కలిసికట్టుగా ఎదుర్కొందాం

     రోజురోజుకీ పెరగడమేగాని తగ్గడం లేదు. చైనా కోలుకోగా బయటి ప్రపంచం మంచమెక్కుతోంది. సింహం పైకెక్కి కూచున్న ఏనుగులా గజగజలాడుతోంది, విలవిలలాడిపోతోంది. కరోనా వల్ల చైనాలో మృతి చెందిన వారి సంఖ్యకు మించి బయటి దేశాల్లో ఇప్పటికే చనిపోయారు. ప్రపంచం మొత్తం మీద మృతుల సంఖ్య 9200 కి చేరుకున్నది. ఇటలీ మరో చైనాలా మారిపోయింది. ఇరాన్ అదే బాట పడుతున్నది. మన ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నట్టు చైనా పక్కనే ఉన్న వియత్నాంలో కరోనా విలయతాండవం […] The post కలిసికట్టుగా ఎదుర్కొందాం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

     రోజురోజుకీ పెరగడమేగాని తగ్గడం లేదు. చైనా కోలుకోగా బయటి ప్రపంచం మంచమెక్కుతోంది. సింహం పైకెక్కి కూచున్న ఏనుగులా గజగజలాడుతోంది, విలవిలలాడిపోతోంది. కరోనా వల్ల చైనాలో మృతి చెందిన వారి సంఖ్యకు మించి బయటి దేశాల్లో ఇప్పటికే చనిపోయారు. ప్రపంచం మొత్తం మీద మృతుల సంఖ్య 9200 కి చేరుకున్నది. ఇటలీ మరో చైనాలా మారిపోయింది. ఇరాన్ అదే బాట పడుతున్నది. మన ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నట్టు చైనా పక్కనే ఉన్న వియత్నాంలో కరోనా విలయతాండవం లేకపోడం గమనించదగినది. సామూహిక సందర్భాల నుంచి దూరంగా ఉండడంతో అది బతికిపోయినట్టున్నది.అమెరికాలోనూ మృతుల సంఖ్య పెరుగుతున్నది. మన దేశంలో మృతులు ఏక అంకె దాటలేదు. ఇప్పటికి నాలుగో మరణం మాత్రమే రికార్డయింది.

దేశంలో కరోనా కేసులు మాత్రం 160 దాటాయి. శాస్త్రజ్ఞులు చెబుతున్నట్టు ఇండియాలో కరోనా ఇంకా రెండవ దశలో ఉండడం, సమూహాల నుంచి వ్యాప్తి చెందే పరిస్థితి లేకపోడమే ఇందుకు కారణం కావచ్చు. ఆ దశ రాకముందే తగిన గట్టి జాగ్రత్తలతో దానిని అరికట్టడం మనందరి కర్తవ్యం. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెంది, వైద్య పరిశోధనల్లో విశేష ప్రగతి సాధించిన ఆధునిక ప్రపంచంలో ఇంత కాలంగా పీడిస్తున్న ఈ మహమ్మారికి ఇంతవరకు తగిన మందు కనుక్కోలేకపోడం చెప్పనలవికానంత మానవ వైఫల్యమని ఒప్పుకోవాలి. అంతర్జాతీయ సహకార లోపమో మరేదో ఇందుకు కారణం అయి ఉండాలి. దేశాల మధ్య రాకపోకలు ఆపేయడం, పది మంది గుమిగూడే బృంద కార్యకలాపాలకు తెర దించడం, ప్రతి ఇద్దరి మధ్య దూరాన్ని పాటించడం వంటి ముందు జాగ్రత్తలను తీసుకోడం ద్వారానే వైరస్ వ్యాప్తిని అరికట్టవలసి ఉంది.

ఈ పరిస్థితి ప్రపంచాన్ని కంపింప చేస్తున్నది. అన్నింటినీ బంద్ పెట్టక తప్పకపోడంతో విశ్వమంతా వూహాన్ నగరం మాదిరిగా మారిపోతున్నది. ఉత్పత్తికి, ఉద్యోగాలకు కనీవినీ ఎరుగని విఘాతం కలుగుతున్నది. ఫంక్షన్ హాళ్లు, సినిమా హాళ్లు వంటివి కూడా మూసివేయడంతో, పూర్వం మాదిరిగా ప్రజలు బయటకు వెళ్లకుండా ఇళ్లకే పరిమితం కావడంతో రోజు కూలీతో దినదిన ఆదాయంతో బతికే వారు చిన్న, సన్న వ్యాపారాలు చేసుకునేవారు తీవ్రంగా నష్టపోతున్నారు. అయితే ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా ప్రాణ రక్షణ కోసం దీక్షతో పరస్పర సహకారంతో ఈ జాగ్రత్తలన్నీ తీసుకోక తప్పదు. కరోనా వైరస్ విదేశాల నుంచి వస్తున్న వారిలోనే బయటపడుతున్నదనేది సుస్పష్టం. ఇందులో సందేహం లేదు. దేశ వ్యాప్తంగాగాని, మన రాష్ట్రంలోగాని ఇదే రుజువయింది. అందుచేత దేశంలోకి బయటి విమానాల రాకను నిషేధించడం తప్పనిసరి.

గురువారం నాడు కేంద్రం ఈ మేరకు చర్యలు తీసుకున్నట్టు, అంతర్జాతీయ విమానాల రాకను ఈ నెల 22 నుంచి నిషేధించినట్టు వార్తలు వచ్చాయి. సామూహిక సన్నివేశాలే వైరస్ వ్యాప్తికి మూలమని రుజువవుతున్నందున సంతలు, పెళ్లిళ్లు, ఉత్సవాలు, దేవాలయాల, ఇతర ప్రార్థనా స్థలాల సందర్శనాలను నిలిపివేయక తప్పదు. 170పైగా దేశాల్లో కరోనా బయట పడింది. మంచు ఖండం అంటార్కిటికా మినహా మిగతా ప్రపంచమంతా వ్యాపించింది. ప్రత్యేకించి ఆసియా, యూరప్ ఖండాలను వణికిస్తున్నది. కరోనా దెబ్బకు విమాన యాన రంగం తీవ్రంగా నష్టపోయింది. ఇండిగో, ఎయిర్ ఇండియా వంటి సంస్థలు తమ ఉద్యోగులకు వేతనాల కోతను కూడా ప్రకటించాయి. పరిస్థితి మరి కొంత కాలం ఇలాగే కొనసాగితే ఉద్యోగాలే ఊడిపోతాయి. ఆకలి చావులు తప్పనిసరి కాగల ఉపద్రవం ముంచుకొస్తుంది. అందుచేత దీనినొక అత్యవసర పరిస్థితిగా పరిగణించి ఎవరికి వారు ఈ వైరస్ పట్ల దాని నివారణకు తీసుకోవలసిన చర్యల పట్ల అవగాహన పెంచుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంది.

ముందు జాగ్రత్తల విషయంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ముందడుగు వేసిందని చెప్పక తప్పదు. శంషాబాద్ విమానాశ్రయంలో థర్మల్ స్క్రీనింగ్ సహా ఉత్తమమైన పరీక్షలు జరిపించడంలో మన రాష్ట్రం ఆదర్శప్రాయంగా నిలిచింది. అలాగే క్వారంటైన్ల ఏర్పాటులోనూ మెలకువ వహించింది. రాష్ట్రంలో ఇంతవరకు 16 పాజిటివ్ కేసులు నమోదు కాగా, గాంధీ ఆసుపత్రిలో నాణ్యమైన చికిత్స అందించడం ద్వారా ఒక రోగికి పూర్తిగా నయం చేసిన ఘనత మన రాష్ట్రానిదే. అయినా అప్రమత్తతతో ఉండడమే శరణ్యం. ముఖ్యమంత్రి కెసిఆర్ కరోనా మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రజలు కూడా సహకరించి కరోనా నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవలసి ఉంది. కలిసి కట్టుగా దీక్షతో కృషి చేస్తే సాధించలేనిదేమీ ఉండదు. అంతిమంగా కరోనా కథ కంచికి వెళ్లక తప్పదు.

China epicentre records no new corona case

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కలిసికట్టుగా ఎదుర్కొందాం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.