది. నకిలీ విత్తనాలు ఇప్పటికే మొలకెత్తక రైతులు తీవ్రంగా నష్టపోగా మళ్లీ కల్తీ రసాయనాలను అంటగడుతూ రైతులను మోసం చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఈ దందా కొనసాగుతుండగా తాజాగా బుధవారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి, భారీ ఎత్తున కల్తీ రసాయనాలను స్వా ధీనం చేసుకొని ఇద్దరు వ్యాపారులను అరెస్టు చేశారు. గ్లైఫోసేట్ 41శాతం ఎస్‌ఎల్ కంపెనీకి చెందిన క్లియర్‌ఆఫ్ రసాయన ద్రావణాలను పోలీసులు కల్తీగా తేల్చారు. మంచిర్యాలజిల్లాలోని తాండూర్‌లో బుధవారం టాస్క్‌ఫోర్స్ సిఐ బుద్దె స్వామి ఆధ్వర్యంలో పోలీసులు అక్రమంగా నిల్వ ఉంచిన శ్రీలక్ష్మి ఫెర్టిలైజర్ దుకాణంపై దాడి చేసి 45 కార్టన్‌లలో ఉన్న 450 లీటర్ల రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.2.25 లక్షలు ఉండగా వ్యాపారి రాచెర్ల మహేష్‌ను అదుపులోకి తీసుకొని తాండూర్ పోలీస్ స్టేషన్‌లో తదుపరి చర్యల కోసం అప్పగించారు. అదే విధంగా కొమురంభీం జిల్లాలోని బెజ్జూర్ మండలంలోని ముంజంపల్లిలో ఎరువుల వ్యాపారి వ్యాన్‌లో కల్తీ రసాయనాలను తీసుకువచ్చినట్లుగా అందిన సమాచారం మేరకు పోలీసులు ఇంటిపై దాడి చేసి 400 లీటర్ల రసాయనాలను పట్టుకున్నారు. వీటి విలువ 1.60 లక్షలు ఉండగా పుల్లూరి అంజయ్య అనే వ్యాపారిని అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో కల్తీ రసాయనాలను గుంటూరు నుంచి తీసుకువస్తున్నట్లుగా వెల్లడైంది. కాగా గత కొంత కాలంగా నకిలీ విత్తనాలు కల్తీ రసాయనాల వ్యాపారం జోరుగా సాగుతుంది. రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న వ్యాపారులు అధిక దిగుబడులు, కలుపు ఏరివేత ఆశ చూపి యథేచ్ఛగా రైతులకు అంటకడుతున్నారు. ఖరీఫ్ సీజన్‌లో నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి, మొలకెత్తక నష్టపోయిన రైతులు మరోసారి కల్తీ రసాయనాలను కొనుగోలు చేసి, నష్టపోయే పరిస్థితులు ఎదురయ్యాయి. ఇప్పటికే మంచిర్యాల, కొమురంభీం జిల్లాల్లో దాదాపు 6 వేల ఎకరాల్లో గ్లైసిల్ అనే పత్తి విత్తనాలను నాటగా మొలకెత్తకపోవడంతో మళ్లీ విత్తనాలను కొనుగోలు చేసి, వేసుకోవాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. కలుపు మొక్కల ఏరివేత పేరిట ప్రస్తుతం కల్తీ రసాయనాలను రైతులకు విక్రయిస్తున్నారు. ఈ ప్రాంతంలోని ఫెర్టిలైజర్ షాపుల యాజమానులు గుంటూరు నుంచి కల్తీ రసాయనాలను దిగుమతి చేసుకుంటూ అక్రమంగా నిల్వలను ఏర్పాటుకు చేసుకొని రహస్యంగా విక్రయాలు జరుపుతున్నారు. రెండుజిల్లాల్లో చాలా చోట్ల వ్యాపారులు రహస్యంగా నిల్వలను ఏర్పాటు చేసినప్పటికీ వ్యవసాయ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా కల్తీ రసాయనాలు కొనుగోలు చేసి, వ్యాపారులు నష్టపోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.