కలుపు మొక్కలతో పంటలకు నష్టం

Investment Assistance to the Spirits

తినేస్తున్న పురుగుల మందులు
పిచికారీలకే సరిపోతున్న పెట్టుబడి సాయం
ఎకరాకు నాలుగు వేలు ఖర్చు
లబోదిబోమంటున్న రైతులు

మన తెలంగాణ/మద్నూర్:  కామారెడ్డి జిల్లాలోని మద్నూర్ మండలంలో  పంటల సాగు రైతులకు గుది బండగా మారుతోంది. ఓ వైపు నుండి సర్కారు సాయం అందుతుందంటే మరోవైపు నుండి నష్టం వాటిల్లుతోంది. కష్టించి పనిచేసే రైతులను కలుపు మొక్కలు ఆర్థికంగా పట్టి పీడిస్తోంది. కలుపు మొక్కలు తొలగించుకునేందుకు ఎకరాకు నాలుగు వేల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. పంటను ఎదగనివ్వకుండా చుట్టూ కలుపు మొక్కలు ఏపుగా పెరుగుతుండటంతో రైతులు కలవరపాటుకు లోనవుతున్నారు. పచ్చిగడ్డిని తొలగించుకునేందుకు ప్రత్యామ్యాయ ఏర్పాట్లకు సంసిద్ధమవుతున్నారు. అందుకోసం పిచికారీ మందులను కొనుగోలు చేసేందుకు సిద్ధపడుతున్నారు.  ఎకరాకు పురుగుల మందుల పిచ్కారీ కోసం మూడు వేల నుండి నాలుగు వేల రూపాయల వరకు వెచ్చించుకోవాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. మండలంలో ఈ సారి 42 వేల ఎకరాల్లో సోయా, మరో 13 వేల ఎకరాల్లో పెసర, మినుము పంటలను రైతులు సాగు చేస్తున్నారు. పంటలను అలికిన ఇరువై రోజుల వ్యవధిలోనే పచ్చిగడ్డి సమస్య తలెత్తడంతో వారు కలవరపాటుకు లోనవుతున్నారు. ఇదే కాకుండా పచ్చిగడ్డి సమస్య తొలగిపోయాక పంట బాగు కోరి మరోమారు మందులను పిచ్కారీ చేయాల్సి ఉంటుందని వారు అంటున్నారు. కేవలం పచ్చిగడ్డి నివారణకే ప్రభుత్వం అందించిన పెట్టుబడి సాయం రైతు బంధు పథకం కింద వచ్చిన లబ్ధి సరిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోమారు మందులను పిచ్కారీ చేయాలంటే అప్పు చేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నం కానున్నాయని రైతులు వాపోతున్నారు. పంట భూముల్లో ఎక్కడ పడితే అక్కడ పచ్చిగడ్డి పెరుగుతుండటంతో రైతులు పిచ్కారీ చేసే పనిలో నిమగ్నమయ్యారు. వారం రోజులుగా వారు అదే పనిలో లీనమవుతున్నారు.

రైతులను అప్రమత్తం చేయడంలో అధికారుల నిర్లక్షం
నల్ల మట్టి భూముల్లో ఏలాంటి పంటలు ఏ విధంగా వేసుకోవాలన్న విషయంలో రైతులకు ముందస్తుగా అవగాహన కుదుర్చడంలో క్షేత్ర స్థాయి అధికారులు నిర్లక్షంగా వ్యవహరించారు. పంటలను అలికే ముందు పచ్చిగడ్డి మొలువకుండా, అట్టి సమస్య రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా ఉండేందుకు ముందుగానే వారిని అప్రమత్తం చేయాల్సి ఉండేది. అప్పుడు వేసుకున్న పంటల్లో పచ్చిగడ్డి మొలకెత్తే పరిస్థితులు ఉండేవి కావని రైతులు చెబుతున్నారు. సమస్య ఉత్పన్నమయ్యాక ఇప్పుడు మందులను పిచ్కారీ చేసుకోవాలంటూ సలహాలు అందిస్తున్నారని ఆందోళన చెందుతున్నారు.

పెరుగుతున్న పచ్చిగడ్డి రకాలు ఇవే
ప్రస్తుతం మద్నూర్ మండలంలో వేసుకున్న సోయా, పెసర, మినుము పంటల్లో పచ్చిగడ్డి సమస్య తీవ్రరూపం దాల్చింది. పంటల మధ్యలో గునుక పువ్వు గడ్డి, కాగ్రెస్ గడ్డి, జిలుగ, ఉత్తరేణి, గరక , గుంజర, అడవి తులసి, జొన్న సంచలం అనే పలు రకాల పచ్చగడ్డి ఏపుగా పెరుగుతుండటంతో సమస్య తలెత్తినట్లు రైతులు పేర్కొంటున్నారు.

గడ్డి మమ్మిల్ని తినేస్తుంది: రైతులు గడ్డిని తొలగించుకునేందుకు అదనంగా ఎకరాకు నాలుగు వేల రూపాలయ వరకు ఖర్చు చేసుకోవాల్సి వస్తుందని నర్సుగొండ అనే రైతులు దిగాలు చెందాడు. మరో రైతు సాయబ్ రావ్ కూడా తాను వేసుకున్న నాలుగు ఎకరాల పెసర పంటలో పచ్చిగడ్డి మొలచిందని, దాన్ని తీసేసేందుకు తాను సుమారు 18 వేల రూపాయల వరకు ఖర్చు చేసుకున్నానని ఆవేదన చెందాడు. ఏది ఏమైనా ఆరుగాలం కష్టించి పనిచేసి పంటను పండించే రైతాంగాన్ని ఎదో ఒక సమస్య వారిని ఇబ్బందులకు గురి చేయడం విచారకరమని వ్యవసాయాధికారులు అంటున్నారు.

Comments

comments