కడుపుబ్బ నవ్వించే ‘సిల్లీ ఫెలోస్’

Allari Naresh  Silly Fellows movie release  today

అల్లరి నరేష్, సునీల్, పూర్ణ, నందినిరాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సిల్లీ ఫెలోస్’. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో బ్లూ ప్లానెట్ ఎంటర్‌టైన్‌మెంట్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లపై కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో అల్లరి నరేష్ మాట్లాడుతూ “సుడిగాడు చిత్రం తర్వాత భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో నేను చేసిన చిత్రమిది. మా కాంబినేషన్‌లో మరోసారి ఈ చిత్రంతో విజయం సాధిస్తామన్న నమ్మకముంది. నేను, సునీల్ చేసిన కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది. హీరోయిన్లు ఇద్దరూ బాగా నటించారు”అని అన్నారు. సునీల్ మాట్లాడుతూ “భీమనేని శ్రీనివాసరావుతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. అల్లరి నరేష్‌తో కలిసి ఎంతో సరదాగా ఈ సినిమాను పూర్తిచేశాం. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది”అని తెలిపారు. దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ “స్క్రిప్ట్‌పై సంవత్సరం కష్టపడిన తర్వాత షూటింగ్ చేసిన సినిమా ఇది. ‘సుడిగాడు’ తర్వాత నరేష్‌తో చేసిన ఈ సినిమా ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్ ఇది”అని పేర్కొన్నారు. బ్రహ్మానందం మాట్లాడుతూ “భీమనేని శ్రీనివాసరావుతో 26 సంవత్సరాల అనుబంధం ఉంది. ఏదై నా సరే చాలా పర్‌ఫెక్ట్‌గా చేయాలనే కొద్ది మంది దర్శకులలో ఆయన ఒకరు. ఈ సినిమాలో ఎవరికి వారు తమ స్టయిల్లో నవ్వించారు”అని చెప్పారు. భరత్ చౌదరి మాట్లాడుతూ “రెండు గంటల పాటు నవ్వుల్లో ముంచెత్తే సినిమా ఇది. ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాం”అని అన్నా రు. ఈ కార్యక్రమంలో వివేక్ కూచిబొట్ల, నందిని, పూర్ణ, శ్రీవసంత్ తదితరులు పాల్గొన్నారు.