కరెంటు ఎరుగని గ్రామాలు..

ఎప్పుడు ఉంటుందో.. ఉండదో తెలియని వైనం వేధిస్తున్న సిబ్బంది కొరత ఇబ్బంది పడుతున్న ప్రజలు మన తెలంగాణ/ఆసిఫాబాద్‌టౌన్:  జిల్లా కేంద్రంలో కరెంటు ఎప్పుడు ఉంటుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితులు దాపురించారు. కోతలు లేకుండా సరఫరా చేస్తున్నామని ఒకవైపు ప్రభుత్వం చెప్తున్నప్పటికి కరెంటు సమస్య రోజు రోజుకు పెరిగిపోతుంది. మండలంలో చిన్నపాటి గాలి వీచినా కరెంటు గోవిందా అన్నట్లు తయారవుతుంది. మండలంలో 14వేల మంది విద్యుత్ వినియోగదారులు ఉండగా పట్టణ జనాభా 60వేల పైనే ఉంది. అలాగే […]

ఎప్పుడు ఉంటుందో.. ఉండదో తెలియని వైనం
వేధిస్తున్న సిబ్బంది కొరత
ఇబ్బంది పడుతున్న ప్రజలు

మన తెలంగాణ/ఆసిఫాబాద్‌టౌన్:  జిల్లా కేంద్రంలో కరెంటు ఎప్పుడు ఉంటుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితులు దాపురించారు. కోతలు లేకుండా సరఫరా చేస్తున్నామని ఒకవైపు ప్రభుత్వం చెప్తున్నప్పటికి కరెంటు సమస్య రోజు రోజుకు పెరిగిపోతుంది. మండలంలో చిన్నపాటి గాలి వీచినా కరెంటు గోవిందా అన్నట్లు తయారవుతుంది. మండలంలో 14వేల మంది విద్యుత్ వినియోగదారులు ఉండగా పట్టణ జనాభా 60వేల పైనే ఉంది. అలాగే మండలంలో 150 వరకు త్రీపేస్ ద్వారా విద్యుత్‌ను వినియోగిస్తు చిన్న చిన్న పరిశ్రమలు కూడా నడుస్తున్నాయి. అయితే ముఖ్యంగా వేసవికాలం కావడంతో విద్యుత్ అవసరాలు విపరీతంగా పెరగడంతో పాటు లోడు అధికమై తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది. ఒక్కక్షణం కరెంటు లేకపోతే ఉక్కపోత భరించలేక చిన్నారులు,పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇంతే కాకుండా మండలంలో హైవే రోడ్డు తిర్యాణి రహదారి పనులు నడస్తుండడంతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. పట్టణంలో ఎక్కడ ఏ ప్రమాదం సంభవించినా గాలివీచి వైర్లు తెగిపోయినా, స్తంభాలు పడిపోయినా విద్యుత్‌శాఖలో సరిపడ సిబ్బంది లేక పనులు ఆలస్యం కావడంతో ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. కొన్ని కాలనీలలో రాత్రి సమయంలో విద్యుత్ ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న దస్నాపూర్ కాలనీలో విద్యుత్ ఉండడం లేదని, ఒక్కోసారి లో ఓల్టేజి ఉంటుందని, విద్యుత్‌శాఖ అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ వారిపై అసహానం వ్యక్తం చేస్తు గత 10 రోజుల క్రితం ఏకంగా సబ్‌స్టేషన్ వద్దకు చేరుకుని రాత్రిపూట ఆందోళనలు చేసిన సంఘటనలు సైతం ఉన్నాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా, ప్రజానికానికి ఇబ్బందులు కల్గకుండా ఇప్పటికైనా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, కొత్త సిబ్బందిని నియమించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
వేధిస్తున్న సిబ్బంది కొరత…
జిల్లా కేంద్రం అయినప్పటికి ఎంతో ముఖ్యమైన విద్యుత్‌శాఖలో సిబ్బంది కొరత వేధిస్తుంది. 14 మంది జూనియర్ లైన్‌మేన్‌లు ఉండాల్సి ఉండగా 8 మందే ఉన్నారు. నలుగురు అసిస్టెంట్ లైన్‌మేన్‌లలో ఒక్కరే విధులు నిర్వహించడంతో చేసేదేమీలేక ప్రైవేటు సిబ్బందితోనే పనులు చేయించుకోవాల్సి వస్తుందని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
కరెంటు ఎరుగని పల్లెలు ….
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న కొన్ని గ్రామాలు ఇప్పటికి కరెంటు అంటే వారికి తెలియదు. రాత్రిపూట దీపం వెలుగులోనే కాలం వెల్లదీస్తున్నారు. గ్రామంలో ఉన్న విద్యార్థులు చదువుకోవాలంటే ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఒక్కక్షణం కరెంటు లేకపోతే బ్రతకలేని ఈ రోజుల్లో వారి గ్రామానికి కరెంటే లేకపోవడంతో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఊహించుకోవచ్చు. మండలంలోని దాదాపూర్, పాత గోవిందాపూర్, గోండ్‌గూడ, భీంగూడ, నాగుల్‌గొంది గ్రామాలతోపాటు మరికొన్ని పల్లెలు ఇప్పటికి కరెంటుని ఎరుగకపోవడం గమనార్హం.

Related Stories: