కడియం పాలనలో పరుగులు

Runs in the Kadiyam regime

ఉమ్మడి జిల్లా సమగ్రాభివృద్ధికి వరుస సమీక్షలు 

మన తెలంగాణ/వరంగల్ అర్బన్ : ఎన్నికల సమయం సమీపిస్తుండడంతో వరంగల్ ఉమ్మడి జిల్లాలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు లక్షం మేరకు పూర్తి చేసే విధంగా ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి పాలనను పరుగు పెట్టిస్తున్నారు. ఐదు జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు సంబంధిత శాఖల అధికారులతో తరుచూ సమీక్షలు నిర్వహిస్తూ ఉమ్మడి జిల్లా సమగ్రాభివృద్ధిపై ఖచ్చితమైన సంకేతాలు ఇస్తూ అధికారులను  పురమాయిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో ప్రతిష్టాత్మకమైన హరితహారం మిషన్ భగీరథ, రైతు బీమా, కంటి వెలుగు, ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై సంబంధిత జిల్లా అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ పథకాల అమలు, వాటి లక్షం నెరవేరే దిశలో ప్రయత్నాలను ముమ్మరం చేశారు. వారం రోజులుగా ఉప ముఖ్యమంత్రి వరంగల్ కేంద్రంలోనే ఉంటూ సుడిగాలి పర్యటన చేస్తూ అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేసి వాటిలో భాగస్వాములవుతున్నారు.

మొన్నటి వరకు రైతుబంధు పథకంలో ప్రతి రైతుకు లబ్ధి చేకూరేవిధంగా అధికారులతో సమీక్షలు నిర్వహించి పథకం విమర్శల పాలు కాకుండా సక్సెస్ చేశారు. ఆ విజయంతో రైతుల నుంచి ప్రభుత్వం పట్ల ఎక్కువ సానుభూతి ఉండడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు లభించింది. దానికి సీనియర్ మంత్రిగా ఉన్న ఉపముఖ్యమంత్రి కడియం కృషే కారణమని కెసిఆర్ భావించినట్లు తెలిసింది. అందులో భాగంగా కెజి టు పిజి విద్యలో గురుకుల పాఠశాల విద్యను బలోపేతం చేయడం, రెండు సంవత్సరాల్లోనే అత్యధిక శాతం ఫలితాలు రావడం ప్రభుత్వ ప్రతిష్ట మరింత పెంచినట్లు అయింది. గురుకుల విద్యా విధానం, మధ్యాహ్న భోజనం పథకాలతో ప్రైవేటు పాఠశాలలు, కార్పొరేట్ కళాశాలలకు విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. గురుకుల పాఠశాలలకు విద్యార్థుల చేరికలు ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వ విద్యా విధానంలో కొంత పుంతలు తొక్కడం వల్ల పూర్వ వైభవం గ్రామాల్లో వచ్చింది. హరితహారం పథకం అమలులో మొదటి విడత నుంచి నాలుగో విడత వరకు చేసిన కృషి తగిన ఫలితాలను అందిస్తుంది. ఎక్కువ శాతం అటవీశాఖ పరిధిలో నాటుతున్న మొక్కలతో పాటు విద్యా, వైద్య, ప్రభుత్వ కార్యాలయాలు మొక్కలు నాటడం వల్ల మూడు సంవత్సరాల్లో మంచి ఫలితాలు వచ్చా యి. రైతులు కూడా భారీ ఎత్తున చేలల్లో సాంప్రదాయపంటగా చెట్లను నాటుతుండడం వల్ల అవి ఏపుగా పెరిగి గ్రామాల్లో కొంత అందాలను, పచ్చధనాన్ని తీసుకొస్తుంది.

మిషన్ భగీరథకు సంబంధించిన పనుల్లో అధికారుల, కాంట్రాక్టర్లపై ఒత్తిడి పెంచడం వల్ల మేయిన్ పైపులైన్లు పనులు పూర్తికాగా ట్యాంకులు, ఇంట్రా విలేజ్ పనులు ప్రగతి పథంలో నడుస్తున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టిన కొత్త పథకంలో కంటి వెలుగు పథకం నుంచి ప్రజల్లో ప్రభుత్వానికి మంచి పేరు తీసుకరావాలనే ఉద్దేశంతో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ముమ్మరం చేస్తుండడంతో ఈ పథకం కూడా సక్సెస్ రేటులో ముందుకు పోతుంది. దానికి పూర్తిస్థాయి అవగాహన అధికారుల్లో ఉపముఖ్యమంత్రి కల్పించడం దాని విజయవంతానికి దారి తీసినట్లవుతుంది. ఉమ్మడి జిల్లాలోని అన్నిప్రాంతాల్లో కంటి వెలుగు పరీక్షలకు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయడమే కాకుండా ప్రజల్లో అవగాహన పెంచి ప్రతి ఒక్కరికి కంటి వెలుగు పరీక్షలు జరిగే విధంగా చర్యలు తీసుకోవడానికి పకడ్భంధీ ప్రణాళికలు అమలు చేస్తున్నారు. దానిని కిందిస్థాయి అధికారులు అమలు చేసే విధంగా ఈ సమీక్షలు ఎంతగానో దోహదపడుతున్నాయి. ఉమ్మడి జిల్లా సమగ్రాభివృద్ధిపై గత రెండున్నర దశాబ్ధాల అనుభవం ఉన్నందున ప్రస్తుతం ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు ఉంటాయో వాటిపై తక్షణమే అధికారులకు సూచనలు చేయడం, పనులు వేగవంతం కావడానికి మార్గం ఏర్పడుతుంది. జిల్లా అభివృద్ధిపై జరిగిన, జరుగుతున్న అభివృద్ధిపై కడియం మార్క్ ఎప్పటికీ ఉంటూనే ఉంది. తెలంగాణ ప్రభుత్వంలో కూడా తన మార్క్‌ను వేసుకున్నారు. విద్యాశాఖ మంత్రిగా జిల్లాలో గురుకుల విద్యాలయాల ద్వారా మంచి పేరు సంపాదించుకున్న మంత్రి కడియం శ్రీహరి మిగిలిన శాఖల అభివృద్ధిపై ప్రస్తుతం అధికారులతో పాలన పరుగులు పెట్టించడం విశేషం.

Comments

comments