ఓట్ల కోసమే కాంగ్రెస్ నేతల డ్రామాలు

Have you 10 years in power and completed one project?

పదేళ్లు అధికారంలో ఉండి ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేశారా?
కెఎల్‌ఐ వాటాలో 40 టిఎంసిల నీటిని వాడుకునేలా 10 ఆన్‌లైన్ రిజర్వాయర్ల నిర్మాణానికి శ్రీకారం
భూములు కోల్పోయే రైతులు హర్షించే విధంగా పరిహారం చెల్లిస్తాం
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి 

మన తెలంగాణ/పెద్దమందడి : ఓట్ల కోసమే కాంగ్రెసోళ్లు రైతులపై ప్రేమ ఉన్నట్లుగా నటిస్తు ప్రాజెక్టులను అడ్డుకుంటూ రైతులను వంచించేందుకు ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగి రెడ్డినిరంజన్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని గట్ల ఖానాపురం గ్రామంలో కోటగట్టు, దేవర గట్టు అనుసంధనంగా నూతనంగా నిర్మించే ఆన్‌లైన్ రిజర్వాయర్ సర్వే పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రైతులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ 2004 నుండి 2014 వరకు పదేళ్లపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒక్క ప్రాజెక్టునైనా పూర్తి చేశారా అని ఆయన ప్రశ్నించారు. 2010 నుండి 2014 మధ్య కాలంలో ఆంధ్రా ముఖ్యమంత్రులు 400 టిఎంసిల నీటిని తరలించుకుపోయి రిజర్వాయర్లను నిర్మించుకున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు దద్దమ్మలుగా మారి వారి జల దోపిడిని అరికట్టలేకపోయారని ఆయన విమర్శించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడున్నర ఏళ్లలోపే కల్వకుర్తి ప్రాజెక్టుకు ఉన్న 25 టిఎంసిల నీటి కెటాయింపును కృష్ణాబోర్డుతో చర్చించి 40 టిఎంసిలకు నీటి కెటాయింపులను పెంచడం జరిగిందని ,కల్వకుర్తి ప్రాజెక్టుకు న్యాయంగా రావాల్సిన 40 టిఎంసిల నీటిని ఎట్టి పరిస్థితుల్లో వాడుకునేందుకు వనపర్తి జిల్లాలో 10 ఆన్‌లైన్ రిజర్వాయర్లను నూతనంగా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 40 టిఎంసిల నీటి సామర్థం గల రిజర్వాయర్లను నిర్మించుకుంటే ఉమ్మడి పాలమూర్ జిల్లాలో వేల ఎకరాలు అదనంగా సాగులోకి వస్తాయని ఆయన తెలిపారు. ప్రతి ఎకరాకు కృష్ణమ్మనీటిని పారించి వ్యవసాయాన్ని సుభిక్షం చేయడమే తమ లక్షంగా ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గట్ల ఖానాపురం కోటగట్టు, దేవరగట్టు మధ్యలో నిర్మించే రిజర్వాయర్ ద్వారా 3వేల నుండి 5 వేల ఎకరాలు అదనంగా సాగులోకి వస్తుందని ఈ ప్రాంత రైతులు ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందేందుకు వీలుంటుందని ఆయన పేర్కొన్నారు. పల్లెల్లో సాగు,తాగునీటికి ఎలాంటి కొరత లేకుండా చూడడమే తమ లక్షమన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో గొలుసుకట్టు చెరువులు ఉన్నాయని వాటన్నింటిని అభివృద్ధి పరిచి రేపటి తరానికి ప్రాజెక్టులు ఎంతో ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నూతనంగా చేపట్టబోయే రిజర్వాయర్ల నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు వారు హర్షించే విధంగా నష్ట పరిహారం చెల్లిస్తామన్నారు. కార్యక్రమంలో మండల టిఆర్‌ఎస్ అధ్యక్షులు మేఘారెడ్డి, ఎంపిపి దయాకర్, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు జగదీశ్వర్‌రెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షులు విట్టా శ్రీనివాస్‌రెడ్డి, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు రాజప్రకాష్ రెడ్డి, సర్పంచ్ వెంకటేష్,ఎంపిటిసిలు జోరుషమ్మ,సత్యారెడ్డి, టిఆర్‌ఎస్ మండల కార్యదర్శి వేణు యాదవ్, నాయకులు నాగేంద్రం యాదవ్, బాలీశ్వర్‌రెడ్డి, రాంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments